Home జాతీయ వార్తలు కెసిఆర్ పథకాలకు మధ్యప్రదేశ్ సిఎం ఫిదా…

కెసిఆర్ పథకాలకు మధ్యప్రదేశ్ సిఎం ఫిదా…

kcr-image

భోపాల్: సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం… సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నసంగతి తెలిసిందే. ఇదివరకే పలు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, అధికారులు రాష్ట్ర  పథకాల అమలు తీరును అధ్యయనం చేసి వెళ్తున్నారు. తెలంగాణ పథకాలను ఇతర రాష్ర్టాల పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో సైతం చేర్చి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. ఇంటింటికి తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథకు దేశవ్యాప్తంగా అనేక ప్రశంసలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఇంటికి తాగు నీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని కెసిఆర్ సవాల్ చేశారు. ఇంటింటికి  త్రాగునీరు అందించే మిషన్ భగీరథ పథకానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఫిదా అయ్యారు. శుక్రవారం ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన  శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలు ఇకపై బోర్ పంపుల వద్దకు వెళ్లాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు. నర్మదా నది నుంచి  ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.