Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వెలుగుతున్న కళ్లు

'Eye Light Show' program is going on in rural areas

రెండవ రోజు విస్తృతంగా వైద్యశిబిరాలు
813 క్యాంపులు
గురువారం నాడు 86,945 మందికి నేత్ర వైద్యం
రెండు రోజుల్లో 1,13,293 మందికి సేవలు
ప్రజల నుంచి అనూహ్య స్పందన

మన తెలంగాణ/న్యూస్‌నెట్‌వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా జరుగుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ కార్యక్రమాన్ని బుధవారం అధికారికంగా ప్రారంభించగా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు యజ్ఞం తరహాలోనే చేపడుతున్నారు. మొదటిరోజు కార్యక్రమానికి అనూహ్యామైన స్పందన లభించిన స్ఫూర్తితో రెండవ రోజు కూడా అన్ని జిల్లాల్లో ప్రజలు వినియోగించుకుంటున్నారు. మిషన్ల తరలింపు ఆలస్యం కావడంతో అక్కడక్కడా ఈ కార్యక్రమం లేటుగా ప్రారంభమైంది. జిల్లాల వారీగా కార్యక్రమాల వివరాలు సంక్తిప్లంగా….

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి మండలంలోని ఇల్చీపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కళ్ళద్దాలను అందజేశారు. చూపును మెరుగుపర్చుకోవడానికి అందరూ పరీక్షలు చేయించుకోవాలని, జిల్లాలో 24 వైద్య శిబిరాలతో ఈ కార్యక్రమం జరుగుతోందని, జిల్లాకు 67 వేల కంటి అద్దాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎంఎల్‌ఏలు, ఎంపిలు, ఎంఎల్‌సిలు వారివారి ప్రాంతాల్లో కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి ఉమ్మడి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న కంటి వైద్య శిబిరాలను పరిశీలించారు. చాలా శిబిరాలు కిటకిటలాడుతుండడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని వ్యాఖ్యానించారు.

మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ‘కంటి వెలుగు’ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. గుర్తించిన కేంద్రాల్లో రోగులకు అవసరమయ్యే కంటి అద్దాలు, మందులు అందుబాటులో ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కొనసాగుతుండడంతో రోగులతో శిబిరాలు సందడితో నిండిపోయాయి. అంధత్వ నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డోర్నకల్ ఎంఎల్‌ఏ డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘కంటివెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ప్రజలకు కంటి అద్దాలను పంపిణీ చేశారు.

వికారాబాద్ జిల్లాలో 22 ‘కంటివెలుగు’ బృందాలు గ్రామాల్లో శిబిరాలను ఏర్పాటుచేశాయి. జిల్లా వ్యాప్తంగా 10 లక్షల మందికి పరీక్షలు, చికిత్స లక్షంగా పెట్టుకున్నారు. అవసరమైన కంటి అద్దాలు, మందులను పంపిణీ చేస్తారు. ఎంపిడివోలు నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. మంత్రి ప్రారంభించిన వెంటనే ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి వంటి ప్రాంతాలో శిబిరాలు ఏర్పాటయ్యాయి.

కరీంనగర్ జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల్లో 2700 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో మొదటి రోజు ఏడు వందల మందికి రెండవ రోజున రెండువేల మందికి పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 600 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. మొదటి రోజు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి మొదటిరోజే అనూహ్యామైన స్పందన లభించింది. జిల్లాలోని 321 గ్రామాలతో పాటు చొప్పదండి, కొత్తపల్లి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు, కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 10,20,500 మందికి చికిత్స పరీక్షలు చేయించనున్నారు. వీరి కోసం ఇప్పటికే 92,460 కళ్లద్దాలను అందుబాటులో ఉంచారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని మల్కాపూర్‌లో సిఎం ప్రారంభించగా మొదటిరోజే జిల్లా వ్యాప్తంగా 923 మందికి కంటి పరీక్షలు జరిగాయి. వీరిలో 102 మందికి ఉచితంగా కళ్ళజోళ్లను అందజేయగా 165 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా త్వరలోనే నిర్వహించనున్నారు. రెండవ రోజైన గురువారం దాదాపు 4 వేల మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని ప్రతీ మండంలోని మారుమూల గ్రామాల్లో ప్రజలకు కంటి పరీక్షలు చేయనున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో 7,60,810 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారులు నిర్ధారించారు. వీరి కొరకై ఇప్పటికే 67,200 కళ్ళ జోళ్లను పంపిణీ కోసం సిద్దంగా ఉంచామని, మరో 18,800 కళ్ళజోళ్లను కూడా జిల్లాకు రప్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

అంధత్వ నివారణ కోసం ప్రభుత్వ చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ఖమ్మం జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. కంటి పరీక్షల కోసం ప్రజలు పెద్ద ఎత్తున కేంద్రాలకు తరలివెళ్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. మారుమూల, గిరిజన ప్రాంతాలపై అధికారులు ప్రధాన దృష్టి సారించారు. కంటి పరీక్షల కోసం గిరిజనులు పెద్ద ఎత్తున శిబిరాలకు చేరుకుంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతీ ఒక్కరికి కంటి పరీక్షలను నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు రామవరం ఏరియాలో కంటి వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. సేవలు, కళ్లజోళ్ల పంపిణీపై కేంద్రానికి వచ్చిన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చర్ల, దుమ్ము గూడెం మండలాల్లో ఐటిడిఎ ప్రాజెక్టు డైరెక్టర్ పమేలా సత్పథి పర్యటించారు.

పెద్దపల్లి జిల్లాలో రెండు రోజులుగా ఎలిగేడ్, జూలపల్లి, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాల ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని 17 గ్రామాల్లో మొదటి రోజు 498 మందికి, రెండవ రోజు 2,416 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన కళ్లద్దాలను అందజేశారు. జిల్లాలోని ప్రతి ఒక్కరికి పరీక్షలు జరుపుతామని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్ తెలిపారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల నుంచి విశేషంగా ప్రశంసలందుకుంటుంది. వరంగల్ రూరల్ జిల్లాలో 16 వైద్య బృందాలతో కంటి పరీక్షలను నిర్వహిస్తున్నారు.

సిద్దిపేట జిల్లాలో పంద్రాగస్టున ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల్లో ఆనందాన్ని నింపుతోంది. గురువారం పట్టణంలోని నాసర్‌పుర, హనుమాన్‌నగర్ తదితర ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. వైద్యులతో పాటు వైద్య సిబ్బంది పరీక్షల కోసం వచ్చిన వారిని అప్యాయంగా పలకరిస్తూ పరీక్షలు నిర్వహిం చారు. ఇందులో కొందరికి మందులు, మరింత మంది కళ్లద్దాలను పంపిణీ చేశారు.

Comments

comments