Search
Saturday 17 November 2018
  • :
  • :

ఇంగ్లాండ్ బోణి

  • రూట్ అజేయ శతకం, రాణించిన హేల్స్, మోర్గాన్
  • తమీమ్ సెంచరీ వృథా, బంగ్లాకు తప్పని ఓటమి

England

లండన్: ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (128), వికెట్ కీపర్ ముష్ఫికుర్ రహీం (79) అద్భుత బ్యాటింగ్‌తో బంగ్లాకు భారీ స్కోరు అందించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మరో 16 బంతులు మిగిలివుండగానే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. జోయ్ రూట్ 133 (నాటౌట్) అజేయ సెంచరీతో ఇంగ్లాండ్‌ను గెలిపించాడు. ఓపెనర్ అలెక్స్ హేల్స్ (95), కెప్టెన్ మోర్గాన్ 75(నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు.
రూట్, హేల్స్ జోరు..
భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జాసన్ రాయ్ (1) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే తర్వాత వచ్చిన జోయ్ రూట్‌తో కలిసి మరో ఓపెనర్ హేల్స్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. దూకుడుగా ఆడిన హేల్స్ వరుస ఫోర్లతో బంగ్లా బౌలర్ల ను హడలెత్తించాడు. ఈ క్రమంలో ఏడు ఫోర్లతో 52 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే రూట్ కూడా ఈ మైలురాయిని చేరుకున్నాడు. నాలుగు ఫోర్లతో రూట్ అర్ధ సెంచరీని అందుకున్నాడు. అయితే 86 బంతుల్లో 11ఫోర్లు, రెండు సిక్సర్లతో 95 పరుగులు చేసిన హేల్స్‌ను షబ్బీర్ రహ్మాన్ పెవిలియన్ పంపించాడు. దీంతో అతను తృటిలో సెంచరీ ఛాన్స్‌ను కోల్పోయాడు. మరోవైపు రూట్ 129 బంతుల్లో 11 బౌండరీలు, ఒక సిక్స్‌తో 133 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మోర్గాన్ 61 బంతుల్లోనే 8ఫోర్లు, రెండు సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. అంతకుముందు తమీమ్ ఇక్బాల్ 142 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 128 పరుగులు సాధించాడు. రహీం 8ఫోర్లతో 79 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్ స్కోరు 305కు చేరింది.

Comments

comments