Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

పల్లె పల్లెకు కంటి వెలుగు

Eye tests are free for everyone in the state

రేపు మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ప్రారంభించనున్న సిఎం కెసిఆర్

12,751 పంచాయతీల్లో ప్రతి గ్రామ ప్రజలకు లబ్ధి
దృష్టి లోపంతో బాధపడుతున్న తెలంగాణ ప్రజలకు వైద్య పరీక్ష, శస్త్రచికిత్స, కళ్లజోళ్లు
812 వైద్య బృందాలు సిద్ధం
రిజర్వులో మరి 133
వారంలో ఐదురోజులపాటు శిబిరాలు
అధికారులకు విధి విధానాలు స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘కంటివెలుగు’ పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ మెదక్ జిల్లా మల్కాపూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజైన బుధవారం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ప్రతీ శాననసభ నియోజకవర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా కళ్ళజోళ్ళను, అవసరమైన వారికి ఉచితంగానే ఆపరేషన్లను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. పంద్రాగస్టు నుంచి ప్రారంభం కానున్న ఈ పథకంపై ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ వైద్యారోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఎక్కడా లోపం లేకుండా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో ప్రతీ గ్రామంలోని ప్రజలకు లబ్ధి చేకూరేలా వైద్య శిబిరాలను నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ చేసిన కార్యక్రమాలు, ఏర్పాట్లు, అవగాహన, వైద్య బృందాల ఖరారు తదితర అంశాలపై సిఎం సమీక్ష జరిపినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కంటి చూపు లోపంతో బాధపడుతున్నవారికి కంటి పరీక్షలు చేసి, కండ్లద్దాలను, చికిత్ప అందించే నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’ పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 812 వైద్య బృందాలను వైద్యారోగ్య శాఖ సిద్ధం చేసిందని, ప్రతీ వారంలో ఐదు రోజుల పాటు వైద్య శిబిరాలు జరుగుతాయని ఆ ప్రకటనలో పేర్కొనింది.

అవసరార్ధం వినియోగించుకోడానికి సిద్ధంగా మరో 133 వైద్య బృందాలను కూడా రిజర్వులో పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ఏర్పాట్లు, జాగ్రత్తలు తదితర అం శాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, శాసనసభ్యులు రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆరూరి రమేశ్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ఎస్. నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ, డైరక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ గ్రామానికి ‘కంటి వెలుగు’ : ముఖ్యమంత్రి
కంటి చూపును నిర్లక్ష్యం చేస్తూ దృష్టిలోపంతో బాధపడుతున్న తెలంగాణ ప్రజలకు వయస్సుతో సంబంధం లేకుండా విప్లవాత్మకమైన ‘కంటివెలుగు’ పథకం ద్వారా ఉచితంగా వైద్య పరీక్ష, శస్త్ర చికిత్స, కళ్ళజోళ్ళు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవే శపెడుతున్నదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అవసరమైన వారికి మందులను సైతం ప్రభుత్వం ఉచితంగా అందజేయనున్నట్టు సిఎం తెలిపారు. కంటిని కాపాడుకునేందు కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంటి ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనను కూడా కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ సందర్భంగా కల్పించనున్నట్లు తెలిపారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని గ్రామాల్లో, వార్డును యూనిట్‌గా తీసుకుని పట్టణాల్లో కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తున్నట్టు అధికారులు సిఎంకు వివరించారు.

కంటివెలుగు క్యాంపులో, ఒక మెడికల్ ఆఫీసర్, కంటి వైద్యుడు,ఎఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, ‘ఆశా’ వర్కర్లు తదితర ఆరు నుంచి ఎనిమిది మందితో కూడిన బృందం ప్రజలకు సేవలందిస్తుందని తెలిపారు. వీరికి పూర్తిస్థాయి వాహనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో క్యాంపులోని వైద్య బృందం రోజుకొకటి చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో కేవలం 40 శాతం మందికి మాత్రమే వైద్యం అవసరమవుతుందని అంచనా వేసినట్లు అధికారులు సిఎంకు వివరించారు. అత్యవసర సమయంలో వినియోగించుకునేందుకు ప్రతీ జిల్లాకు ఇద్దరి నుంచి నలుగురు వైద్య అధికారులు కంటి వైద్య నిపుణులను అందుబాటులో ఉంచనున్నామని, మొత్తంగా 812 వైద్య బృందాలు తెలంగాణ వ్యాప్తంగా ‘కంటివెలుగు’ కార్యక్రమంలో పాల్గొని వైద్య సేవలు అందిస్తున్నట్లు అధాకారులు సిఎంకు వివరించారు.

నాణ్యమైన కంటి అద్దాలు : ‘కంటి వెలుగు’ సమీక్షలో అధికారులు ఇచ్చిన వివరణ అనంతరం ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీ తయారు చేసిన నాణ్యమైన కంటి అద్దాలను అందుబాటులోకి తెచ్చినందున ఐదు నెలల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఇందులో పాల్గొంటున్న వైద్య బృందాలు మరింత నాణ్యమైన పనివిధానాన్ని కనపరిచేందుకు వారానికి రెండు రోజులు వారాంతపు సెలవులు ఇవ్వాలని సూచించారు. వైద్య బృందాలు అందించిన చికిత్స అనంతర తదుపరి పరీక్ష కోసం స్థానికంగా అందుబాటులో వున్న ప్రైవేటు, ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న దవాఖానలను గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన మేరకు తాత్కాలిక పద్దతుల్లో ఉద్యోగులను నియమించుకోవాలని సిఎం సూచించారు. తెలంగాణలో కంటి చూపు సమస్యలతో ఏ ఒక్కరూ బాధపడకుండా చూడాలనే సదుద్దేశంతో ప్రారంభిస్తున్న ఈ పథకాన్ని విజయవంతం చేయాలని, అందుకుగాను ప్రజాప్రతినిధులను వివిధ స్థాయిల్లోని సామాజిక కార్యకర్తలను, బాధ్యతగల పౌరులను భాగస్వాములను చేయాలని ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Comments

comments