Home ఎడిటోరియల్ ప్రజలకు ప్రగతి నివేదన!

ప్రజలకు ప్రగతి నివేదన!

Every form of the people's will is government

ప్రజల కోసం, ప్రజల ద్వారా ఏర్పడే పరిపాలనా విధానమే ప్రజాస్వామ్యం. ప్రజల సంకల్పానికి ప్రతిరూపం ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షలకు ప్రతీకలు పాలకులు, పరిపాలన. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జరగని పాలనలో వ్యతిరేకతలు, నిరసనలు, ఉద్యమాలు ఉద్భవిస్తాయి. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఉద్యమం ఉవ్వెత్తునఎగిసింది. ప్రజా సంకల్పం, ప్రమేయంతో తెలంగాణ ఆవిర్భవించింది. ఆ ఉద్యమ నేత కెసిఆర్, ప్రభుత్వాధినేత అయ్యారు. బంగారు తెలంగాణను సాకారం చేస్తున్నాన్న సిఎం కెసిఆర్ పాలనకు నాలుగన్నరేళ్ళు గడిచాయి.

ఈ నాలుగున్నరేళ్ళల్లో జరిగిన ప్రగతి ఏంటి? ఇచ్చిన హామీలేంటి? అందులో నెరవేరినవి? నెరవేరనవి? ఇంకా నెరవేర్చాల్సినవి ఎన్ని? అసలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన సాగిందా? ఇలా ఏ ప్రభుత్వ పనితీరునైనా కొలవాల్సిన సమయం వస్తుంది. ఐదేళ్ళ కాలంలో ఆ పని ప్రతిపక్షాలు, పత్రికలు, విమర్శకులు చేస్తూనే ఉంటారు. ప్రజలు ఎప్పటికప్పడు సమీక్షించుకుంటూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు వారి తీర్పునిస్తూనే ఉంటారు. కానీ స్వీయ పరీక్షకు కెసిఆర్లా పూనుకోవ డానికి ‘గట్స్’ ఉండాలి. అంతకంటే తన పనితీరుపై, ప్రజలపై అచంచల విశ్వాసం ఉండాలి. ఇదిగో.. నేను చెప్పింది ఇది. చేసింది ఇది. అని చెప్పగలిగే నిజాయితీ, ధైర్యం కెసిఆర్కు ఉన్నాయి కాబట్టే ఆయనే నేరుగా ప్రజలను ఒక చోటకు పిలిచి మరీ తన ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతకం చేయించుకోవాలనుకుంటున్నారు. అందుకే ప్రగతి నివేదిక సభను చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్నారు.

నిజానికి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందనడానికి సంకేతమే ప్రగతి నివేదిక సభ. ప్రజలకు ఏదైనా చేయాలనే సంకల్పం ఉంది గనుకే. ఎంతో కొంత చేశారు గనకే ఆయన ప్రజల వద్దకు వెళుతున్నారు. తాను చేపట్టిన పథకాలు, వాటి ఫలితాలు ప్రజలకు చేరాయన్న నమ్మకం ఉంది గనకే ఆయన నేరుగా తనను ఎన్నుకున్న ప్రజల వద్దకు వెళుతున్నారు. సరిగ్గా ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకలా కనిపిస్తున్నది.

ప్రభుత్వాల గత చరిత్రను పరిశీలిస్తే…. ఎక్కడా ఇలా ప్రజలకు ప్రభుత్వ ప్రగతి నివేదికను సమర్పించడానికి ప్రయత్నించిన దాఖలాలు కనిపించవు. ఐదేళ్ళ ప్రభుత్వాల పాలన మీద సహజంగానే వ్యతిరేకతలుంటాయి. ఆ వ్యతిరేకతలు ఒక్కోసారి పాలకులను భయకంపితులను చేస్తుంటాయి. అధికారానికి దూరమవుతామనే ఆందోళన కలిగిస్తాయి. అవసరమైన, అర్థవంతమైన పథకాలు, వాటి ఫలితాలు, సమర్థవంతమైన పాలన సాగిందన్న ఆత్మ విశ్వాసం లేకపోతే అసలు ప్రజలకు ప్రభుత్వం తన ప్రగతి నివేదికను సమర్పించానుకోవడమే వినూత్నం. విశేషం.

సామాజిక ఆర్థిక ప్రగతి, ద్రవ్య నిర్వహణ, పారదర్శకత -జవాబుదారీతనం వంటి రంగాల్లో మెరుగైన ప్రమాణాలు పాటిస్తున్న దేశ వ్యాప్త రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానం వైపు దూసుకెళుతున్నది. ద్రవ్య నిర్వహణలో మొదటి స్థానంలో, సామాజిక భద్రతలో రెండో స్థానంలో, ఆర్థిక స్వేచ్ఛలో మూడో స్థానంలో, పాలనలో పారదర్శకత- జవాబుదారీ తనంలో ఐదవ స్థానంలో నిలిచింది. మరికొన్ని రంగాల్లో 10వ స్థానానికి కొద్ది అటు ఇటుగా ఉన్నది. ఓవరాల్గా చూస్తే, ఆంధ్రప్రదేశ్ సహా, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణ అత్యుత్తమమైన స్థానాలే దక్కించుకున్నది. ఇది చరిత్రాత్మకం. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ కేవలం నాలుగేళ్ళ స్వేచ్ఛాయుత స్వతంత్ర పాలనలో ఈ ఉత్తమ స్థానం దక్కించుకోవడం అంత సులువైన అంశమేమీ కాదు. స్వతంత్ర భారతావనిలో ఇది సువర్ణాధ్యాయం. తెలంగాణ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రాభవానికి ఇది ప్రారంభం. దేశంలోని 30 రాష్ట్రాల పరిపాలన పద్ధతులు, ప్రభుత్వాలు ప్రజలపట్ల వ్యవహరిస్తున్న తీరుతెన్నులు, ప్రజల సంతుష్ట స్థాయిలను పరిగణనలోకి తీసుకుని 24 ఏళ్ళుగా మదింపు చేస్తోన్న పబ్లిక్ అఫేర్స్ సెంటర్ ఇచ్చిన సారాంశం. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ గత మూడేళ్ళుగా దేశంలోని రాష్ట్రాల పనితీరుని ప్రకటిస్తున్నది. ఆ సంస్థ తాజా ప్రగతి పటంలో తెలంగాణ రాష్ట్రం జయ జయహే అంటూ విజయ బావుటా ఎగురవేసింది. ఇది యావత్ ప్రపంచంలో ఉన్న తెలంగాణ ప్రజలకు గర్వకారణం. ఇక పరిపాలనా పరమైన అంశాలను పరిగణిస్తే, తెలంగాణలో అనేక సంస్కరణలు జరిగాయి. 426 వినూత్న, విశేష పథకాలు అమలు అవుతున్నాయి.

అధికార పునర్విభజన
బ్రిటీష్ ఇండియాలో ఈస్టిండియా కంపెనీ పరిపాలనా సౌలభ్యానికి నిర్ణయించిన మద్రాస్ (1640), బాంబే (1687), బెంగాల్ (1690) ప్రెసిడెన్సీల నాటి పరిపాలనా పద్ధతులనే కొనసాగిస్తున్న తరుణంలో అధికార పునర్విభజన గురించి ఆలోచించిన ప్రభుత్వాలు అరుదు. ఉమ్మడి ఎపిలో కానీ, ఇప్పటి ఎపిలోనే కానీ లేని విధంగా జిల్లాలను విభజించి పరిపాలన వికేంద్రీకరణ చేపట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే. 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించారు. 78 కొత్త మున్సిపాలిటీలు, 1326 తండాలు కొత్త గ్రామ పంచాయతీలు, 1311 ఏజెన్సీ గ్రామాలు ఏర్పడ్డాయి. నిజమైన గ్రామ స్వరాజ్య పాలన మొదలైంది. ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్ళారు. దీంతో ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు అవుతున్నాయి. అధికారుల పనితీరు కూడా మరింత మెరుగైంది. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చే నిధులు కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఏర్పడింది. స్వచ్ఛభారత్, అంగన్వాడీలు, స్కూల్స్, హాస్పిటల్స్ వంటి ప్రాథమిక ప్రజావసర పథకాల అమలు, ఉద్యోగుల పనితీరు మెరుగుపడింది. చిన్న జిల్లాల్లో అధికారులు కూడా ప్రభావవంతంగా పని చేయడానికి వీలవుతున్నది.

అభివృద్ధి సంక్షేమ పథకాలు
మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, జనజీవన పునర్నిర్మానం, కోటి ఎకరాల మాగాణ తెలంగాణను సాధించేందుకు పాత ప్రాజెక్టులను పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు, సాగునీటి కాలువల మరమ్మత్తులు చేపట్టారు. జాతీయ గుర్తింపు లేకున్నా, కేంద్రం ఆర్థిక సాయం అందకున్నా, వేల కోట్లు పెట్టి మరీ ప్రాజెక్టులు కడుతున్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లానీళ్ళందించనున్నారు. భూముల ప్రక్షాళన, రైతుబంధు, బీమా పథకాలతో కెసిఆర్ రైతాంగానికి ఆత్మబంధువుగా మారారు. క్షీర విప్లవం కోసం బర్రెల పంపిణీ, పాల రేట్లు పెంచారు. 39.18 లక్షల మందికి ఆసరా ఫించన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, 815 బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలకు తెలంగాణ గురుకులాలలో ఒక్కో విద్యార్థికి రూ. లక్ష ఖర్చు చేస్తున్నారు. విదేశీ విద్యాభ్యాసానికి ఓవర్సీస్ విద్యాపథకం, వైద్యశాలల ఆధునీకరణ, ఆధునిక పరికరాలు, కెసిఆర్ కిట్లు, డయాలసిస్, ఐసియూ యూనిట్లు ఏర్పాటు చేశారు. వైద్యులు, నర్సుల నియామకం. కంటి వెలుగు. నిరుపేదల ఆత్మగౌరవానికి డబుల్ బెడ్రూం ఇండ్లు, బతుకమ్మ చీరలతో చేనేతకు చేయూత, చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ, సామాజిక వర్గాల వారీగా వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా హైదరాబాద్లో భవనాలు, ఇలా 426 పథకాలు అమలు అవుతున్నాయి.

పల్లెల కంట ఆనంద బాష్పాలు
తెలంగాణ ఉద్యమ సమయంలో గోరటి వెంకన్న “పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల… నా తల్లీ బందీ అయిందో కనిపించని కుట్రల” అనే పాట ప్రజల్ని ఆలోచింప చేస్తూ ఉర్రూతలూగించింది. ఉమ్మడి రాష్ట్ర పాలన, ప్రపంచీకరణలో గ్రామీణ భారత ఆయువుపట్టుగా నిలిచిన కులవృత్తులు అంతరించిపోతున్న వైనాన్ని కళ్ళకు కట్టాడు. ఆ పాట ఆనాటి పరిస్థితిని కళ్ళకు కట్టింది. ఈ పాటతో పాదయాత్రలో చేసిన కొందరు నేతలు ముఖ్య పదవులు అలంకరించారు. కానీ సిఎం కెసిఆర్ కుల వృత్తుల నైపుణ్యాల పెంపు కోసం వృత్తి శిక్షణలిప్పిస్తున్నారు. సాంస్కృతిక సౌరభాలు ఖండాంతరాలకు పాకే విధంగా ప్రపంచ తెలుగు సభల నిర్వహణ, కరువు జిల్లాగా పేరుబడిన పాలమూరులో జల కవితోత్సవం జరిగడం అభివృద్ధి- సంక్షేమ -సాహిత్య- సాంస్కృతిక రంగాల మేలు కలయికకు నిదర్శనం. రాష్ట్రానికి రక్షణ కవచంగా హరితహారం, విశ్వనగరంగా భాగ్యనగరం… ఇలా అనేక పథకాలు అమలు అవుతున్నాయి. తెలంగాణ వస్తే అంధకారం అవుతుందన్న వాళ్ళకు ధీటైన జవాబుగా 24 గంటలపాటు విద్యుత్తో వెలుగుల తెలంగాణ సాధ్యమైంది. సర్వమత సమ భావం చాటే విధంగా అర్చకులు, ఉలేమాలు, క్రైస్తవ మత గురువులకు కూడా ప్రభుత్వం నెలనెలా వేతనాలు చెల్లిస్తున్నది. నిజానికి ఇప్పుడు తెలంగాణలో కరెంటు కోతలు లేవు. తాగునీటి కటకట లేదు. నకిలీ విత్తనాల బెదదలు లేవు. విత్తనాల కోసం విలవిలలు లేవు. ఎరువుల కోసం పడిగాపులు లేవు. గుడుంబా బట్టీలు లేవు. పేకాట క్లబ్బులు లేవు. టెర్రరిస్టుల దుశ్చర్యలు లేవు. మత ఘర్షణలు లేవు. కర్ఫ్యూలు లేవు.

మొన్న ఒక ఆంధ్రా ఉద్యోగినితో మాట్లాడే అవకాశం వచ్చింది. మేము తెలంగాణలో కెసిఆర్‌నే సమర్ధిస్తామన్నారు. టిఆరెస్‌ని ఆంధ్రాకి విస్తరిస్తే… అక్కడా కెసిఆర్‌నే గెలిపించుకుంటామన్నారు. కెసిఆర్ ది ప్రాంతాలకతీతమైన ఎల్లలు లేని జాతీయ, మానవీయ ప్రజాభివృద్ధి, సంక్షేమ ఆకాంక్ష. ఆయనకు ఎదురు లేదు. బెదురు లేదు. ఆయనకు ఆయనే సాటి. దేశంలో ఆయనే మేటి.

వక్ర రాజకీయాలు
రాజకీయాల్ని సేవగా, బాధ్యతగా కాకుండా, ఉపాధిగా మార్చుకున్నట్లుగా ప్రతిపక్షాల ప్రవర్తన కనిపిస్తున్నది. ప్రజల్ని పౌరులుగా కాక కేవలం ఓట్లుగా చూస్తున్నట్లుగా అనిపిస్తున్నది. ప్రజా నిబద్ధతని పక్కన పెట్టి వ్యక్తిగత, రాజకీయ కక్షలతో తప్ప ప్రభుత్వ వైఫల్యాల మీద నిర్మాణాత్మకంగా వాళ్ళ విమర్శలు లేవు. కెసిఆర్ది కుటుంబ పాలన అంటున్న కాంగ్రెస్ నేతలకు నెహ్రూ నుంచి రాహుల్ దాకా చరిత్ర కనిపించడం లేదా? అసలు ప్రతిపక్షాల్లో ఎంత మంది నేతలు కెసిఆర్లా తమ కుటుంబాలని ఉద్యమంలోకి దింపారు? ఎంత మంది నేతలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు?

ప్రజలకే ప్రగతి నివేదన
అందుకే సిఎం కెసిఆర్ ప్రజా క్షేత్రాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రజల్ని కేవలం ఓట్లుగా కాక, పౌరులుగా చూస్తున్నారు. మానవీయ కోణంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. బంగారు తెలంగాణ దిశగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నారు. అందుకే ఈ ప్రగతి నివేదన. అందుకే ఇంత ఆత్మవిశ్వాసం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మించిన ప్రత్యామ్నాయం లేదు.