Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

స్క్రిప్ట్ నచ్చితే చేస్తా…

Exclusive Interview With Aadhi Pinisetty

ఆది పినిశెట్టి హీరోగా తాప్సీ పన్ను, రితికా సింగ్ హీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ ‘నీవెవరో’. ‘రంగస్థలం’ తర్వాత ఆది నటించిన చిత్రమిది. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టితో ఇంటర్వూ విశేషాలు…

కథకు తగ్గట్టుగా…
ప్రతి మనిషి బయట ఉండేది ఒకటి… లోపల ఉండేది ఒకటి. మనిషి లోపల ఉన్నది ఎవరు అని చెప్పే కథే ‘నీవెవరో’. కథకు తగ్గట్టుగా ఈ టైటిల్‌ను పెట్టారు. ప్రాక్టికల్‌గా ఉండే సినిమా ఇది. సమాజంలో జరుగుతున్న వాటిని ఆధారంగా చేసుకొని ఈ సినిమా చేశారు.
ఛాలెంజింగ్ క్యారెక్టర్…
అంధుడి పాత్రలో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాక ఒక నెల గ్యాప్ దొరికింది. ఆ సమయంలో అంతా ఈ క్యారెక్టర్ గురించే ఆలోచించాను. మామూలు క్యారెక్టర్‌ను ఎలాగైనా చేసేయవచ్చు. కానీ అంధుడి పాత్రలో చేయాలంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంధుడిగా ప్రేక్షకులను ఒప్పించడం కష్టం. నిజంగా ఇది ఛాలెంజింగ్ క్యారెక్టరే.
జాగ్రత్తగా గమనించాను…
ఓ నాలుగు వారాల పాటు ప్రతి ఆదివారం చెన్నైలోని అంధుల పాఠశాలకు వెళ్లాను. అంధుల హావభావాలు, వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ల స్పందన ఎలా ఉంటుంది తదితర విషయాలను జాగ్రత్తగా గమనించాను. ఈ సినిమాలో నా పాత్రకు 15 ఏళ్ల వయసులోనే కళ్లు పోతాయి. అతను పూర్తిగా అంధుడు. ఈ పాత్ర చేయడం నాకు కొత్త అనుభూతినిచ్చింది.
అందుకే గ్యాప్ వస్తోంది…
స్క్రిప్ట్ నచ్చితేనే నేను సినిమా చేస్తా. ఆతర్వాత దర్శకుడిపై పూర్తి నమ్మకం కలగాలి. వీటితో పాటు ఆ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లగలిగే ప్రొడక్షన్ హౌస్ ఉండాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను సినిమాలు చేస్తాను. అందుకే నా సినిమాలకు గ్యాప్ వస్తోంది.
అవే పాత్రలు మళ్లీ చేయను…
సింగంలాంటి సినిమాలు, పెద్ద స్టార్స్ సినిమాలో ప్రధాన విలన్ పాత్రలు వచ్చాయి. కానీ నాకు చేయాలనిపించలేదు. చేసిన పాత్రనే మళ్లీ చేయడం నాకు ఇష్టం ఉండదు. కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను. నాకు నచ్చిన సినిమాలు వస్తేనే చేస్తాను.
‘ఆర్‌ఎక్స్ 100’ రీమేక్‌లో…
‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా నాకు బాగా నచ్చింది. మంచి కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా చక్కగా నటించారు. ఈ సినిమా తమిళ్ రీమేక్‌లో నటించబోతున్నాను. నా స్టైల్‌లో ఈ సినిమా చేయడానికి ప్రయత్నిస్తాను.

Comments

comments