Home జాతీయ వార్తలు మళ్ళీ నమో!

మళ్ళీ నమో!

 

ఎన్‌డిఎకు ౩౦౦ ప్లస్ అంటున్న ఎగ్జిట్‌పోల్స్

యుపిలో బిజెపికి తగ్గనున్న సీట్లు
బెంగాల్, అసోం, ఒడిశాలో పెరగనున్న సంఖ్య 

మళ్లీ ఆ మూడు రాష్ట్రాల్లో పుంజుకున్న కమలం
బీహార్, మహారాష్ట్రలో కలిసిరానున్న పొత్తు

యుపిఎకు మళ్లీ నిరాశేనన్న ఎగ్జిట్ అంచనాలు

న్యూఢిల్లీ : చివరిదైన ఏడో దశ పోలింగ్ ముగిసిన వెంటనే అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. కేంద్రంలో మళ్లీ బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎకు అధికార పగ్గాలు దక్కుతాయని పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మోడీకి వ్యతిరేకంగా బిజెపియేతర పార్టీలు వీలైనన్ని చోట్ల కూటమి కట్టినా, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్‌పి, బిఎస్‌పి చేతులు కలిపినా ఎన్‌డిఎకు విస్పష్ట మొగ్గు కనిపిస్తోందని స్పష్టం చేశాయి. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే కాషాయ ప్రభంజనం కాస్త తగ్గినా లోక్‌సభలో బిజెపినే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, మిత్రుల తోడ్పాటుతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశాయి. యుపిలో ఎస్‌పిబిఎస్‌పి కూటమిలో కాంగ్రెస్ లేకపోవడం బిజెపికి కలిసివచ్చినట్టుగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్‌డిఎకు పట్టం కట్టాయి. ఇక టైమ్స్‌నౌ ఎన్‌డిఎకు 306 స్థానాలు, యుపిఎకు 132 స్ధానాలు, ఇతరులకు 104 స్థ్ధానాలు దక్కుతాయని అంచనా వేసింది. రిపబ్లిక్ సీ ఓటర్ ఎన్‌డిఎకు 287 , యుపిఎకు 128 స్థానాలు, ఇతరులకు 127 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. రిపబ్లిక్ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ఎన్‌డిఎకు 315, యుపిఎకు 124, ఇతరులకు 113 స్థానాలు రావచ్చని అంచనా వేశాయి. మరోవైపు న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్‌డిఎకు 298 స్థ్ధానాలు, యుపిఎకు 118 స్థ్ధానాలు, ఇతరులకు 126 లభించనున్నాయి. ఎన్‌డిటివి పోల్స్ ఆఫ్ పోల్స్‌లో ఎన్‌డిఎకు 300, యుపిఎకు 127, ఇతరులకు 115 స్థ్ధానాలు రావచ్చని అంచనా వేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీసగఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందినా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి తిరిగి పుంజుకున్నట్టు పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో భాజపా తిరిగి పుంజుకుందని ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా తెలుస్తోంది.
యుపిలో చతికిలపడ్డా…
2014లో 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపి కూటమి 73 స్థానాలను గెలుచుకుంది. తాజా ఎన్నికల్లో 45 వరకు గెలిచే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మాయావతి, అఖిలేష్ నాయకత్వంలోని మహాగట్‌బంధన్ కూటమి బిజెపి అవకాశాలను యుపిలో ఈ లెక్కన దెబ్బతీసిందని చెప్పవచ్చు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏర్పడిన లోటును బిజెపి పశ్చిమ బెంగాల్, అసోం, ఒడిశా తదితర రాష్ట్రాల్లో భర్తీచేసే అవకాశముంది. పశ్చిమబెంగాల్‌లో బిజెపి 2014లో కేవలం రెండుసీట్లను గెలుచుకుంది. ఈ సారి ఎన్నికల్లో 15 నుంచి 20 స్థానాలు రావచ్చని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. దీంతో పాటు మహారాష్ట్రలో శివసేనతో పొత్తు బీహార్‌లో జెడి(యు)తో పొత్తు మరింత కలసివచ్చిందని సర్వేలు పేర్కొంటున్నాయి. ఒడిశాలో గతంలో కేవలం ఒక స్థానం ఉండగా తాజా ఎన్నికల్లో మరింత పెరిగే అవకాశముంది.

కేరళలో యుడిఎఫ్‌దే విజయం: ఎగ్జిట్ పోల్స్ అంచనా
కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇండియా టు డె యాక్సిస్ అంచనా ప్రకారం యుడిఎఫ్‌కు 1516, ఎల్‌డిడికి 3 నుంచి 5 రావచ్చు. కేరళలో భారీగా ప్రచారం చేసిన బిజెపికి ఒక్క సీటు మాత్రమే రావచ్చు. ఏప్రిల్ 23న రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 77.68 శాతం పోలింగ్ నమోదైంది. ఇటీవలి సంవత్సరాల్లో ఇదే అత్యధికం. కేరళ ఎన్నికల చరిత్రలో మొదటిసారి మూడింట ఒక వంతు స్థానాల్లో ఈసారి ముక్కోణపు పోటీలు జరిగాయి. అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. గతంలో ఎప్పుడూ యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్‌లే పోటీ పడేవి. ఈసారి బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ కూడా ఆరు నియోజకవర్గాల్లో ఈ రెండు కూటములకు గట్టిపోటీనే ఇచ్చింది. అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్ కన్నా యుడిఎఫ్ విజయంపై ధీమాతో ఉంది. శబరిమల వివాదం తనకు కలిసి రావచ్చని, దక్షిణాది రాష్ట్రంలో ఖాతా తెరవచ్చనే ఆశాభావంతో బిజెపి ఉంది.

యుపిలో ఎస్‌పిబిఎస్‌పికి 40
తగ్గనున్న ఎన్‌డిఏ హవా …ఎగ్జిట్ పోల్స్ అంచనా
దేశానికి ఎందరో ప్రధానమంత్రుల్ని ఇచ్చిన ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌డిఏ హవా అంతగా ఉండకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. ఎన్‌డిఏ బలం 38కి పడిపోతుందని, మహాగట్ బంధన్ (బిఎస్‌పి ఎస్‌పిఆర్‌ఎల్‌డి) 40 సీట్లు గెలుచుకుంటుందని, యుపిఎకి కేవలం రెండు స్థానాలు మాత్రమే దక్కుతాయని రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇకపోతే ఎబిపి న్యూస్,ఎసి నీల్‌సెన్ అంచనా ప్రకారం ఎన్‌డిఏ కి 22కు మించి రావు. మహాగట్ బంధన్‌కు 56, యుపిఎకు రెండు వస్తాయని లెక్కలు చెబుతున్నాయి. దేశంలో ఇప్పుడు అందరి కళ్లూ ఉత్తరప్రదేశ్ మీదే ఉన్నాయి.

Exits polls 2019: NDA will win 306 Lok Sabha Seats