Home సినిమా భరించలేని నొప్పితో విలవిలలాడాను

భరించలేని నొప్పితో విలవిలలాడాను

Exclusive interview with Aditi Rao Hydari

వరుణ్‌తేజ్, అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘’. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అదితిరావు హైదరీతో ఇంటర్వూ విశేషాలు…
నిజమైన పాత్ర చేయాలనిపించింది…
‘సమ్మోహనం’ సినిమా చేస్తున్న సమయంలో దర్శకుడు సంకల్ప్ నాకు ఫోన్ చేశారు. అతను నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు అంతరిక్షానికి వెళ్లిన ఇద్దరు మహిళా అస్ట్రానాయిడ్స్ మన దేశానికి చెందినవారే. అందుకే నాకు అలాంటి నిజమైన పాత్ర చేయాలనిపించి ఈ సినిమాలో నటించాను.
చాలా కష్టపడ్డాం…
ఈ సినిమా కోసం చాలా ప్రిపేర్ అయ్యాం. బల్గేరియా, యూరప్ నుండి వచ్చిన టెక్నీషియన్స్‌తో కలిసి పనిచేశాం. చాలా రోజుల పాటు తాళ్లతో వేలాడుతుండడం, పల్టీలు కొట్టడం, గాలిలో ఈదడం వంటి స్టంట్స్ నేర్చుకున్నాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.
మెడనొప్పి వచ్చేది…
పాత్ర కోసం నేను ఉపయోగించిన హెల్మెట్ చాలా బరువుగా ఉండేది. హెల్మెట్ ఎక్కువ సేపు ధరిస్తే మెడనొప్పి వచ్చేది. షూటింగ్‌లో పాల్గొన్న తొమ్మిదవ రోజున హెల్మెట్ ధరించగానే భరించలేని నొప్పితో విలవిలలాడాను. డాక్టర్లు పది రోజుల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారు. అయితే మా మేనేజర్ సహాయంతో డాక్టర్‌ను కలిసి పెయిన్ కిల్లర్స్ వేసుకొని మళ్లీ సెట్స్‌కు వచ్చేశాను.
ఆయన అనుభవాలను చెప్పేవారు…
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా అస్ట్రానాయిడ్స్‌ను ఎవరినీ కలవలేదు. అయితే నేను చదువుకునే రోజుల్లో రాకేశ్ శర్మ పిల్లలు మా స్కూల్లోనే చదివేవారు. ఆయన తన పిల్లల కోసం తరచుగా మా స్కూలుకు వస్తుండేవారు. ఆ సమయంలో రాకేశ్ శర్మతో మాట్లాడేదాన్ని. అంతరిక్షంలోని ఆయన అనుభవాలను నాకు చెప్పేవారు.
ఫ్లాష్‌బ్యాక్‌లోనే ఆమె రోల్…
ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కాదు. ఫ్లాష్‌బ్యాక్‌లో లావణ్య త్రిపాఠి రోల్ కనపడుతుంది. నా పాత్ర సినిమా మొత్తం ఉంటుంది.
ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా…
మంచి సినిమాలో భాగం కావాలని, మంచి దర్శకులతో పని చేయాలనుకోవడంతో నేను ఎప్పుడూ నా పాత్ర నిడివి గురించి ఆలోచించలేదు. ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు నా పాత్ర వారికి గుర్తుండిపోతే చాలు అనుకుంటాను. నేను గొప్ప సినిమాలు చేస్తున్నాననో, చేశాననో గర్వపడటం లేదు. నటిగా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను.
ఎందుకనో వద్దన్నారు…
ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కానీ ఎందుకనో నిర్మాతలు వద్దన్నారు. ‘సమ్మోహనం’ చిత్రానికి నేనే డబ్బింగ్ చెప్పాను కదా. స్వయంగా డబ్బింగ్ చెప్పాలని నేను కోరుకుంటాను.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం ధనుష్‌తో సినిమా చేస్తున్నాను. మిస్కిన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాను. గొప్ప దర్శకుడు మణిరత్నంను నా మార్గదర్శకుడిగా భావిస్తాను.

Exclusive interview with Aditi Rao Hydari