Home మెదక్ ఎర్రవల్లి…మంత్రనగరి

ఎర్రవల్లి…మంత్రనగరి

అయుత చండీయాగానికి అనూహ్య స్పందన రావడంతో జిల్లాలోని గజ్వేల్‌తో పాటు జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనం ముఖ్యంగా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అంతా ఆహ్వానితులేనని సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటించిన పిలుపునందుకుని జనం భారీగా తరలి రావడం జరిగింది. అయితే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండడంతో అంతా ప్రశాంతంగా యాగ నిర్వహణను పరిశీలించారు. పార్కింగ్‌ను నాలుగు చోట్ల ఫామ్ హౌస్ సమీపంలో ఏర్పాటు చేశారు.

YAGAMమన తెలంగాణ ప్రతినిధులు / గజ్వేల్/ జగదేవ్‌పూర్/ వర్గల్/ములుగు : ఎర్రవల్లి మంత్రనగరిగా మారింది. వేదమంత్రాలు, పూజలు, హోమాలతో మార్మోగుతోంది. భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలి వస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా యాగ స్థలికి చేరుకున్నారు. ఇక మహిళలు వేలాదిగా తరలి వచ్చి కుంకు మార్చనలో పాల్గొన్నారు. ఎర్రవల్లి గ్రామంతో పాటు గజ్వేల్ ప్రాంత మహిళలకు ప్రాథాన్యత నిచ్చారు. ఈ అర్చనలో పాల్గొన్న మహిళలకు పసుపు, కుంకుమతో పాటు లడ్డూ ప్రసాదంతో పాటు చీరను కూడా పంచారు. తొలుత గవర్నర్ సతీమణి చీరలను పంచగా, ఆ తర్వాత ఎంపి కవిత చీరలను పంచి పెట్టారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వయంగా ఈ అర్చన చేయించారు. రెండు వేల మంది రుత్వికులు వేద మంత్రాలు చదువుతూ పూజలు చేయడంతో ఆ ప్రాంత మంతా మంత్ర నగరిగా మారింది. రుత్వికు లకు, విఐపిలకు, మీడియాకు, సాధారణ ప్రజానికానికి వేర్వేరుగా భోజనాలు ఏర్పాటు చేయడంతో అంతా ప్రశాంతగా భోజనం ముగించారు. అన్నంతోపాటు రవ్వ సిరా, అరటి బజ్జీలు, చారు, అలసంద ఫ్రై, వంకాయ కూర, ఆకుకూర పప్పు వడ్డించారు. ఇక గడ్డ పెరుగు హైలెట్‌గా నిలిచింది. వంటకాలు రుచికరంగా ఉండడం, వేడిగా ఉండడంతో అంతా సంతృప్తి వ్యక్తం చేశారు. యాగశాల చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేయడం ద్వారా యాగానికి ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బారికేడ్ల ఇవతలి వైపు నుంచి యాగస్థలి చుట్టూ భక్తులు కలియ తిరిగేందుకు ఈ సదుపాయం కల్పించారు. తద్వారా వచ్చిన వేలాది మంది కూడా యాగం దృశ్యాన్ని కళ్లారా చూశారు. ప్రత్యేక మార్గంలో వచ్చిన వారికి కుర్చీలు వేశారు. ఇక ఇతరులకు కింద కూర్చోని ఎల్‌ఇడి టివిల్లో చూశారు. అనంతరం తిరుగు ప్రయాణంలో బైటికి వచ్చే మార్గంలో భక్తులందరికీ చండీయాగం ప్రాశసస్తాన్ని తెలిపే పుస్తకాలను, పసుపు-కుంకుమను, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఇక పోలీస్ చెక్ పోస్టులను వరదరాజపూర్ వద్ద, నర్సన్నపేట శివారులో ఒకదాన్ని, ఎర్రవల్లిలో రెండు చోట్ల, శివారు వెంకటాపురం చౌరస్తాలో ఒకటి ఏర్పాటు చేశారు. విఐపిలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అదే విధంగా సాధారణ ప్రజలు కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఏర్పాట్లు జరిగాయి. విఐపిలు యాగస్థలికి వచ్చిన దగ్గర్నుంచి తిరుగు ప్రయాణమయ్యే వరకు వారి వెంట ఉండి ఏర్పాట్లు చూశారు. కొందరు పోలీస్ అధికారులు, ఇక మీడియా ప్రతినిధులు కొందరు పసుపు పచ్చని దీక్షా వస్త్రాలు ధరించి యాగశాలలో తిరగడం కనిపించింది. సివిల్ డ్రస్సులో ఉన్న వారికి అనుమతి లేకపోవడంతో వారు ఈ విధంగా డ్రెస్ కోడ్‌ను పాటించారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్‌పి సుమతి యాగశాల వద్ద కలియ తిరుగుతూ ఏర్పాట్లను, బందోబస్తును పరిశీలించారు. సిఎంఓ అధికారిణి స్మితా సబర్వాల్, హైద్రాబాద్ కలెక్టర్ రాహుల్‌బొజ్జా యాగ స్థలికి వచ్చారు. జడ్‌పి సిఇఓ వర్ణిణి, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్, డిసిసిబి ఛైర్మన్ దేవేందర్‌రెడ్డి తదితరులు కనిపిం చారు. సినిమా సెట్టింగ్‌ను తలదన్నే రీతిలో యాగశాలను, కాటేజీలను నిర్మించారు, భారీ వాన కురిసినా యాగానికి అంతరాయం కలగకుండా వాటర్‌ప్రూఫ్ కవర్లను కప్పారు. డిసిసిబి ఛైర్మన్ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఈ యాగం జరుగుతోందని, భక్తి పారవశ్యం వెల్లి విరియడంతో లోకకళ్యాణం కోసం ఈ యాగాన్ని చూసేందుకు ఇంత మంది తరలి వచ్చారన్నారు. వృద్దులు, మహిళలు భక్తి పారవశ్యంతో సంబరపడ్డారు. గవర్నర్ దంపతులు ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో రాగా, వారికి శివారు వెంకటాపూర్ హెలిప్యాడ్ వద్ద మ్రంతులు హరీశ్‌రావు, కెటిఆర్, ఎంపి కెపిఆర్‌లు ఘన స్వాగతం పలికారు. ఈనాడు అధినేత రామోజీ రావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్‌లు మరో హెలిక్యాప్టర్‌లో వచ్చా రు. యాగ స్థలి వద్ద వారికి ఘన స్వాగతం లభించింది. సిఎం కెసిఆర్ వారిని సాదరంగా ఆహ్వానించారు. కుశల ప్రశ్నలు వేశారు. వీరిని కెసిఆర్ శాలువాతో సన్మా నించారు. ఇక రవిశంకర్ తను తెచ్చిన ప్రసాదాన్ని కెసిఆర్‌కు బహుకరిం చారు.
కరీంనగర్ నుంచి పాదయాత్రగా …
కరీంనగర్ జిల్లా పాలకుర్తి నుంచి నాలుగు రోజుల క్రితం పాదయాత్రగా బయలు దేరిన భక్తులు యాగస్థలికి చేరుకున్నారు. 120 కిలో మీటర్లు వీరు పాదయాత్ర చేశారు. ఈ యాగం విజయవంతం కావా లని ఆకాంక్షిస్తూ ఈ పాదయాత్రను చేప ట్టారు. ధారావత్ మోహన్ గాంధీ, పొన్నం యాకయ్య, డాక్టర్ రాములు, మార్కెండేయ తదితరులు ఈ పాదయాత్ర బృందంలో ఉన్నారు. ఉదయం నుంచి మధ్నా హ్నం వరకు పూజా కార్యక్రమాలు జరగ్గా, ఆ తర్వాత ధార్మిక ప్రవచనాలు జరిగాయి. సాయంత్రం పూట కోటి సవాక్ష రిపురశ్చరణం, విశేష పూజా, ఆశ్లేషాబలి, అష్టావదాన సేవ నిర్వహించారు. రాత్రి శ్రీరామ లీల హరికథా కాలక్షేపం జరిగింది. భక్తులు సాయం వేళల్లో కూడా ఈ కార్యక్రమాలను తిలకించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో నగర పంచాయతీ ఛైర్మన్ భాస్కర్, టిఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి భూమిరెడ్డి,ఎర్రవల్లి సర్పంచ్ భాగ్యాబాల రాజ్,ఎంపిటిసి భాగ్యవెంకటయ్య,విడిసిఛైర్మన్ కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.