Home జనగామ కాంగ్రెస్… సచ్చిన శవంగా మారింది: ఎర్రబెల్లి

కాంగ్రెస్… సచ్చిన శవంగా మారింది: ఎర్రబెల్లి

జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

 

మన తెలంగాణ/దేవరుప్పుల:  ఎంపిటిసి, జడ్ పిటిసి ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా కార్మికులకు ఎర్రబెల్లి శుభాకాంక్షలు తెలిపారు.  జనగాం జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్‌లో బుధవారం జరిగిన కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక, సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సచ్చిన శవంగా మారిందని విమర్శలు గుప్పించారు. ప్రజల గుండెల్లో టిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉన్నదని, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై  ప్రజలకు నమ్మకం ఉందని అన్నారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల్లో నూతన సర్పంచులు సమస్యలపై తక్షణమే స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఎర్రబెల్లి సూచించారు. తెలంగాణలో మిషన్ భగీరథ పథకం ద్వారా నేడు ప్రజల గొంతు తడుస్తోందని కొనియాడారు. గతంలో మిషన్ భగీరథ పథకంపై ఎద్దేవా చేసిన వాళ్లే ముందుగా కెసిఆర్ అందిస్తున్న నీళ్లు తాగుతున్నారన్నారు.

మరో నెల రోజుల్లో వృద్ధులకు రూ.2016, నిరుద్యోగులకు రూ.3016 అసరా పెన్షన్లు అందిస్తామన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే అభివృద్ది పరుగులు పెడుతుందని, ప్రతి గ్రామ చెరువును గోదావరి జలాలతో నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పకొచ్చారు. పార్టీ కోసం కష్ట పడ్డ కార్యకర్తలందరికి సముచిత స్థానం వస్తుందని, రాజకీయాల్లో సహనం, ఓపిక ముఖ్యమని సూచించారు. గల్లీ నుంచి డిల్లీ దాకా గులాబీ జెండా ఎగురవేయాలని, తెలంగాణ రాష్ట్ర సమితితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎర్రబెల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు జన్ను జకార్య, స్థానిక ఎంపిపి సోమయ్య, మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్, టిఆర్ఎస్ జడ్పిటిసి అభ్యర్థి భార్గవి, ఎంపిటిసి అభ్యర్థులు, నాయకులు జలెందర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, వృకోదర్‌రెడ్డి, సోమయ్య, అంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

 

Errabelli Dayakar Rao Comments on Congress Party