Home దునియా కొందరు జౌడాలశీరోల్లు ఉంటరు

కొందరు జౌడాలశీరోల్లు ఉంటరు

Women

కొందరు అందరితోని జౌడం పెట్టుకుంటరు. ఇంటి ముందటోల్లతోని లొల్లి, ఇంటెనుకోని తోని లొల్లి, బాయికాడ లొల్లి, పనికి పోయిన కాడ లొల్లి.వాల్లకు లొల్లి లేనిది నిద్ర పట్టది. ఎందుకో కొందరు ఊర్లల్ల ప్రత్యేక గుణంతోనే ఉంటారు. జౌడాల శీరితనం ఎందుకస్తదో కాని వాల్లతోని మాట్లాడితేనే పరికి కంప తలిగిచ్చుకున్నట్లు అయితది. అందుకే ఊర్లల్ల ఎవలెవలు జౌడాలు పెట్టుకుంటరు ఎవలకు ఎంతదూరం ఉండాలనే విషయం ముందే తెలుస్తది. ఎక్కువగా మగ ఆడ అందరు అట్లనే ఉంటరు. ఇందులో ఆడవాల్లు జర ఎక్కువ ఉంటరు. జౌడాలల్ల కొందరు ఆడోల్లు రెండు ఆకులు ఎక్కువ సదువుకుంటరు.

మంచినీళ్ల బాయికాడ లొల్లి నేను ముందు చేదుకుంట నంటే నేనేనని ఇప్పుడైతే మంచినీల్ల బాయిలు లేవు గాని పబ్లిక్ నల్లాలు ఉన్న కాలంల ఆ క్యారెక్టర్‌లు లొల్లి పెట్టుకుంటరు. ఇగ మందితోనే లొల్లిపెట్టుకునేటోల్లు ఇంట్లోల్లతోని ఏం సుఖంగ ఉంటరు. మొగడు కొడుకుల కోడండ్లు అత్తలు యారండ్లు వీల్ల లొల్లికి అలవాటు పడిపోతరు. ఎవుసాము చేసేటోల్లు అయితే పొలం కాడ ఒగలవైపు ఉన్న పొలం ఒడ్లు చెక్కుతరు వాల్లు కోపాని కస్తరు. నాలుగు మాటలు అంటరు. అట్లనే పెద్దగ అయితది అప్పుడు పొలంకాన్నే లొల్లి మాటలు అంటరు. అట్లనే పెద్దగా అయితది అప్పుడు పొలం కాన్నే లొల్లి. వాల్లు అదే కులం వాల్లు అయినా పాలొల్లు అయినా లొల్లిలొల్లే ఉంటది. పెద్ద మనుషుల దగ్గరి పోయి పంచాయితీ చెప్పితే అక్కడా లొల్లే ఎగబడుడు తిట్లు తిట్టుకునుడు సాపెనలు పెట్టుడు సామాన్యంగానే ఉంటాయి.

ఊరన్నకాడ ఇలాంటి క్యారెక్టర్‌లు ప్రత్యేకంగా ఉంటయి. ఇట్ల జౌడాల వాల్లు అందరికి తెలుసు కాబట్టి వాల్ల ఇంటికి పోయేందుకు జర జాగ్రత్తగనే ఉంటరు. ఏవన్న ఇసెరెలు కావాల్నంటే వాల్లను అడుగరు. ఇంకెక్కడికన్నా పోతరు. అందరికి అన్ని సామానులు ఉండయి. నిచ్చెన ఉపకారి పెద్ద, జల్లెడ, పార గడ్డపార, పొనుక, బోరెం పెద్దబండ ఒగలకు ఒగలు ఇచ్చి పుచ్చుకుంటరు. అట్లాంటికాడ ఊకె పంచాయితి పెట్టుకునో వాల్ల ఇంటికి పోరు అడుగరు. అమ్మె వాల్లు పరికె కంపలు అని భయపడుతరు. ఇసోంటల్లకు ఏదన్న జరుగ గూడనిది జరుగుతె కూడా అబ్బో మంచిగున్నప్పుడు ఆగిండ్రా ఎవలనన్న సైసిండ్రా అనుకుంటరు. ఇంటిపక్కన ఉంటె మీకోళ్లు మా పెంటల తిరుగుతున్నయి అని మీ ఎడ్లు మా మడికట్లల్ల తిరుగుతున్నయని, మా చేను మేసినయని మొదలు పెట్టుతరు. అయితే లొల్లి వాల్లకు లొల్లితోనే జవాబు చెప్పాలని పక్కోల్లు కూడా వాల్లకు సరిజోడు తయారయ్యేందుకు సిద్ద పడతరు. తిట్లు రంజకంగానే తిట్టుకుంటరు. వాకిట్లల్ల ఇలాంటి సన్నివేశాలు మస్తుకనిపిస్తయి. పొద్దులదాక అయితే ఎక్కువ ఆడోల్లు కన్పిస్తరు రాత్రిపూట అయిందంటే ఇంత కల్లుబొట్టు తాగి వచ్చి మెగోల్లు సుత ఒగలకు ఒగలు లొల్లి చేసికుంటరు. సాధారణంగా ఎవలన్నా జౌడాలు పెట్టుకుంటే అటువైపు పోయేవాల్లు లేదా ఎవలైనా పెద్ద మనుషులు వచ్చి ఆపుతరు సముజాయించుతరు కాని నిత్యం లొల్లిపెట్టుకునే క్యారెక్టర్‌ల జోలికి ఎవలు పోరు. దూరం ఉంటరు.

ఇసోంటోల్లు ఎవలకన్న పైసలు ఇచ్చినా కిరికిరే, బాయి పొలం కౌలుకిచ్చినా వాల్లతోని కిరికిరే. ఇత్తునపు వడ్లు బదలు తీసికపోయినా కిరికిరే. సకలం కిరికిరి మనుషులే అనుకుంటరు. అయితే ఊర్లో ఇసోంటోల్లు ఒకలు లేదా ఇద్దరు మాత్రమే ఉంటరు. అయితే ఎక్కువమంది ప్రేమను పంచేవాల్లు ఉంటరు. గావురంగా మాట్లాడేవాల్లు ఉంటరు. ఎవలనన్న వరుసపెట్టి మాత్రమే పిలుస్తరు. ఇండ్లకు పోతె సల్ల పోస్తరు. ఏదన్న ఇసిరె కావాలంటే అడుగంగనే ఇంట్లకెల్లి తెచ్చి ఇస్తరు నా తాన లేదో వాల్లు తీసికపోయిండ్రు వీల్లు తీసికపోయిండ్రు అని అనరు. మనిషికి కావల్సింది మంచి మనసు, మనుషులను ప్రేమించే తపన రేపు ఎవలమైనా ఏం పట్టుక పోతం. నల్గురు అయ్యే అనేటట్లుగ మెదులుకోవాలె.