Home దునియా తెలుగువారి తొలి పండుగ ఉగాది!

తెలుగువారి తొలి పండుగ ఉగాది!

Ugadi Festivalశ్రీ వికారి నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారు జరుపుకునే పండుగ ఉగాది. మొదటి రుతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి పక్షం శుక్లపక్షం.. ఇవన్నీ ఒకటిగా కలిసి వచ్చే పండుగ ఉగాది. హిందూ సంప్రదాయంలో పం డుగలన్నీ దైవారాధనతో జరుపుకోవడం ఆనవాయితీ. కానీ ఉగాది మాత్రం కాలాన్ని స్వాగతించే పండుగ. కొత్త ఆలోచనకు, కొత్త ఆచరణకు, కొత్త లక్షానికి, కొత్త యుగానికి ఆరంభం ఉగాది.

ఈ రోజు నుంచే తెలుగువారికి కొత్త సంవత్సరం. చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు. ఈ రోజునే బ్రహ్మసమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారంతో సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఈ రోజే. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాదినాడే. మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ, పుడమితల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే ప్రారంభమవుతుంది. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు ‘గుడి పడ్వా’, మలయాళీలు ‘విషు’, సిక్కులు ‘వైశాఖీ’, బెంగాలీలు ‘పాయ్‌లా బైశాఖ్’, తమిళులు ‘పుత్తాండు’ అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం విశేషం.

* షడ్రుచుల సమ్మేళనం
ఈ పండక్కి మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం ఉగాది పచ్చడి. కొత్త చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేపపువ్వు, మిరియాలు, అరటిపండ్లు మొదలైన పదార్థాలను ఉపయోగించి ఉగాది పచ్చడిని తయారుచేస్తారు. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులూ జీవితంలోని బాధ, సంతోషం, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలనూ ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని చెబుతుందీ పచ్చడి.

* ఉగాది రోజున ఏం చేయాలంటే…
ఉగాది పండగను ఎలా జరుపుకోవాలన్నదానికి శాస్త్రం ఒక క్రమ పద్ధతిని సూచించింది. సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. పెద్దవారితో నువ్వుల నూనెను తలమీద పెట్టించుకుని, నలుగుపిండితో అభ్యంగన స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. పరగడుపునే ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. సాయంత్రం వేళ దేవాలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని తప్పక వినాలని చెబుతారు పెద్దలు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఈ అయిదు అంగాల కలయికనే పంచాంగం అంటారు. మనకు పదిహేను తిథులు, ఏడు వారాలు, ఇరవై ఏడు నక్షత్రాలు, ఇరవై ఏడు యోగాలు, పదకొండు కరణాలు ఉన్నాయి. వీటన్నింటి గురించీ పంచాంగం వివరిస్తుంది. వీటితోపాటు నవగ్రహాల సంచారం, వివాహాది శుభకార్యాల ముహూర్తాలూ, ధరలూ, వర్షాలూ, వాణిజ్యం… ఇలా ప్రజలకు అవసరమైన వాటికి అధిపతులు ఎవరూ, అందువల్ల కలిగే లాభనష్టాలు ఏమిటీ వంటి విషయాలతోపాటు దేశ స్థితిగతులను కూడా పంచాంగంలో ప్రస్తావిస్తారు.

భారతీయుల కాలగణనలో 60 సంవత్సరాలున్నాయి. వీటికి ప్రత్యేకంగా పేర్లున్నాయి. వాటిల్లో ప్రభవ నుంచి వ్యయ వరకు ఉన్న 20 సంవత్సరాలను బ్రహ్మవింశతి అని, సర్వజిత్తు నుంచి పరాభవ వరకు ఉన్న 20 సంవత్సరాలను విష్ణువింశతి అని, ప్లవంగ నుంచి క్షయ వరకు ఉన్న చివరి 20 సంవత్సరాలను శివ వింశతి అని వ్యవహరిస్తారు. వికారి నామ సంవత్సరం విష్ణు వింశతి సంవత్సరాలలో పదమూడోది.

జన్మరాశి తెలియని వారు ఈ కింది విధంగా రాశిఫలాలను తెలుసుకోవచ్చు…
* జనన తేదీ మార్చి 21- ఏప్రిల్ 20: మేషరాశి
* ఏప్రిల్ 21- మే 21: వృషభం
* మే 22- జూన్ 21: మిథునం
* జూన్ 22- జులై 22: కర్కాటకం
* జులై 23- ఆగష్టు 23: సింహం
* ఆగష్టు 24- సెప్టెంబర్ 22 : కన్య
* సెప్టెంబర్ 23- అక్టోబర్ 23: తుల
* అక్టోబర్ 24- నవంబర్ 22 : వృశ్చికం
* నవంబర్ 23- డిసెంబర్ 21 : ధనుస్సు
* డిసెంబర్ 22- జనవరి 20 : మకరం
* జనవరి 21- ఫిబ్రవరి 18: కుంభం
* ఫిబ్రవరి 19- మార్చి 20: మీనం

ఉగాది కృత్యం
చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజు ఉగాది పండుగ జరుపుకోవడం తెలుగు ప్రజల ఆనవాయితీ. తెలుగువారు చాంద్రమానం పాటిస్తుండగా, తమిళులు సౌరమానం పాటిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు. ఉదయమే అభ్యంగన స్నానం ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి, ఇష్ట దైవాన్ని ప్రార్థించడం, అనంతరం షడ్రుచులతో కూడిన (తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు) ఉగాది పచ్చడిని తినడంతో పండుగ ప్రారంభమవుతుంది. అలాగే పంచాంగ శ్రవణం ద్వారా ఆ ఏడాది దేశ కాలమాన పరిస్థితులు, జాతక విశేషాలు తెలుసుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడపడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉగాది రోజున పాటిస్తారు.

పంచాంగ సారాంశం
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడినదే పంచాంగం. తిథులు శ్రేయస్సుకు, వారాలు ఆయుర్వృద్ధికి, నక్షత్రాలు పాప పరిహారానికి, యోగాలు రోగ నివారణకు, కరణాలు కార్యసిద్ధికి తోడ్పడతా యి. ఈ పంచాంగ శ్రవణం వింటే శుభం కలుగుతుంది. శత్రు, రుణ బాధలు, చెడు ఫలితాలు తొలగుతాయని నమ్మకం. పాడ్యమి నుంచి పౌర్ణమి/ అమావాస్య వరకు గల వాటిని తిథులని, ఆదివారం నుంచి శనివారం వరకు గల వాటిని వారాలని, అశ్వని నుంచి రేవతి వరకు గల వాటిని నక్షత్రాలని, విష్కంభము నుంచి నైధృతి వరకు గల వా టిని యోగములు, బవ నుంచి కింస్తుఘ్నం వరకు పదకొండింటినీ కరణములుగా పిలుస్తారు. 27 నక్షత్రాలకు 27 యోగాలు వరుస క్రమమున వస్తా యి. తిథుల ఆధారంగా కరణములు ఏర్పడతాయి. చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీవికారినామ సంవత్సరంగా పిలుస్తారు. బార్హస్పత్యమానం ప్రకారం విరోధికృన్నామ సంవత్సరమని, గురు దయాబ్ధముచే ఆషాఢాబ్దమని పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 33వది వికారినామ సంవత్సరం. అధిపతి చంద్రుడు. ఈ ఏడాది వస్త్రదానం శుభదాయకం. చంద్రుని ఆరాధించిన బుద్ధి కుశలత, మనశ్శాంతి చేకూరుతుంది.

కర్తరి
04.05.2019 చైత్ర బ.అమావాస్య శనివారం సా.5.34గంటలకు డొల్లు కర్తరి (చిన్న కర్తరి) ప్రారంభం. 11.05.2019 వైశాఖ శు.సప్తమి శనివారం రా.3.27 గంటలకు నిజ కర్తరి ప్రారంభం.
29.05.2019 వైశాఖ బ.దశమీ బుధవారం ప. 12.29 గంటలకు కర్తరి త్యాగం. (పరిసమాప్తం)

మూఢములు
13.12.2019 శుక్రవారం, మార్గశిర శు.విదియ రా.1.11గంటలకు పశ్చాదస్తమిత గురుమూఫమి ప్రారంభం 10.01.2020 గురువారం, పుష్య శు. పౌర్ణమి రా.10.23 గంటలకు మూఢమి త్యాగం.

శుక్ర మూఢమి
08.07.2019 సోమవారం, ఆషాఢ శు.సప్తమి రా.2.38 గంటలకు శుక్రమూఢమి ప్రారంభం.
20.09.2019 శుక్రవారం, భాద్రపద శు.షష్ఠి ఉ.6.07 గంటలకు శుక్రమూఢమి త్యాగం.

మకర సంక్రమణం
శ్రీవికారినామ సంవత్సరం పుష్య బహుళ పంచమి బుధవారం అనగా 15.01.2020వ తేదీ ఉదయం 7.36 గంటలకు రవి మకరరాశి ప్రవేశం. ఉదయాది రెండవ ముహూర్త కాలంలో రవి మకర రాశి ప్రవేశం శుభదాయకం.

పుష్కర నిర్ణయం
శ్రీ వికారినామ సంవత్సర కార్తీక శుద్ధ అష్టమీ సోమవారం అనగా 04.11.2019 వ తేదీ తె. 5.18గంటలకు(తెల్లవారితే మంగళవారం) గురు డు ధనుస్సు రాశిలో ప్రవేశం. అనగా 05.11.2019 వ తేదీ నుంచి 12రోజుల పాటు బ్రహ్మపుత్రానదీ(పుష్కరవాహిణి) జరుగుతాయి. టిబెట్‌లోని ఉత్తర హిమాలయాల ప్రాంతంలో పుట్టిన ఈ నది భారతదేశం, బంగ్లాదేశ్‌ల గుండా ప్రవహిస్తుంది. ఇది ఈశాన్య రాష్ట్రాలలోని అరుణాచలప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలో ప్రవహిస్తుంది.

గ్రహణాలు
ఆషాఢ శు.పౌర్ణమి మంగళవారం అనగా 16.07.2019వ తేదీ రాత్రి 1.31గంటలకు కేతుగ్ర స్త చంద్రగ్రహణం. వాయువ్యదిశలో స్పర్శ, ఆగ్నే య దిశలో మోక్షం. ఉత్తరాషాఢ నక్షత్రంలో గ్రహణం సంభవిస్తుంది. ధనుస్సు, మకర రాశుల వారు చూడరాదు. రాత్రి 1.31గంటలకు ప్రారంభమై 4.29గంటలకు మోక్షకాలం ఉంటుంది.

పాక్షిక సూర్యగ్రహణం
మార్గశిర బ.అమావాస్య గురువారం అనగా 26. 12.2019వ తేదీ ఉదయం గంట.8.11లకు పాక్షిక కేతుగ్రస్త సూర్యగ్రహణం. ఉత్తర ఈశాన్య స్పర్శ,
నైరుతిలో మోక్షం. మూలా నక్షత్రంలో గ్రహణం సంభవిస్తుంది. ధనుస్సు రాశి వారు దీనిని చూడరాదు. ఈ రాశి వారు యథావిధిగా మరుసటి రోజు పరిహారాలు చేసుకోవాలి. ఉదయం 8.11గంటలకు ప్రారంభమై 11.20గంటలకు మోక్షకాలం.

Essay on Telugu New Year Ugadi Festival