Home ఆఫ్ బీట్ విదేశీ విద్యకు ప్రవేశ మార్గాలు

విదేశీ విద్యకు ప్రవేశ మార్గాలు

ఫారిన్ స్టడీకి ఇంగ్లిష్ ప్రావీణ్యం తప్పనిసరి 

ప్రామాణిక పరీక్షల స్కోర్ ఆధారంగానే ప్రవేశాలు

విదేశీ విద్య…ప్రస్తుతం ప్రతి విద్యార్థి కల. ఒకప్పుడు సంపన్నవర్గాల పిల్లలే విదేశాలలో చదువుకునేవారు. కానీ ఇప్పుడు అన్ని వర్గాల విద్యార్థులు ఫారిన్ ఎడ్యుకేషన్‌పై దృష్టి సారిస్తున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబిఎ, ఎంఎస్ వంటి కోర్సులతో పాటు సాధారణ డిగ్రీలు చేసేందుకు కూడా విదేశాలకు వెళ్తున్నారు. మనదేశం నుంచి సుమారు 3.5 నుంచి 6 లక్షల మంది విద్యార్థులు ఏటా ఉన్నత చదువుల కోసం విదేశాలకు పయనమవుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లోని యూనివర్సిటీలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఆయా వర్సిటీలకు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు, చదువుకుంటూనే పార్ట్‌టైమ్ జాబ్స్ చేసే అవకాశం, చదువు తర్వాత అక్కడే ఉండి ఉద్యోగం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి సదుపాయాలు ఉండటంలో తమ పిల్లలను విదేశాలలో చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు.

lf

విదేశాలలో చదువుకోవాలనే కలను సాకారం చేసుకోవాలంటే ఇంగ్లీష్ ప్రావీణ్యం తప్పనిసరి. విదేశీ వర్సిటీల్లో ప్రవేశం పొందాలంటే పలు ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పరీక్షించే ప్రామాణిక పరీక్షలు, ఆప్టిట్యూట్ టెస్టుల్లో మంచి స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో సాధించిన స్కోర్ ఆధారంగానే ప్రవేశానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంగ్లిష్ విని అర్థం చేసుకోవడం, చదవడం, మాట్లాడటం, రాయడం వస్తేనే ఇంగ్లిష్ ప్రామాణిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధ్యమవుతుంది.
జిఆర్‌ఇ

gre
విదేశాలలో ఎంఎస్, ఎంబిఎ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు, ఫెలోషిప్‌లు, పిహెచ్‌డిల్లో ప్రవేశాలకు గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్(జిఆర్‌ఇ) రాయల్సి ఉంటుంది. ఈ స్కోర్ ఆధారంగా 130కిపైగా దేశాల్లో 3,200 విద్యాసంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. బ్యాచ్‌లర్ డిగ్రీ లేదా 16 ఏళ్ల విద్య పూర్తి చేసుకున్నవారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిఆర్‌ఇ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 21 రోజుల వ్యవధితో ఏడాదిలో ఐదు సార్లు ఈ పరీక్షకు హాజరుకావచ్చు. జిఆర్‌ఇ స్కోర్ ఐదేళ్ల వరకు చెల్లుబాటవుతుంది. జిఆర్‌ఇ జనరల్ పరీక్షతో పాటు బయాలజి, కెమిస్ట్రీ, లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజి సబ్జెక్టులలో నిర్వహిస్తారు. వీటి ద్వారా అభ్యర్థికి సంబంధిత రంగంలో పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. అలాగే జిఆర్‌ఇ జనరల్ టెస్ట్ ద్వారా వర్బల్ రీజనింగ్, కాంపిటేటివ్ రీజనింగ్, అనలిటికల్ రైటింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. ప్రముఖ యూనివర్సిటీల్లో సీటు రావాలంటే కనీసం జిఆర్‌ఇ స్కోర్ 140కి పైగా ఉండాలి. ఎంచుకున్న యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్‌ను బట్టి జిఆర్‌ఇ స్కోర్ మారుతూ ఉంటుంది.
వెబ్‌సైట్ : www.ets.org/gre
టోఫెల్

tolfet
టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్(టోఫెల్) పరీక్ష కూడా ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ఇంగ్లిష్ మాట్లాడని దేశాల విద్యార్థుల ఆంగ్ల భాషా సామర్థాన్ని పరీక్షిస్తారు. ఈ పరీక్షను అమెరికాకు చెందిన ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్(ఇటిఎస్) నిర్వహిస్తుంది. విద్య, ఉద్యోగ అవకాశాల కోసం అమెరికా, బ్రిటన్, కెనడా వంటి ఇంగ్లిష్ మాట్లాడే దేశాలకు వెళ్లాలనుకునే వారు ఈ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. టోఫెల్ స్కోర్‌ను 130 దేశాల్లోని 10 వేల విద్యాసంస్థలు ప్రామాణికంగా తీసుకుంటాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. మనదేశంలో హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రధాన పట్టణ కేంద్రాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. టోఫెల్ స్కోర్ రెండేళ్ల పాటు చెల్లుబాటవుతుంది. ఇంగ్లిష్ విని అర్థం చేసుకోవడం, చదవడం, మాట్లాడటం, రాయడం (రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్)లో పరీక్ష ఉంటుంది.
వెబ్‌సైట్ : www.ets.org/toefl
శాట్

sat

స్కోలాస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్(శాట్). అమెరికాతోపాటు మరికొన్ని దేశాలలోని యూనివర్సిటీలు అండర్ గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి శాట్ స్కోర్‌ను ప్రమాణాకంగా తీసుకుంటాయి. స్కాలర్‌షిప్, ఫెలోషిప్స్ అందించడానికి కూడా ఈ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ఈ పరీక్షను యూఎస్‌ఎలోని కాలేజ్ బోర్డ్, ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఇటిఎస్)లు నిర్వహిస్తున్నాయి. ఇంటర్ లేదా సిబిఎస్‌ఇ సీనియర్ సెకండరీ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతుంటారు. ఏడాదికి ఆరు సార్లు (జనవరి,మే, జూన్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన రెండు మిలియన్ల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతుంటారు. మనదేశం నుంచి ఏటా సుమారు 20 నుంచి 25 వేల మంది విద్యార్థులు శాట్ పరీక్షకు హాజరవుతుంటారు.
వెబ్‌సైట్ : www. sat.collegeboard.org
జీమ్యాట్

gmat
గ్రాడ్యుయేషన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(జీమాట్). ఈ పరీక్షను గ్రాడ్యుయేషన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. మనదేశంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బి), బిట్స్ పిలాని, ఐసిఎఫ్‌ఎఐ వంటి ప్రముఖ బిజినెస్ స్కూళ్లతోపాటు విదేశాలలోని సుమారు రెండు వేల బిజినెస్ స్కూల్స్ ఎంబిఎ, మేనేజ్‌మెంట్, అకౌంట్స్, ఫైనాన్స్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పరీక్షకు హాజరుకావచ్చు. ఈ పరీక్ష స్కోర్ ఐదేళ్లపాటు చెల్లుబాటవుతుంది. ఈ పరీక్షలో అలనిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, కాంపిటేటివ్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్ అంశాలు ఉంటాయి.
వెబ్‌సైట్ : www.mba.com
ఏ టెస్ట్…ఎప్పుడు
జిఆర్‌ఒ, టోఫెల్, జీమ్యాట్ పరీక్షలు ఏడాది పొడవుగా జరుగుతాయి. ముందస్తుగా ఆన్‌లైన్‌లో ఆయా వెబ్‌సైట్‌లలో రిజిష్టర్ చేసుకుని స్లాట్‌ను ఖరారు చేసుకోవాలి. జిఆర్‌ఇ పరీక్షకు ఒక సారి హాజరైతే 21 రోజుల వరకు మళ్లీ రాయడానికి అవకాశం ఉండదు. 21 రోజులకోసారి చొప్పున ఏడాదిలో ఎన్ని సార్లైనా హాజరుకావచ్చు. సంవత్సరంలో కొన్ని సార్లు మాత్రమే నిర్వహించే శాట్ పరీక్షను సాధారణంగా జనవరి,మే, జూన్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహిస్తుంటారు.

    ఎం.భుజగేందర్