Home ఆఫ్ బీట్ వ్యాయానం

వ్యాయానం

Cycleing

ఇంధనం అవసరంలేని వాహనం.. చవకైన ప్రయాణం.. చక్కని ఆరోగ్యం.. పర్యావరణానికి మేలు..ఇవన్నీ కలిగించేది సైకిల్. ఇరవై ఏళ్ల క్రితం ఎక్కడికి వెళ్లాలన్నా తుర్రుమంటూ సైకిల్‌మీద వెళ్లేవాళ్లు. అదొక్కటే గతయ్యేది. ఆటోమొబైల్ రంగం పుంజుకోవడం, బైక్‌లూ, కార్లూ కొనుక్కునేందుకు బ్యాంకులు రుణాలివ్వడం మొదలెట్టాక ఇవన్నీ సైకిల్‌ను మరుగునపడేశాయి. ఎవరైనా రోడ్డు మీద సైకిల్‌పై వెళ్తుంటే వింతగా చూసే రోజులూ వచ్చాయి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నగరాల్లో పెరిగిన విపరీతమైన ట్రాఫిక్ , కాలుష్యం , ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మళ్లీ నగరవాసులకు సైకిల్‌పై

గాలిమళ్లింది. బాల్యాన్ని గుర్తుకు తెచ్చేవాటిలో సైకిల్ ఒకటి. సైకిల్ నేర్చుకొనే క్రమంలో కింద పడి గాయాలబారిన పడనివారుండరు. అమ్మ ఎక్కడికన్నా వెళ్లమంటే సైకిల్ కొనిస్తే క్షణంలో తెస్తా అంటూ గారాలు పోవడం. కొనిచ్చాక ఎప్పుడప్పుడు పనిచెప్తుందా అని ఎదురుచూడటం. ఇలా ఒకటికి పదిసార్లు సైకిల్‌పై సవారీ అమితానందాన్ని కలిగించేది. సైకిల్‌కి లైట్లు లేకున్నా, డబుల్, త్రిబుల్ సవారీలున్నా పోలీసులకు పట్టుబడేవారు. పదో క్లాసు పాసయితే సైకిల్ కొనిస్తానంటూ ఇంట్లో వాళ్లు చెప్పగానే ఎలాగోలా కుస్తీ పట్టి పాసయ్యేవారూ ఉన్నారు. కాలేజీ పిల్లలకు సైకిల్ ఉండటం అనేది అప్పటి స్టాటస్ సింబల్. ఇప్పుడు ఎలా స్కూటీనో అలాగన్నమాట. ఆమ్మాయిలకు సైటు కొట్టడానికి కూడా సైకిల్‌నే అస్త్రంలా ఉపయోగించుకునేవారు. పెళ్లిలో కట్నకానుకలుగా అబ్బాయికి వాచీ, కొత్త సైకిల్ లాంటివి ఇచ్చేవారు. పొరపాటున సైకిల్ ఇవ్వలేదో అలిగే అల్లుళ్లు కూడా ఉండేవారు. అంబర్, ర్యాలీ, హీరో, హెర్కులస్, అడ్మిరల్, అట్లాస్‌లాంటి సైకిల్ కంపెనీలు రాజ్యమేలేవి.

వలపుల వాహనం: సైకిల్ లేని పాత సినిమాలు లేవనే చెప్పవచ్చు. హిందీలో ఆశాపరేఖ్, శశికపూర్, ముంతాజ్‌లాంటివారు, తెలుగులోనూ బి.సరోజ, కాంచన, ఏఎన్‌ఆర్ కృష్ణ లాంటి నటీనటుల సైకిల్ పాటలు హిట్ అయినవే ఉన్నాయి. ఇలా అన్ని భాషల చిత్రాల్లోనూ సైకిల్ రాజ్యమేలింది. తాజాగా శ్రీమంతుడు సినిమాతో సైకిల్‌కి మరింత గ్లామర్ వచ్చింది. అంతే మళ్లీ సైకిల్‌పై విపరీతమైన క్రేజ్ పెరిగింది.

ఆరోగ్య మంత్ర: సైకిలే కదా అని చులకనగా చూడాల్సిన అవసరం లేదు. తొక్కే కొద్దీ ఒంట్లోని కొవ్వును కరిగిస్తుంది. శరీరానికి చెమటలు పట్టించి, శక్తిని నిద్ర లేపుతుంది. నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సైక్లింగ్‌ను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారు నగరవాసులు. పర్యావరణ స్పృహ, ఆరోగ్యంపై శ్రద్ధతో ప్రస్తుతం అందరూ సైకిల్ తొక్కడానికి ఇష్టపడుతున్నారు. బైక్‌లు, కార్లు పక్కన పెట్టి అప్పుడప్పుడు సైకిల్‌పై స్వారీ చేస్తున్నారు. బద్ధకంగా ఉన్నప్పుడు సైకిల్‌పై ఒక రౌండ్ వేస్తే సరి….దెబ్బకు హుషారు వచ్చేస్తుంది. తాజాగా ఉండటమే కాకుండా శక్తి పొందుతారు. శరీర బరువు త్వరగా తగ్గవచ్చు. వేగంగా సైకిల్ తొక్కేవారు బరువెక్కే ప్రసక్తేలేదు. కీళ్ల నొప్పులు తగ్గడానికి ఇదో మంచి వ్యాయామం. గుండె ఆరోగ్యానికి మంచిది.
పర్యావరణ హితం: ఆరోగ్యంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించడంలో సైకిల్ పాత్ర అమోఘం. నగరంలోని కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు సైకిల్ ఆవశ్యకతను గుర్తించాయి. తమ సంస్థలో పనిచేసే సిబ్బంది వాహనాలను కార్యాలయం ఆవరణ బయటే పార్క్ చేసి , ప్రత్యేకంగా సమకూర్చిన సైకిళ్లను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నాయి. ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఉదాహరణ. కాలుష్య ప్రభావం తమ సిబ్బందిపై పడకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. దీని వల్ల ఉద్యోగులకు కొద్దిపాటి శారీరక శ్రమ కూడా కలుగుతుందనేది వారి ఉద్దేశం. ఇప్పుడు ఈ బాటలో మరికొన్ని సంస్థలు నడుస్తున్నాయి. ఎకో ఫ్రెండ్లీగా ఉండాలంటూ ప్రచారం చేస్తూ, వారాంతంలో సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.

-నగరంలో ఇన్ఫోసిస్ తదితర సాఫ్ట్‌వేర్ సంస్థలు తమ కార్యాలయ పరిసరాల్లో సైకిల్‌ను మాత్రమే వినియోగించాలంటూ సిబ్బందికి సూచిస్తున్నాయి. ఇదే బాటలో మరికొన్ని సంస్థలు నడుస్తున్నాయి.
-కొన్ని కళాశాలలు సైతం క్యాంపస్‌లో సైకిల్ మాత్రమే ఉపయోగించాలంటూ నిబంధనలు విధిస్తున్నాయి.
-హైదరాబాద్ బైస్కిల్ క్లబ్‌కు చెందిన దాదాపు 200 మంది సభ్యులు సైకిల్ ప్రాచుర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు.
-యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఫిజికల్ ఫిట్‌నెస్ స్పోర్ట్ అండ్ సైన్సెస్ సంస్థ వారాంతాల్లో సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తోంది.
-నగరంలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో వారంలో ఒక రోజు విధులకు సైకిల్‌పై రావాలనే ప్రతిపాదన ఉంది. కానీ ఇది ఇంకా అమలుకు నోచుకోలేదు.
మెట్రోతో మరింత చేరువ.. నగరంలో అందుబాటులోకి వచ్చిన మెట్రో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సైకిల్‌ని ప్రోత్సహిస్తోంది. మెట్రో దిగగానే స్టేషన్‌లలో సైకిల్ బైక్‌లను అందుబాటులోకి తెచ్చింది. స్టేషన్ సమీప ప్రాంతాలకు వెళ్లేవారు వీటిని ఉపయోగించేలా ఏర్పాట్లు చేసింది. ఈ ప్రయత్నం వల్ల నగరవాసులకు సైకిల్ తొక్కడం ఓ అలవాటుగా మార్చడంలో మెట్రో కీలకంగా మారబోతుందనడంలో అతిశయోక్తి లేదు.

వ్యాయామానికి ప్రత్యేకం ఇంట్లో వ్యాయామం చేసుకోవడానికి ప్రత్యేకంగా స్టాండింగ్ సైకిళ్లు మార్కెట్లో ఆధునిక హంగులతో లభిస్తున్నాయి. ఫిట్‌నెస్ కోసం వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి మరీ వీటిని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. స్పీడుకు తగ్గట్టుగా మార్చుకుంటున్నారు. తొక్కేటప్పుడు ఎంత సమయం పడుతుంది. ఎన్నిసార్లు తొక్కుతున్నాం. ఒంట్లో ఎంత కొవ్వు శాతం కరుగుతుంది అనే అంశాలను తెలుసుకునేలా వీటిని రూపొందించారు. శరీరాన్ని ఉత్తేజపరచడానికి మాత్రమే కాకుండా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ ఉదయం గంట పాటు సైక్లింగ్ చేయడం వల్ల రోజంతా తాజాగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఫిట్‌నెస్ పోటీలు ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడంతోపాటు సైక్లింగ్‌పై మక్కువ పెరిగేలా ఫిట్‌నెస్ సెంటర్లు తమ కార్యకలాపాలను రూపకల్పన చేసుకుంటున్నాయి. స్టాండింగ్ సైకిల్‌ను తొక్కిస్తూ పోటీలు నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్ ద్వారా ఇతర నగరాలకు కనెక్ట్ అవుతూ నగర యువత పోటీ పడుతోంది. ఈ వేగం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు కరిగిపోవడంతోపాటు శరీరాకృతిని బాగుచేస్తుందని ఫిట్‌నెస్ ట్రైనర్లు అంటున్నారు. వీకెండ్ వస్తే చాలు యువత ఫిట్‌నెస్ సెంటర్‌లలో జరిగే పోటీల్లో పాల్గొంటున్నారు. ఇలాంటి పోటీలు పదుల సంఖ్యల్లో జరుగుతున్నాయి.

సైకిల్ షేరింగ్ సిస్టమ్ సైకిల్ నేర్చుకోవాలన్న ఆలోచన రాగానే రూపాయో, అర్ధరూపాయో పట్టుకుని నేరుగా ఆ దుకాణానికే బయల్దేరేవాళ్లు. వాటినే కిరాయి సైకిళ్లు అనేవాళ్లు..అవి మళ్లీ వస్తున్నాయి. ఎప్పుడైనా సరదాగా సైకిల అంత ఖర్చు పెట్టి సైకిల్ కొనలేంగదా! అలాంటివారి కోసం ఏర్పడిందే సైకిల్ షేరింగ్ సిస్టమ్. ఈ వ్యవస్థలో ఒకచోట బోలెడన్ని సైకిళ్లుంటాయి. దీన్నే డాకింగ్ స్టేషన్ అంటారు. ముందుగానే కొంత డబ్బు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. వెంటనే స్మార్ట్‌కార్డు చేతిలోకి వస్తుంది. దాని సాయంతో స్టేషన్‌లోని సైకిల్‌ను బయటికి తీసుకుపోవచ్చు. గంటకింతని వసూలు చేస్తారు. రోజంతా వాడుకుంటే 200 నుంచి 250 రూపాయల దాకా కట్టాల్సి ఉంటుంది. మళ్లీ ఇక్కడికే తెచ్చివ్వాలనే రూలేం లేదు. దగ్గర్లో ఉన్న ఏ డాకింగ్ స్టేషన్‌లోనైనా అప్పగించవచ్చు. ఇలాంటి సిస్టమ్ విదేశాల్లో ఎప్పటినుంచో ఉంది. ఇక్కడ మాత్రం ఇప్పుడిప్పుడే వచ్చింది.

ముందుగా ఎక్కడంటే.…ముంబయిలో ముందుగా షేరింగ్ సిస్టమ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 2011లో ‘సైకిల్ చలావో’ పేరుతో రాజ్ జనగం, జుయ్ గంగన్ అనే ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు మొదలెట్టారు. ముందుగా 30 సైకిళ్లను అందుబాటులోకి తెచ్చారు. వాటిని ఎక్కువగా రైల్వేస్టేషన్ దగ్గరే పెట్టేవారు. అక్కడి నుంచే దగ్గర్లోని కాలేజీలకు వెళ్లేవారు విద్యార్థులు. అట్లాగే అహ్మదాబాద్‌లో నాలుగేళ్ల క్రితం నగరపాలక సంస్థ సాయంతో ‘మై బైక్ సర్వీస్’ అంటూ ఆర్జిత్ సోని అనే యువకుడు సైకిల్ షేరింగ్ సిస్టమ్‌ను ప్రారంభించాడు. సైకిళ్లు పోకుండా ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను తయారుచేశాడు. దాని ద్వారా సైకిల్ లొకేషన్ తెలిసిపోతుంది. ఈ స్ఫూర్తితో గాంధీనగర్‌లో ‘జీబైక్, ట్రిన్‌ట్రిన్’ అనే పేర్లతో షేరింగ్ సిస్టమ్ వచ్చింది. భోపాల్, బెంగళూరు, గురుగ్రామ్, భువనేశ్వర్‌లాంటివి సైకిల్ షేరింగ్‌నే పాటిస్తున్నాయి. మెట్రో అందుబాటులోకి వచ్చాక హైదరాబాద్ కూడా ఈ బాటే పట్టింది.

సైకిల్‌చరిత్రలోకి వెళ్తే… మొట్టమొదటిసారిగా సైకిల్‌ను 19వ శతాబ్దంలో ఐరోపాలో వాడారు. ప్రపంచంలో సైకిల్ వాడకం ఎక్కువగా చైనాలో ఉంది. విశ్వవ్యాప్తంగా ఒక బిలియన్ సైకిళ్లు ఉపయోగంలో ఉన్నట్లు అంచనా. 1970 వరకు సైకిల్‌కు ట్రాఫిక్ నిబంధనలు ఉండేవి. సైకిల్‌కు లైట్ లేకున్నా, డబుల్ సవారీ ఉన్నా ఒక రూపాయి వరకు జరినామా విధించేవారు. కాలక్రమేణా జరినామాలు రద్దు అయ్యాయి. 1813లో జర్మనీ యువకుడు సైకిల్‌కు శ్రీకారం చుట్టాడు. కొయ్యతో తయారుచేశాడు. ఈ కొత్త వాహనాన్ని తయారుచేసి వాడటం వల్ల అంతా ఇతన్ని పిచ్చివాడిగా జమకట్టి, చివరికి అతని ఉద్యోగం ఊడింది కూడా. 16 గంటల్లో వెళ్లగలిగే దూరాన్ని 4 గంటల్లోనే వెళ్లేవాడు. అతడు కనిపెట్టిన సైకిల్ రైలు పట్టాల దగ్గరకు వెళ్లి మరమ్మతులు చేయడానికి, కార్యకలాపాలు పర్యవేక్షించడానికి మాత్రమే ఉపయోగించేవారు. ఈ వింత వాహనం ఫ్రాన్స్ ,ఇంగ్లండు, అమెరికా దేశాల దృష్టిని ఆకర్షించింది. సైకిల్‌ను మరింత చిన్నగా వేగంగా పోయేలా తయారుచేసింది మాత్రం ఇంగ్లండ్‌కు చెందిన లాసన్. 1890లో పెద్ద ఎత్తున సైకిళ్లను తయారుచేయడం మొదలైంది.అయితే అప్పట్లో టైర్లు మాత్రం ఉండేవికావు. ఆ తర్వాత దళసరి రబ్బరు టైర్లను ఉపయోగించారు. 1888లో ప్రపంచంలోని మొత్తం సైకిళ్ల సంఖ్య 3,00,000 కాగా, 1975 నాటికి ఈ సంఖ్య 7.5 కోట్లకు పెరిగింది. హాలెండ్ , డెన్మార్క్ దేశాల్లో సగటు సైకిళ్ల సంఖ్య జనాభాలో దాదాపు సగం ఉంటుంది.

ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావెన్సీ సైకిల్‌ను పోలిన కొన్ని రఫ్ చిత్రాలను గీశాడు. 1690లో ఫ్రాన్స్ జాతీయుడు దిసివ్రాక్ సైకిల్‌లాంటి వాహనాన్ని తొలిసారిగా రూపొందించి ‘హబీ హార్స్’ అని పేరుపెట్టాడు. దానికి పెడల్స్‌లేవు. 1840లో స్కాట్లాండ్ యువకుడు మాక్మిలన్ పెడల్స్‌ను జతచేసి ఓ రూపు తెచ్చాడు. చివరికి 1900 లో ఆధునిక సైకిల్ రూపొందింది.

ఐక్యరాజ్యసమితిలోని వియన్నా కన్వెన్షన్ 1968 ప్రకారం సైకిల్‌ను ఒక వాహనంగా, దాన్ని నడిపేవారిని చాలకునిగా గుర్తించారు. చాలా దేశాల్లో లైసెన్సులు కూడా అమల్లో ఉండేవి. చీకట్లో నడిపేందుకు లైటు, పాదచారులకు తెలిసేందుకు గంట తప్పనిసరి అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ, ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీపార్టీలు సైకిల్‌ను తమ పార్టీ గుర్తుగా వాడుకుంటున్నాయి. సైకిల్ గుర్తుతో ఎన్‌టిఆర్ అధికారంలోకి రాగానే సైకిల్‌పై అన్ని పన్నులు , వివిధ రకాలైన జరినామాలు రద్దు అయ్యాయి.

స్మార్ట్ నావిగేషన్ బీలైన్ స్మార్ట్ నావిగేషన్ మొబైల్‌తో అనుసంధానించే బైసైకిల్ గాడ్జెట్ ఇది. సైకిల్‌కి అమర్చి వెళ్లాల్సిన ప్రదేశాన్ని యాప్‌లో సెట్ చేయాలి. సైకిల్ తొక్కడం మొదలైన వెంటనే , ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే ఈ పరికరం ఏవైపు వెళ్లాలో , ఎంత దూరం వెళ్లాలో చెబుతూ, దారి చూపిస్తుంది. రోడ్డు మార్గాలతో సంబంధం లేకుండా సైకిల్‌మీద వెళ్లిపోగలిగే గల్లీలను కూడా పరిగణనలోకి తీసుకుని, అతి తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరేలా సూచనలిస్తుంది.

బూమ్ బాటిల్ స్కోచీ బూమ్ బాటిల్ సైకిల్ తొక్కుతూ పాటలు వినేందుకు ఏర్పాటు చేసిన గాడ్జెట్ ఇది. సైకిల్‌కు అమర్చుకునేందుకు వీలుగా ఉంటుంది దీని నిర్మాణం. బ్లూటూత్‌తో మొబైల్‌కు అనుసంధానించుకోవచ్చు. పాటలు వినేందుకే కాకుండా అత్యవసర సమయంలో మొబైల్‌కు చార్జ్ చేసుకునేందుకూ ఉపయోగపడుతుంది. ధృడమైన ప్లాస్టిక్‌తో తయారుచేయడం వల్ల కింద పడినా పగిలిపోదు.

బైక్‌స్పైక్ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆ సమాచారాన్ని ఆప్తులకు చేరవేసేందుకు రూపొందించిన పరికరం ఇది. దీన్ని సైకిల్‌కు అమర్చుకుంటే, ఏదైనా ప్రమాదం జరిగితే, వెంటనే మొబైల్ యాప్‌లో ఎంచుకున్న వ్యక్తుల ఫోన్ నంబర్లకు ఆటోమేటిక్‌గా ప్రమాదం జరిగిన ప్రదేశ సమాచారం వెళ్లిపోతుంది. ఒకవేళ సైకిల్‌ను ఎవరైనా చోరీ చేసినా, ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా, పోగొట్టుకున్నా, జీపీఆర్‌ఎస్ ద్వారా ట్రాప్ చేసి పట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎంత దూరం సైకిల్ తొక్కిందీ, ఎంత వేగంతో తొక్కిందీ వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

రివోటైట్స్ బైకులు, కార్లు వేగంగా దూసుకెళ్లే రహదారులపై రాత్రివేళల్లో సైకిల్ ప్రయాణం చేయాలంటే ఒకింత రిస్క్‌తో కూడుకుందే. లైట్లు అమర్చుకున్నా, వచ్చేది సైకిల్ అనే విషయం ఎదుటివారికి తెలియదు. ఈ రివోటైట్స్ సైకిళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎల్‌ఈడీ లైట్లు. చక్రాలకు అమర్చుకునేందుకు వీలుగా తయారుచేసిన ఈ లైట్లు, సైకిల్ తొక్కేవారికి, చూసేవారికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. బ్లూటూత్ ద్వారా ఈ బల్బులు వెలిగే దిశలను మార్చుకునేందుకూ అవకాశముంది.
వైర్‌లెస్ టర్న్ సిగ్నల్
టర్న్ తీసుకుంటున్నామని సిగ్నల్ ఇచ్చేందుకు, సైకిళ్లకు ఇండికేటర్లు ఉండవు. చేతిని చాచి చెప్పాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొన్ని సార్లు పట్టుతప్పి, కిందపడే ప్రమాదం లేకపోలేదు. ఈ వైర్‌లెస్ బైసికిల్ టర్న్ సిగ్నల్ టర్న్ తీసుకుంటున్నామని ఇండికేట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. బ్యాటరీల సాయంతో నడిచే ఈ గాడ్జెట్ ఎల్ బటన్ నొక్కితే ఎడమ వైపు వెళ్తున్నట్లు సిగ్నల్ ఇస్తాయి. ఆర్ బటన్ నొక్కితే కుడివైపు వెళ్తున్నట్లు చూపిస్తాయి.
మల్లీశ్వరి వారణాసి