Home మంచిర్యాల పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

police

*అటవీ శాఖ మంత్రి జోగు రామన్న 

మన తెలంగాణ/జన్నారం : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మండలంలోని తపాల్‌పూర్ అటవీశాఖ నర్సరీలో మూడు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నాటిన మొక్కలను మంత్రి జోగురామన్న పరిశీలించారు. ఈ నర్సరీలో సిఎం కెసిఆర్‌తో పాటు అటవీశాఖ మంత్రి జోగు రామన్న నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ సందర్భంగా నర్సరీ ప్రాంతా కలియ తిరిగారు. సిఎం, అటవీశాఖ మంత్రులు నాటిన మొక్కలు మాత్రమే ఏపుగా పెరిగాయి. మిగతావి సక్రమంగా పోషణ లేకపోవడంతో ఎండిపోయాయి. దీంతో సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ నర్సరీల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మొదటి విడత హరితహారంలో 16 కోట్లు, రెండో విడతలో 32 కోట్లు, మూడో విడతలో 36 కోట్ల మొక్కలను నాటడం జరిగిందని, వీటిని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో అనేక రకాల మొక్కలు నాటడం జరిగిందని వాటి రక్షణ కోసం సైతం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మొక్కలను నాటడం ముఖ్యం కాదని వాటిని పెంచిపోషించడం ముఖ్యమన్నారు. జన్నారంలో ఎఫ్‌డిఓ లేకపోవడంతో కాస్త ఇబ్బంది జరుగుతుందని, త్వరలోనే ఎఫ్‌డిఓను నియమిస్తామన్నారు. అనంతరం తపాల్‌పూర్ గ్రామంలో పోచమ్మ ఆలయంలో మంత్రి జోగు రామన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడి మహిళలు బోనాలతో పోచమ్మ వద్దకు వెళ్లి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఆయన వెంట జన్నారం, తాళ్లపేట రేంజ్ అధికారులు వెంకటేశ్వర్‌రావు, దేవిదాస్, జన్నారం, తపాలపూర్ సెక్షన్ అధికారులు ప్రకాష్, మమత, చింతగూడ సింగిల్ విండో చైర్మన్ సీపతిబుచ్చన్న, టిఆర్‌ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భరత్‌కుమార్, జాడి గంగాధర్,నాయకులు సిహెచ్ సత్యం, మున్వర్ ఆలీఖాన్, సుతారి వినయ్‌కుమార్, సుల్వ జనార్థన్, రాజేష్‌యాదవ్, విజయధర్మ, తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు అర్థరహితం
… రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని వారి ఉనికి కోసమే లేని పోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని అటవీశాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం 24 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, ఇందులో సైతం తెలంగాణ ప్రాంతానికే కాకుండా ఆంధ్రా ప్రాంతానికే అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు కట్టబెడ్టారని, అలాంటి వారు ఇప్పుడు నిష్ఫక్షపాతంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారని, మరో 20 సంవత్సరాల పాటు టిఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడున్నర సంవత్సరాల కాలంలోనే నిరుద్యోగ సమస్యను నిర్మించేందుకు 81 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఆర్థిక శాఖ సైతం ఆమోదం తెలిపిందని, త్వరలో వాటిని భర్తి చేస్తామన్నారు. ఈవిలేకరుల సమావేశంలో టిఆర్‌ఎస్ మండలాధ్యక్షులు భరత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి జాడి గంగాధర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముత్యం సతీష్, పొన్కల్ సింగిల్ విండో చైర్మన్ బాల్తా రాజమౌళి, టిఆర్‌ఎస్ నాయకులు సిహచ్ సత్యం, మున్వర్ అలీఖాన్, సుతారి వినయ్‌కుమార్, సుల్వ జనార్థన్,రాజేష్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.