Home తాజా వార్తలు వెలుగు బాటలో రాష్ట్రం

వెలుగు బాటలో రాష్ట్రం

Eyewitness program is continuing in the districts

పల్లెల్లో కంటి వెలుగుల సందడి
3వ రోజూ విశేష స్పందన
‘క్యూ’కడుతున్న కంటి బాధితులు
నిత్యం పర్యవేక్షిస్తున్న అధికారులు
కళ్లద్దాలు, మందుల పంపిణీ

మన తెలంగాణ / న్యూస్ నెట్‌వర్క్ : ‘కంటి వెలుగు’ కార్యక్రమం జిల్లాల్లో జాతరలా కొనసాగుతున్నది. వైద్య శిబిరాలతో పల్లెల్లో సందడి నెలకొంది. కంటి వెలుగు శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తుండగా, గ్రామీణ బాధితులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అనేక వైద్య శిబిరాల్లో ప్రజలు బారులు తీరి కనిపించారు. వివిధ జిల్లాల్లో కంటి శిబిరాలకు బాధితులు వందల సంఖ్యలో హాజరవుతున్నారు. సిబ్బంది ఓపికతో కంటి పరీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన వారికి అద్దాలు అందిస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంతో గ్రామాల్లో ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణం గా ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. మిగిలిన జిల్లాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్నది.  రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, కలెక్టర్లు, వైద్య శాఖ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శిస్తూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు.

అధికారులు, సిబ్బంది కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అవసరం అయిన వారికి అప్పటికప్పుడు కళ్లద్దాలను కూడా అందిస్తుండటంతో ప్రజల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అద్దాలను తీసుకుంటూ కేసీఆర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉం డటం మా పేదల పాలిట వరం అంటూ కొనియాడుతున్నారు. వచ్చే ఎన్నిక ల్లో కూడా కేసీఆర్‌ను తమ ఇంటి పెద్దబిడ్డగా భావించి తనకే ఓటు వేసి గెలిపిస్తామని ఘంటాపథంగా చెప్తున్నారు.  ఎక్కడికీ కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా, పైసా ఖర్చు కాకుండా తమ ఊరిలోనే కంటి పరీక్షల శిబిరాలను నిర్వహిస్తుండడం పట్ల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంటివెలుగు పథకాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు కంటి సమస్యలను దూరం చే యాలనే లక్షంతో ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు పథకాన్ని రాష్ట్ర ప్రభు త్వం అట్టహాసంగా ప్రారంభించింది. అంధత్వం, దృష్టిలోపం, కంటి శుక్లా లు, కంటి గుడ్డు పై మాంసం రావడం, గ్లకోమా వంటి సమస్యలున్నవారిని గుర్తించి సరియైన శస్త్ర చికిత్సలు చేయించి అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్షంగా సిఎం కేసిఆర్ ఈ పథకానికి అంకురార్పణ చేశారు.

కంటి బాధితులతో పాటు ప్రజలు కంటి వెలుగు కార్యక్రమానికి జేజేలు పలుకుతూ కెసిఆర్ ప్రభుత్వానికి సలాం చేయక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం చేయ డం కొస మెరుపు. నిజామాబాద్  జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు పథకానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. చక్కనైన “కంటి వెలుగు” కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు శిబిరంలో అధిక సంఖ్యలో బారులు తీరారు.  జిల్లాలోని కామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి, భిక్కనూర్, రాజంపేట్, సదాశివనగర్, గాంధారి, లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, బీర్కూర్, నస్రూల్లాబాద్, పెద్దకొడప్‌గల్ మండలాల కేంద్రాలలో నిర్వహిస్తున్న శిబిరానికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు.  తమ లాంటి నిరుపేదలకు చక్కని చూపును ప్రసాదించడానికి కేసిఆర్ కంటివెలుగు పథకాన్ని ప్రవేశపెట్టడం ఎంతో ఆనందాన్నిస్తుందని వృద్ధులు పేర్కొంటున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని 15 మండలాలలో కంటి వెలుగు కార్యక్రమం ప్రజాదరణతో ముందుకు సాగుతుంది.

కంటి వెలుగు కార్యక్రమం మూడవ రోజు శుక్రవారం ఉమ్మడి మ హబూబ్ నగర్ జిల్లాలో వర్షాలను సైతం లెక్క చేయకుండా ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా సమీపంలోని కంటి వైద్య శిబిరాలకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. గుర్తించిన కేంద్రాల్లో రోగులకు అవసరమయ్యే కంటి అద్దాలు, మందులు అందుబాటులో ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కొనసాగుతుండడంతో రోగులతో శిబిరాలు సందడితో నిండిపోయాయి. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 321 గ్రామాలతో పాటు చొప్పదండి, కొత్తపల్లి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో 24 టీంలు ప్రతిరోజు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.  ఈ కార్యక్రమం మెదక్ జిల్లాలో చురుకుగా కొనసాగుతుంది. శుక్రవారం మెదక్ జిల్లా కొల్చారం  మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో కొల్చా రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా  వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు తనిఖీ చేశారు.