Home బిజినెస్ తగ్గింపును ఆశిస్తున్నాం..

తగ్గింపును ఆశిస్తున్నాం..

 కీలక వడ్డీ రేటులో కోతకు అవకాశం 

 మందగమనానికి అదే సరైన  నిర్ణయం 

 ఆర్‌బిఐ ద్రవ్యపరపతి సమీక్షపై ప్రభుత్వం అంచనా

RBIన్యూఢిల్లీ: మందగమనం నేపథ్యంలో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) నుంచి సహకారాన్ని ప్రభుత్వం ఆశిస్తోంది. ఏప్రిల్‌జూన్ త్రైమాసికంలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 5.7 శాతంతో మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో ఆర్థిక వృద్ధి బలోపేతానికి వడ్డీ రేటు తగ్గింపు దోహదం చేస్తుందని కేంద్రం భావిస్తోంది. మంగళ, బుధవారాల్లో ఎంపిసి సమావేశం ఉంటుంది. బుధవారం ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కీలక వడ్డీ రేటుపై ప్రకటన చేయనున్నారు. ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా మారడంతో నిపుణులు, పరిశ్రమ సంఘాలు వడ్డీ రేటు తగ్గింపును గట్టిగా కోరుతున్నారు. నోట్ల రద్దు, జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమలు నేపథ్యంలో మందగించిన ఆర్థిక వృద్ధికి ఆర్‌బిఐ వడ్డీ రేటు తగ్గింపు తప్పనిసరి అని వారు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుదలను సూచిస్తోందని, దీని వల్ల ఆర్‌బిఐ వడ్డీ రేటును యథాతథంగానే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఎస్‌బిఐ నివేదిక ప్రకారం, అక్టోబర్ 4న ఆర్‌బిఐ సమీక్షా సమావేశంలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనుందని, దీనికి కారణం ద్రవ్యోల్బణం పెరగడం, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు అని తెలిపింది. వచ్చే ఆర్‌బిఐ సమీక్షలో ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా నిర్ణయం ఉంటుందని, అయితే వడ్డీ రేటు తగ్గింపు తక్కువ అవకాశాలు ఉన్నాయని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించవచ్చని గత వారం ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ద్రవ్యోల్బణం ఆందోళనలతో ఆగస్టు నెలలో ఆర్‌బిఐ విధాన సమీక్షలో రెపో రేటు 0.25 శాతం తగ్గించడంతో 6 శాతానికి చేరింది. పది నెలల్లో కీలక రేట్లను తగ్గించడం తొలిసారి కాగా, ఏడేళ్ల కనిష్ఠానికి పాలసీ రేట్లు పడిపోయాయి. కూరగాయలు, పండ్ల ధరలు మరింత ప్రియం కావడంతో ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.36 శాతంతో ఐదు నెలల గరిష్ఠానికి చేరింది. మరోవైపు జులైలో వినిమయ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2.36 శాతానికి చేరింది. మందగమన పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పునరుద్ధరణకు దిశగా తక్షణమే చర్యలు చేపట్టాలని, రెపో రేటును కనీసం 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని కోరుతూ ఆర్‌బిఐ, ఎంపిసి(ద్రవ్య విధాన కమిటీ)కి అసోచామ్ లేఖ రాసింది. గత నెలలో ప్రకటించిన ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ఆర్‌బిఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించిన వివరాలను ఇలా ఉన్నాయి.
నాలుగు నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
ఆగస్టు దేశీయ డబ్లుపిఐ(టోకు ధరల సూచీ) ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది. ఆహార పదార్థాలు, ఇంధన ధరల పెరుగుదల కారణంగా టోకు ద్రవ్యోల్బణం 3. 24 శాతం నమోదైంది. జూలైలో 1.88 శాతంతో పోల్చితే ఈసారి భారీగా పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం, ఇంధన ఉత్పత్తుల ధరలు పెరగడమే దీనికి కారణం.. కాగా ఆహార ద్రవ్యోల్బణం 5.75గా నమోదవగా, ఇది జులైలో 2.15 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 44.91 శాతానికి పెరగ్గా, జులైలో 21.95 శాతంగానే ఉన్నాయి. తయారీ రంగంలో ద్రవ్యోల్బణం 2.45 శాతం నమోదవగా, జులైలో ఇది 2.18 శాతంగా ఉంది.
ఆగస్టు నెలలో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి స్వల్పంగా పుంజుకుంది. జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను)ని అమలుతో తయారీ రంగం ఉత్పత్తి ఇప్పటికీ మందగమన స్థితిలోనే ఉంది. ఇక ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. గనులు, విద్యుత్ రంగాల్లో ఉత్తమమైన పనితీరు వల్ల జులైలో ఐఐపి 1.2 శాతంతో పుంజుకుంది. జూన్‌లో 0.1 శాతంతో పోలిస్తే ఈసారి ఐఐపి వృద్ధిని సాధించింది. అయితే 2016 జులైలో ఐఐపి 4.5 శాతంతో పోలిస్తే ప్రస్తుత రేటు దిగువ స్థాయిలోనే ఉంది. మరోవైపు ఆహార పదార్థాల ధరలు ప్రియం కావడంతో ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 3.36 శాతంతో పెరిగింది. అంతకుముందు నెల జులైలో ఇది 2.36 శాతంగానే ఉంది.
తగ్గించే అవకాశం లేదు: ఐసిఆర్‌ఎ నివేదిక
ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు మూడేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో ఆర్థిక పునరుద్ధరణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని వాదనలు పెరుగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఆర్‌బిఐ వడ్డీ రేటును తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. అయితే వచ్చే త్రైమాసికంలోనూ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని, యథాతథంగా కొనసాగవచ్చని ఐసిఆర్‌ఎ నివేదిక తెలిపింది. రిటైల్ ద్రవ్యోల్బణం 3.36 శాతానికి పెరిగింది. ఇది జూలై నెలలో 2.36 శాతంగా ఉంది. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ఆర్‌బిఐ వడ్డీ రేటు దిగిరాకపోవచ్చని ఐసిఆర్‌ఎ మేనేజింగ్ డైరెక్టర్ నరేష్ టక్కర్ తెలిపారు. కాగా అక్టోబర్ 3, 4 తేదీల్లో ఎంపిసి సమావేశం నేపథ్యంలో కార్పొరేట్లు వడ్డీ రేటు తగ్గింపును డిమాండ్ చేస్తున్నారు.