Home తాజా వార్తలు కోటి కళ్ళ వెలుగు

కోటి కళ్ళ వెలుగు

Eye lights testes to crore People in 67 days

 

67 రోజుల్లో కోటి మందికి కంటి వెలుగు పరీక్షలు

మన తెలంగాణ ప్రతినిధి/ హైదరాబాద్: “కంటి చూపు మందగించిన వారి పాలిట కంటిపాప. చూపులేక దిక్కుతోచని వారికి పెద్ద దిక్కు. తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరూ కళ్లారా చూడాలని ’కంటి వెలుగు’ రూపకర్త. కోటి కళ్లల్లో కాంతి అయిన చంద్రుడు” తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది పంద్రాగస్టు రోజున ప్రారంభించిన ‘కంటి వెలుగు’ పథకం కింద వైద్య పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య కోటి దాటింది. కటిక చీకటి నుంచి పండువెన్నలను వీక్షించిన వారు ఇంటికి పెద్దకొడుకైన తీరులో కెసిఆర్‌ను కళ్లారా దీవించేందుకు సన్నద్ధమౌతున్నారు. కంటి పరీక్షలు నిర్విఘ్నంగా కొనసాగుతుండటంతో లబ్దిదారులు గుర్తు పెట్టుకొని మరీ టిఆర్‌ఎస్‌కు ఓటేస్తారని ఆ పార్టీ నేతలు కొండంత నమ్మకం పెట్టుకున్నారు.

ఆగస్టు 15వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన ఈ పథకం కింద చేస్తున్న కంటి పరీక్షలు కేవలం 67 రోజుల్లో కోటి మందికి చేరుకొంది. వీరిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలు ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు ఘనవిజయం సాధించింది. ప్రతిరోజూ సరాసరిన 1.50 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని డాక్టర్లు, ఉద్యోగులు సాకారం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పథకాన్ని సఫలం చేయటంలో తమవంతు పాత్ర పోషించారు. గ్రామాల్లో కెసిఆర్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుందని విస్త్రృత ప్రచారం జరుగుతుండటంతో అది తమకు కలిసి వస్తుందని టిఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

లబ్దిదారులు అధికంగా బడుగు బలహీన వర్గాలే …
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని అధికంగా పేదలు, బడుగు బలహీన వర్గాల వారే ఉపయోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరు వేల గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తయింది. అంటే 60 శాతం గ్రామాల్లో ఈ పథకం కింద కంటి పరీక్షలు పూర్తిచేశారు. ఇప్పటివరకు చేసిన కంటి పరీక్షల్లో బిసిలు 56.83 లక్షల (56.82%) మంది ఉండటం గమనార్హం. తర్వాతి స్థానంలో ఎస్‌సిలు 17.01 శాతం, ఎస్‌టిలు 10.62 శాతం ఉన్నారు. మైనారిటీలు 5.17 శాతమున్నారు. అంటే దాదాపు 90 శాతం వరకు ఆయా వర్గాలకు చెందినవారే లబ్దిదారులుగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఏళ్లుగా తమ కళ్ల గురించి పట్టించుకున్న నాధుడే లేడన్న భావన వారిలో ఉంది. కళ్లు కనబడటంలేదని అనుకోవడమే కానీ, ఆసుపత్రికి వెళ్లి తప్పనిసరిగా చూపించుకునే ఆర్దిక పరిస్థితి లేదు. పైగా దీన్ని అత్యవసరంగా చూపించుకోవాలన్న భావన పేదల్లో ఉండేది కాదు. దీంతో ఒక్కసారిగా మూడు నెలల్లోనే ఏకంగా కోటి మంది వరకు కంటి పరీక్షలు చేయించుకునే పరిస్థితి రావడం విశేషం. అలా పేదలు, బడుగు బలహీన వర్గాల్లో ఈ ప్రభుత్వం తమకు ప్రయోజనం చేకూర్చిందన్న భావన ఏర్పడింది. ఇది ఈఎన్నికల్లో ప్రభావం చూపించనుందని పరిశీలకుల అంచనా.

40 ఏళ్లు పైబడిన వారే కీలకం…
ఇప్పటివరకు చేసిన కంటి పరీక్షల్లో 36.33 లక్షల (36.61%) మందికి ఏదో ఒక లోపం ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. అందులో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. రీడింగ్ గ్లాసులు తీసుకున్న వారిలో ఏకంగా 14 లక్షల మంది 40 ఏళ్లు పైబడిన వారే కావడం గమనార్హం. వారు కాకుండా చత్వారంతో బాధపడుతున్నవారు 12.95 లక్షల మంది ఉన్నారు. వారికి ప్రత్యేకం గా కళ్లద్దాలు తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో ఇప్పటివరకు 1.86 లక్ష్లు అందజేశారు.

వీరుగాక 50 ఏళ్లు పైబడిన వారిలో 6.80 లక్షల మందికి క్యాటరాక్ట్ సహా ఇతర ఆపరేషన్లు చేయాల్సిన అవసరముందని నిర్ధారించారు. వారిలో కొందరికి ఆపరేషన్లు చేసినా, ప్రస్తుతం ఎన్నికలు కావడంతో బ్రేక్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆపరేషన్లు చేస్తారని అధికారులు చెబుతున్నారు. చిన్నచిన్న లోపం ఉన్నవారికి మందులు రాసివ్వడం, ఏదీ లేదని నిర్ధారణ చేయడం జరిగింది. కంటి సమస్యలున్నవారు 40 ఏళ్లకు పైబడిన వారే ఉండటం, ఏళ్లుగా ఎవరూ చేయని విధంగా ఉచిత కళ్లద్దాలు, ఆపరేషన్లు చేయనుండటంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అది తమకు ఎన్నికల్లో ప్రయోజనం కలిగిస్తుందని టిఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి.

Eye lights testes to crore People in 67 days

Telangana Latest News