Home వార్తలు ప్రపంచ రికార్డు సమం

ప్రపంచ రికార్డు సమం

దీపికా కుమారి అరుదైన ఘనత

‘ప్రపంచ రికార్డు గురించి అసలు తెలియదు. ఈ టోర్నీకి ముందు రికార్డు నమోదు చేయాలనే ఆలోచన కూడా లేదు. ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదల తోనే టోర్నీని ఆరంభించాను. ఈ ఏడాది జరిగే టోర్నీల్లో మరింత బాగా రాణించేందుకు ఈ రికార్డు స్కోరు దోహదపడుతుంది’

arrowషాంఘై : మాజీ ప్రపంచ నెం.1 రికర్వ్ ఆర్చర్ దీపికా కుమారి ప్రపంచ రికార్డును సమం చేసింది. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-1 పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో దీపిక 720 పాయింట్లకు గానూ 686 పాయింట్లు సాధించి దక్షిణ కొరియా ఆర్చర్ కి బో బే పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసింది. కి బో బే 2015 ఈ రికార్డును తన పేరిట నమోదుచేసుకుంది. ప్రపంచకప్‌లో గతేడాది(2015లో) రన్నరప్‌గా నిలిచిన దీపిక పొటీని ఘనంగా ఆరంభించింది. ప్రథమార్థంలోనే ప్రత్యర్థి ఆర్చర్‌లకు అందనన్ని పాయింట్లు సాధించిన దీపిక(346 పాయింట్లు) ద్వితీయార్థంలో మరో 340 పాయింట్లు నమోదుచేసింది. రికార్డును సమం చేయడానికి చివరి ఆరు బాణాలకు 59 పాయింట్లు సాధించాల్సిన దశలో తొలిమూడు షాట్లలో రెండు తొమ్మిది పాయింట్లు నమోదుచేసిన దీపిక చివరి మూడు బాణాలకు వరుసగా పదికి  పది పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డును సమం చేసింది. గతేడాదే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దీపికకు ఈ అరుదైన రికార్డు రియోకు ముందు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. కాగా 2011, 2012, 2013 ప్రపంచకప్‌లలో రజత పతకాలు సొంతం చేసుకున్న దీపిక గతేడాది మరోసారి రజత పతకాన్ని దక్కించుకుంది.