Home ఆదిలాబాద్ ఇవి ఉన్నాయని తెలుసా?

ఇవి ఉన్నాయని తెలుసా?

ESI to Labour

ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి: చిరు ఉద్యోగులు, కార్మికులు అనారోగ్యానికి గురైనా వారికి ఒక్కటే భరోసా.. ఈఎస్‌ఐ ఆదుకుంటుందని. చేతిలో డబ్బులు లేకపోయినా ఉచితంగా వైద్య సేవలందిస్తారని ధీమా. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈఎస్‌ఐ పరిమితిని పెంచడంతో వేలాది మంది కార్మికులు కొత్తగా దీని పరిధిలోకి రానున్నారు. ఇప్పటికీ చాలా మందికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే (కార్మిక రాజ్య బీమా సంస్థ) వైద్య సేవలందించే సంస్థగానే అందరికీ తెలుసు, కానీ అంతకుమించి ఎన్నో పథకాలు ఈ సంస్థ ద్వారా అమలు చేస్తున్నారో.. అవేంటో ఒక్కసారి చూస్తే..

ఎవరెవరు అర్హులు..

ఏదైనా సంస్థ లేదా పరిశ్రమల్లో పని చేస్తూ 15వేల రూపాయల కంటే తక్కువ వేతనం పొందే వారికి మాత్రమే ఈఎస్‌ఐసీ వర్తిస్తుంది. తాజా గా ప్రభుత్వం ఈ పరిమితిని రూ.21 వేలకు పెంచుతూ ప్రభుత్వం సెప్టెంబరులో ఆదేశాలు జారీ చేసింది. ఓ సంస్థ లేదా పరిశ్రమ లేదా దుకాణంలో పది మంది కంటే ఎక్కువ కార్మికులు, ఉద్యోగులు ఉంటే వారికి ఈఎస్‌ఐసీ వర్తిస్తుంది. ఓ చిన్న కుటీర పరిశ్రమలో పనిచేసే కూలీ అయినా, భారీ పరిశ్రమలో కార్మికులు, ఉద్యోగులు అయినా కూడా దీని పరిధిలోకి వస్తారు.

ఇదీ విధానం.. ప్రతి కార్మికుడి జీతంలో నుంచి

1.17 శాతం ఈఎస్‌ఐసీకి చెల్లించాలి. ఇందుకు యాజమాన్యం, లేదా యజమాని మరో 4.75 శాతం జోడిస్తారు. ఒక్కొసారి ఇందులో నమోదైతే ఈ మొత్తం ఈఎస్‌ఐకి నేరుగా వెళ్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, దుకాణాల్లో పనిచేసే పొరుగు సేవలు లేదా ఒప్పంద కార్మికులు కూడా దీనికి పరిధిలోకి వస్తారు. ఒక కార్మికుడు సంస్థ లేదా పరిశ్రమలో చేరిన వెంటనే ఈఎస్‌ఐ నమోదు చేస్తారు. అదే రోజు కార్మికుడు ఏదైనా ప్రమాదానికి గురైన కూడా ప్రయోజనాలు, సౌకర్యాలు పొందుతాడు.

సూపర్‌స్పెషాలటీ ఆసుపత్రిలోనూ..

ఈఎస్‌ఐ ద్వారా కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యాలయాలు ఉన్నాయి. జిల్లాల్లో ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమని ఆయా ప్రాంతాల్లో ప్రాథమిక ఆసుపత్రి వైద్యాధికారి నిర్ధారిస్తే ఈ ప్రధానాసుపత్రికి పంపిస్తారు. అక్కడ రోగికి సరిపడే వైద్య సదుపాయం లేకుంటే సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి పంపిస్తారు. అక్కడయ్యే ఖర్చు మొత్తం ఈఎస్‌ఐ చెల్లిస్తుంది. అత్యవసర సమయాల్లో నేరుగా సూపర్‌స్పెషాలిటీ ఆసుప త్రికి తీసుకెళ్లవచ్చు. ఈ సేవలు వర్తించాలంటే కార్మికుడికి సంస్థలో మూడు నెలల సర్వీసు తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడు నెలల్లో కూడా కనీసం 39 రోజుల పాటు పని చేసి ఉండాలి. కార్మికుడి కుటుంబ సభ్యులకు వైద్యసౌకర్యాలు అందాలంటే కనీసం ఆరు నెలల సర్వీసు ఉండాలి. కనీసం 78 రోజుల పాటు పని చేసే తీరాలి. సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో రూ.10 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. అంతకంటే ఎక్కువ అవసరమైతే డైరెక్టర్ జనరల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

బయోమెట్రిక్ కార్డు తప్పనిసరి

ఈఎస్‌ఐసీలో చేరే కార్మికుడు సమీపంలోని ఉండే ఈఎస్ ఐసీ కార్యాలయానికి పెళ్లి బయోమెట్రిక్ కార్డు పొందాలి. ఇందుకోసం కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లి ఫోటో దిగాల్సి ఉంటుంది. ఆ కార్డు ద్వారానే వైద్య సౌకర్యాలు అందుకోవాలి.

అనారోగ్యానికి గురైతే..

కార్మికుడు అనారోగ్యంగా ఉండి సెలవు పెట్టినట్టయితే అతడికి గరిష్ఠంగా 91 రోజుల పాటు ఈఎస్‌ఐ ద్వారా అతడి జీతంలో 70 శాతాన్ని అందిస్తారు. ఇందుకోసం 9 నెలల పాటు కార్మికుడికి సర్వీసు ఉండాలి. ఇందులో ఆరు నెలల్లో కనీసం 78 రోజులపాటు తప్పనిసరిగా పని చేసి ఉండాలి.

ఎక్‌స్‌టాన్డ్ బెనిఫిట్

 ఈ పథకం కిందకు 34 వ్యాధులు వస్తాయి. ఇందులో క్యాన్సర్, క్షయ, ఎయిడ్స్ వంటివి వ్యాధులూ ఉన్నాయి. 91 రోజులు దాటి సెలవులో ఉన్న వారికి జీతంలో 80 శాతం మొత్తానికి ఈఎస్‌ఐ చెల్లిస్తుంది. ఇందుకోసం కనీసం రెండేళ్ల సర్వీసు ఉండాలి.
కుటుంబ నియంత్రణకు..
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకునే వారికి కూడా ప్రత్యేక రాయితీలు అందిస్తారు. కార్మికుడు చేయిం చుకుంటే అతడికి ఏడు రోజుల పాటు సెలవుకు జీతాన్ని, మహిళా కార్మికురాలు ఆపరేషన్ చేయించుకుంటే 14 రోజులపాటు సెలవుతో కూడిన జీతం చెల్లిస్తారు.

అంగవైకల్యం ఏర్పడితే..

కార్మికుడికి తాత్కాలిక అంగవైకల్యం ఏర్పడితే వారికి 90 శాతం జీతాన్ని ఈఎస్‌ఐసీ వారు చెల్లిస్తారు. పూర్తి స్థాయిలో అగవైకల్యానికి గురైతే జీతంలో కనీసం 40 శాతం అంది స్తారు. ఇది జీవితాంతం ఆ కార్మికుడికి పింఛన్ రూపంలో అందుతుంది. అతడు ఆ తరువాత పని చేస్తున్నా, పనిచే యలేక పోయినా ఇది చెల్లిస్తూనే ఉంటారు.

మృతి చెందితే..

కార్మికుడు మృతి చెందితే అతను అప్పటికి అందుకుంటున్న జీతంలో 90 శాతాన్ని అతడి భార్యబిడ్డలకు జీవితాంతం అందిస్తారు. అయితే కార్మికుడి భార్య మరో వివాహం చేసు కోకూడదు. కుమారుడికి 25ఏళ్ల వరకూ, కుమార్తెకు వివా హం జరిగే ఈ మొత్తం అందుతుంది. కార్మికుడు సాధారణ లేదా ప్రమాదవశాత్తూ మరణించినా దహన సంస్కారాలకు రూ.10వేలు అందిస్తారు.