Home లైఫ్ స్టైల్ సరిహద్దులేని భారతీయనృత్యం

సరిహద్దులేని భారతీయనృత్యం

vanaja-uday

బ్రిటీష్ పార్లమెంట్ లో వనజా ఉదయ్ కి అరుదైన సత్కారం

భాషకు అందని భావాలతో  హృదయస్పందన  కల్పించే కళలు విశ్వభరితం. ఎల్లలులేని కళల్లో నృత్య కళకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతీ కళలో పరిశీలన, ప్రయోగం, ఆవిష్కార ప్రధాన    ప్రక్రియలను అధిగమిస్తేనే కళకు సార్థకత చేకూరుతుంది. నృత్య కళను హాబీగా కాకుండా వృత్తిగా స్వీకరించడంతో పాటు   వందలాది మంది శిష్యులను తయారు చేసిన ప్రముఖ నర్తకి డాక్టర్. వనజా ఉదయ్. నిజాం రాజుల కాలంలో         న్యాయసలహాదారులుగా  పనిచేసిన వంశానికి చెందిన  ఆమె, తన మనసు మెచ్చిన   నృత్యకళలో రాణిస్తూ .. కళాకారిణిగా అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ కీర్తి బావుటాలను         ఎగరవేస్తున్నారు. తెలుగువిశ్వ      విద్యాలయం నృత్యశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు   నిర్వహిస్తూ ఇప్పటివరకు 60 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఇండియన్ కౌన్సిల్  ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఆధ్వర్యంలో   విశ్వవేదికలపై చేసిన నృత్యప్రదర్శనలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. భారతీయ నాట్యశాస్త్రంలోని నాలుగు     ఉపాంగనాల్లో ఆమె నిష్ణాతురాలు. ఆంగిక, వాచిక, ఆహార్య,     సాత్వికాల్లో ప్రముఖ స్థానాన్ని సొంతం    చేసుకోవడంతో పాటు    భారతీయ నృత్యరీతులపై నిరంతర పరిశోధన చేస్తున్న వనజా ఉదయ్ తో అఖిల ప్రత్యేక ఇంటర్వ్యూ.

ఇటీవల 70ఏళ్ల భారత స్వాతంత్య్ర సంబురాల్లో భాగంగా బ్రిటిష్ పార్లమెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మీ అనుభూతులను వివరిస్తారా?
మన దేశం తరఫున ప్రపంచదేశాల్లో నృత్యప్రదర్శనలు చేసే అరుదైన అవకాశం నాకు వచ్చింది. దేశస్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా బ్రిటీష్ పార్లమెంట్ లో భరతనాట్యం, కూచిపూడిని ప్రదర్శించడంతో పాటు తెలంగాణ జానపదకళారూపాలను ప్రదర్శించాం. భారతీయ సంస్కృతి ఔన్నత్య విలువలపై బ్రిటీష్ పార్లమెంట్‌లో ప్రసంగించడం ఓ గొప్ప అనుభూతిగా భావిస్తాను. అలాగే భారత ప్రభుత్వం పక్షాన యుక్తాతో కలిసి లండన్, నెదర్లాండ్ తదితర దేశాల్లో చేసిన సాంస్కృతిక ప్రదర్శనలకు ఆ దేశాల ప్రజలు అమితంగా ఆకర్షితులవడం నాకు ఆనందంగా ఉంది. పాశ్చాత్య దేశాల్లో భారతీయ నృత్యాలకు, సంప్రదాయాలకు అత్యంత ఆదరణ ఉంది.

మీ పూర్వీకుల నుంచి మీకు నాట్యం అలవడిందా?

నాట్యం నేర్చుకోవాలనే తపన చిన్నప్పటి నుంచే నాలో అంతర్లీనంగా ఉండేది. నేను నాట్యం నేర్చుకోవడానికి ప్రధాన ప్రేరణ అమ్మ. కళలంటే ఇష్టంతో పాటు నృత్యంలోను అమ్మకు ప్రవేశం ఉండటంతో చిన్నప్పటి నుంచి నాట్యం ఆకర్షణీయమైంది. బాల్యంలో మహంతి వెంకటేశ్వరరావు దగ్గర అభ్యసించాను. ఆ తర్వాత ప్రముఖ నాట్యగురువు ఉమారామారావు దగ్గర నృత్యం నేర్చుకున్నాను. అయితే నాట్యంలో మరిన్ని రీతులను నేర్చుకునేందుకు నిరంతరం శ్రమించాల్సి వచ్చింది. నాట్యాన్నే వృత్తిగా మార్చుకోవాలంటే అనేక శాస్త్రాలను అధ్యయనం చేయడం అనివార్యం అయింది. అప్పుడు నాలో సంఘర్షణ ప్రాంరంభమైంది. నాట్యాన్ని వదలి వేరే వృత్తిలో స్థిరపడాలా లేదా నాట్యంలోనే ఎదగాలా అనే సందేహాన్ని నాలో నేను ప్రశ్నించుకుని సమాధానాన్ని వెతుక్కున్నాను. ఏరంగంలోనైనా లోతుగా అభ్యసనం, అధ్యయనం చేస్తేనే పట్టు సాధించవచ్చు. అలాగే నేను కోరుకున్న నాట్యశాస్త్రంలోనే నైపుణ్యత సాధించాలని నిర్ణయించుకుని నిరంతర కృషి చేశాను.

మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది?

హైదరాబాద్‌తో మా కుటుంబానికి తరతరాల సంబంధం ఉండటంతో నేను ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాను. సెయింట్ ఆన్స్‌లో పదోతరగతి వరకు చదివాను. వనితా మహావిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాను. ఒకవైపు చదువు మరోవైపు నాట్యంలో శిక్షణ పొందుతూ తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్యశాస్త్రంలో ఎంఏ చేశాను. నాట్యగురువు ఉమారామారావు దగ్గర భరతశాస్త్రం నేర్చుకున్నాను. ఆ తర్వాత కూచిపూడి నాట్యం కూడా నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగింది. రెండు నృత్యరీతులను నేర్చుకుని తెలుగు విశ్వవిద్యాలంలోనే ప్రొఫెసర్ అలేఖ్య పుంజల సారధ్యంలో పి.హెచ్.డి పూర్తిచేయడంతోపాటు తెలుగు విశ్వవిద్యాలయంలోనే ఉద్యోగం చేసే అవకాశం లభించింది.

మీ పూర్వీకుల గురించి చెప్పండి?

ఉత్తరప్రదేశ్ నుంచి వందలాది సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చిన మా పూర్వీకులు నిజాం రాజ సంస్థానంలో ఉన్నత పదవులు నిర్వహించారు. మా ఏడో తరానికి చెందిన రాజా రాఘవరాం ఠాగూర్ నిజాం ప్రభుత్వంలో న్యాయసలహాదారుగా విధులు నిర్వహించారు. కిషన్ బాగ్ దేవాలయాన్ని మా పూర్వీకులే నిర్మించారు. ఆ ఆలయంలో ఇప్పటికీ మేము ధర్మకర్తల హోదాలోనే పూజలు నిర్వహిస్తున్నాం. స్వాతంత్య్రం అనంతరం మా నాన్న హరివదన్ లాల్ కేంద్ర ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్ గా పనిచేశారు. మా వారు టీవీ ఆర్టిస్టు. మాకు ఒక బాబు.

కుటుంబపరంగా మీకు ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది?
మావారు బిజీ టీవీ ఆర్టిస్టు అయినప్పటికీ నాకు పూర్తి సహకారం అందిస్తారు. విదేశాల్లోని ప్రదర్శన వివరాలు ముందుగానే తెలియడంతో మా వారు కాల్ షీట్స్‌ను క్యాన్సిల్ చేసుకుని నాతో పాటే విదేశాలకు వచ్చి ప్రదర్శనకు సహకరిస్తారు. నృత్యాన్ని అభ్యసించడం ఒకవంతైతే ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించడం మరో గొప్ప అంశం. ఈ రెంటిని బ్యాలెన్స్ చేసుకునేవారు ఏ నృత్య రీతైనా విశ్వజనితమై అలరాలుతుందని నా అభిప్రాయం.

భరతనాట్యం, కూచిపూడి రెండూ భిన్న నృత్య రీతులను నేర్చుకున్న మీరు అరంగేట్రం ఏ నాట్యరీతుల్లో ప్రదర్శించారు?
రెండు నాట్యరీతుల్లో అరంగేట్రం చేసి ప్రేక్షకుల మన్నలను పొందాను.16 నవంబర్ 1982 లో రవీంద్రభారతిలో అరంగేట్రం చేశాను. రవీంద్రభారతిలో అరంగేట్రం చేయడమంటే సాధారణ అంశం కాదు. ఈ వేదికపై ఎందరో ప్రముఖులు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. విదేశాల నృత్యకళాకారులు ఇక్కడ అరంగేట్రం చేయడం సగర్వంగా భావిస్తారు. మెుదటి గంట భరతనాట్యం చేసి గురు సత్కారం చేశాను. ఆ తర్వాత కూచిపూడి నాట్యంలో ప్రదర్శన ఇచ్చాను. రెండు గంటలపాటు ప్రేక్షకులు కదలకుండా సీట్లలోనే కూర్చొని నన్ను అభినందించడం ఓ గొప్ప అనుభూతిగా ఇప్పటికీ నెమరు వేసుకుంటాను.

విదేశాల్లో నృత్యప్రదర్శన ఇస్తున్నప్పుడు భాష సమస్య వస్తుంది కదా.. ఈ సమస్యను మీరు ఎలా అధిగమించారు?

విదేశాల్లో నృత్య ప్రదర్శన ఇస్తున్నప్పుడు అక్కడి భాషలో మెుదట వివరించి ఆ తర్వాత ప్రదర్శన ఇస్తుంటాం. హావ భావాలకు ఉన్న ప్రాధాన్యత ముందు భాష సమస్య రాదు. శాస్త్రీయ నృత్యంలోని ప్రతి కదలికను నృత్య రీతులను ప్రేక్షకులు చాలా సున్నితంగా గమనిస్తుంటారు. అయినప్పటికీ నృత్యానికి భాష అత్యంత ప్రాధాన్యత ఇంటుంది. అందుకే లాటిన్ అమెరికాలో ప్రదర్శన ఇచ్చే ముందు సీఫెల్ లో మూడునెలలపాటు స్పానిష్ కోర్సులో శిక్షణ పొందాను. లాటిన్ అమెరికాలో ఇంగ్లీష్ తో పాటు స్పానిష్ ఎక్కువగా మాట్లాడతారు. అయితే నాట్యప్రదర్శనతోనే కళాకారుల బాధ్యత తీరిపోదు. భారతీయకళల ఔన్నత్యంతోపాటు సంస్కృతి గురించి ప్రదర్శనలో వివరించాలి. వారికి అర్థం అయ్యే భాషలో వివరిస్తే స్పందన అనూహ్యంగా ఉంటుంది. భారతీయ నృత్యాన్ని విదేశీయులు గౌరవంగా భక్తిపూర్వకంగా ఆస్వాదిస్తారు. తెలంగాణ నుంచి ఇతర దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు రాష్ట్రాల ప్రసక్తి కంటే భారతీయతే కళాకారులతో పాటు ప్రేక్షకుల్లో నిండి ఉండటం ఎంతో ఆనందం కలిగిస్తుంటుంది. అప్పుడే మాటలకు అందని అనుభూతులు, మనసు పొరల్లోని భావాలు విరబూస్తుంటే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు కళాకారులను ఉన్నతస్థితిలోకి తీసుకువెళ్తుంటే కళాకారుల్లోని కళ విశ్వవ్యాప్తం అవుతుంది.