Home ఆఫ్ బీట్ కంటికి చికిత్స ఏది

కంటికి చికిత్స ఏది

రోజురోజుకూ పెరగుతోన్న సమస్యలు
వందలో 15మందికి కంటి జబ్బు, 40 ఏళ్లు పైబడిన వారికి గ్లకోమా వచ్చే అవకాశం
రేపటి నుంచి గ్లకోమా వారోత్సవాలు, తిరిగి చూపు తెప్పించడం సాధ్యం కాదంటున్న వైద్యులు

Eye-Operation

మన తెలంగాణ/సిటీబ్యూరో : మనిషికి కంటి చూపులేకపోతే ప్రపంచాన్ని చూసే అవకాశం ఉండదు. అన్ని అవయవాలు పనిచేసినా కళ్లు లేకుంటే కష్టం. రేపటి నుంచి గ్లకోమా వారోత్సవాల సందర్భంగా కళ్లకోసం ఎంత మంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడంతా కంపూటర్ల ముందు కూర్చోని గంటలు గంటలు పనిచేయడం, స్మార్ట్ ఫోన్లలో చాటింగ్‌లు చేయడం ఎక్కువైపోయింది. దీంతో కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. కొన్ని గంటల పాటు విరామం లేకుండా చూస్తూ ఉండడం వల్ల కళ్లు బాగా అలసిపోతాయి. కళ్లకు విశ్రాంతినివ్వకుండా అదే పనిగా గంటల తరబడి కళ్లకు పనిపెట్టిస్తున్నాం. దీంతో కంటి సమస్యల బారినపడుతున్న వారు అధికమవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఐవరోపియా, మయోపియా, రేచీకటి, గ్లకోమా లాంటి సమస్యలు అందరిలో సర్వసాధారణం అయిపోయాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్కుల వారందరికి కంటి జబ్బులు సాధారణమయ్యాయి. పెద్దల కంటే చిన్నారులకు వచ్చే కంటి వ్యాధులే ప్రమాదకరంగా ఉంటున్నాయి. వీటికితోడు డయాబెటిక్, రెటినోపతి సమస్యలు మధ్య వయస్సు వారిని వేధిస్తున్నాయి. జెనటిక్ డిజార్డర్ వల్లనే చాలా వరకు కంటి సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు అంటున్నారు. వయసు మీద పడిన వాళ్లకి కంటి సమస్యలు రావడం సహజంగా కనిపించే విషయం.

కానీ ఇప్పుడు చిన్నారులు, యువతను కూడా కంటి వ్యాధులు వేధిస్తున్నాయి. ప్రతి వంద మందిలో 15మంది కంటి వ్యాధులతో బాధపడుతున్నవారేనని తాజా లెక్కలు చెబుతున్నాయి. చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలు సులువుగా గుర్తించలేమని డాక్టర్లు పేర్కొంటున్నారు. చిన్నారులకు లాంగ్, షార్ట్ సైట్‌కు సంబంధించి మయోఫియా, ఐవరోఫియా వ్యాధులు వస్తున్నాయి. ఇంతే కాకుండా మధ్యవయస్సు వారికి వచ్చే రేచీకటి, గ్లకోమా లాంటి కంటి సమస్యలు పెరుగుతున్నాయి. కంటి పాప తెల్లగా కనిపించే ల్యూకో కోరియా అనే వ్యాధి కూడా ఈ మధ్య చాలామందిలో వస్తోంది. 35ఏళ్ల పై బడిన వారిలో డయాబెటిక్ రెటినోపతి ఇటీవల కుంగదీస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది వివిధ కంటి జబ్బులతో బాధపడుతున్నారు. వీళ్లల్లో ప్రతి ఏడాది లక్ష మందికి కార్నియా అవసరమవుతోందని కొన్ని సర్వేలు పేర్కొంటున్నాయి. 60శాతం మందికి సరైన వైద్యం అందడంలేదు. కొందరిలో మేనరికం పెళ్లిళ్లతో పాటు, జన్యుపరమైన ఇబ్బందులే కంటి సమస్యలకు కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. వృద్ధాప్యంలో వచ్చే క్యాటరాక్ట్ సమస్యలకు ఆధునిక టెక్నాలజీతో చికిత్స అందుబాటులో ఉన్నా చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు అడ్వాన్స్ వైద్యం లేని పరిస్థితి. చిన్నారుల సమస్యలను తల్లిదండ్రులు తొందరగా గుర్తిస్తే శాశ్వత అంధులుగా మారకుండా చేసే వీలుంటుందని వైద్యులు అంటున్నారు.

అంధత్వానికి కారణం గ్లకోమా

గ్లకోమా కంటి ఒత్తిడిలో పెరుగుదల సంబంధిత వ్యాధి. దాని లక్షణం పునరుద్ధరించలేని అంధత్వానికి దారితీసే కంటి నరానికి హాని. సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారికి గ్లకోమా వచ్చే అవకాశముంది. గ్లకోమా ఉన్న రోగుల కుటుంబసభ్యలు కూడా గ్లకోమా పరీక్షలు నిర్వహించుకోవాలి. దాదాపు 10–నుంచి 20శాతం కేసుల్లో ఈ వ్యాధి తోబుట్టులను, పిల్లలను ప్రభావితం చేయవచ్చని వైద్యులు అంటున్నారు. ఈ సమస్య బారినపడిన వారిలో ముందుగా ఎలాంటి లక్షణాలు కనడబవు. అందుకే క్రమం తప్పకుండా ఆరు నెలలు లేదా ఏడాదికోసారి కంటి వైద్యడ్ని సంప్రదించమని వైద్యులు సూచిస్తున్నారు. కంటికి గాయం ఆయినా, కంట్లో రక్తనాళాలు బ్లాక్ అయినా, వాపుకు సంబంధించి సమస్యలున్నా గ్లకోమాకు దారితీయవచ్చు.

రెటీనా సమస్యలు

సమస్యలు కంటి వెనుక భాగంలో అతి పల్చని పొరే రెటీనా. ఇది కణాల కలయికతో ఉంటుంది. కంటి ముందున్న దృశ్యాలను గ్రహించి వాటిని మెదడుకు చేరవేస్తోంది. రెటీనాలో సమస్య ఏదైనా ఈ వ్యవస్థకు విఘాతం కలుగుతోంది. వయసు కారణంగా ఏర్పడే మాక్యూలర్ డీ జనేరేషన్‌తో రెటీనా కొంత భాగం క్షీణిస్తోంది. డయాబెటిక్ రెటీనోపతితో రెటీనాకు సంబంధించిన రక్తనాళాలను దెబ్బతీయడం మరో కారణం. రెటీనా డీటాచ్‌మెంట్ మరొకటి. ప్రారంభదశలో సమస్యను గుర్తిస్తే దాన్ని నియంత్రించి చూపును కాపాడవచ్చు. సమస్య తీవ్రతరం అయితే చూపును తిరిగి తెప్పించడం సాధ్యం కాదని వైద్యులు అంటున్నారు. క్యాటరాక్ట్ సమస్యలో వెలుగు అంత సాఫీగా రెటీనాకు చేరదు. దీంతో చూపులో స్పష్టత తగ్గుతుంది. రాత్రి సమయాల్లో బల్బ్‌లను చూస్తున్నప్పుడు చుట్టూ వృత్తం మాదిరిగా కనిపిస్తోంది. క్యాటరాక్ట్ సమస్య ఒక్కసారిగా ఏర్పడదు. కొద్దికొద్దిగా పెరుగుతోంది. నొప్పి, ఎర్రబారడం, నీరు కారడం, తరహా లక్షణాలేవీ ఉండవు. సర్జరీ ద్వారానే పూర్తిగా తొలగిపోయే సమస్య ఇదని వైద్యులు పేర్కొంటున్నారు.