Search
Sunday 18 November 2018
  • :
  • :

జోరుగా గుప్త నిధుల తవ్వకాలు

Hunting for hidden funds
తాజాగా చెన్నూర్ ప్రాంతంలో క్షుద్రపూజలు
పోలీసుల దాడుల్లో పట్టుబడిన ముఠా సభ్యులు
విచ్చల విడిగా కొనసాగుతున్న గుప్త నిధుల కోసం వేట
మల్లన్న గుట్టపై గతంలో కూడా తవ్వకాలు

మంచిర్యాల ప్రతినిధి: జిల్లాలో గుప్త నిధుల కోసం విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు. పలుచోట్ల కొందరు సభ్యులు ముఠాగా ఏర్పడి క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి అటవీ ప్రాంతంలో, గుహల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల గుప్త నిధులు ఉన్నట్లు అనుమానించి ఇతర జిల్లాల నుంచి క్షుద్రపూజలు చేసే వారిని పిలిపించి పూజలు చేయిస్తున్నారు. తాజాగా చెన్నూర్ మండలం రాయిపేటలో గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడిన ఆరుగురు ముఠా సభ్యులను చెన్నూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో భీమారం గ్రామానికి చెందిన సమ్మయ్య అనే వ్యక్తి పరారిలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలంలో పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా రామచంద్రపురానికి చెందిన నాగేశ్వర్‌రెడ్డిని తవ్వకాల స్థలంలో పూజలు చేసేందుకు తీసుకువచ్చారు. అదే విధంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తిలక్ నగర్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి చిందం రాజన్న, చెన్నూర్ పట్టణంలోని సింగరేణి కాలనీకి చెందిన కొడిపె బక్కయ్య, కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామానికి చెందిన జొన్నల వేణుగోపాల్, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం గ్రామానికి చెందిన బెంజిమెన్ అనే వ్యక్తులు పూజలు చేసేందుకు రాగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో తాండూర్ మండలం గోపాలనగర్ సమీపంలోని మల్లన్న గుట్టపై గల గుహల్లో గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. గతంలో కూడా మల్లన్న గుట్ట పరిసరాల్లో ఉపాధి కూలీలు పనులు నిర్వహిస్తుండగా బంగారు నాణెలు గల బింద లాభించడం కూలీలలో గొడవల కారణంగా బహిర్గతమైంది. పోలీసులు రంగప్రవేశం చేసి, కూలీల వద్ద ఉన్న 32 బంగారు నాణెలను స్వాధీనం చేసుకున్నారు. కాగా మల్లన్న గుట్ట పరిసరాల్లో దశాబ్ద కాలంగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి.
అదే విధంగా తాండూర్, వేమనపల్లి, కన్నెపల్లి, నెన్నెల ప్రాంతాల్లో కూడా గుప్త నిధుల కోసం యదేచ్చగా తవ్వకాలు జరుపుతున్నారు. తాండూర్‌లో గుప్త నిధుల కోసం క్షుద్రపూజల్లో భాగంగా బాలికను బలిచ్చేందుకు యత్నించగా ఆమె తప్పించుకొని పోలీస్ స్టేషన్‌కు పారిపోవడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. జిల్లాలోని కొన్ని చోట్ల వ్యవసాయ పనులు చేస్తుండగా మరోవైపు ఉపాధి పనుల్లో తవ్వకాలు జరుపుతుండగా గుప్త నిధులు లభించిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ముఠా సభ్యులుగా ఏర్పడి దూర ప్రాంతాల నుంచి మాంత్రికులను పిలిపించి, క్షుద్రపూజలు జరిపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నవారిపై కన్నేసి ఉంచాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments