Home హైదరాబాద్ నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

Police-image

మొత్తం 71 మంది నిందితులు
32 సంస్థల ధ్రువీకరణ పత్రాలు స్వాధీనం
8 మంది అదుపులో… 9 మంది పరారీలో
 లక్షల్లో వసూళ్ళు… వెబ్‌సైట్లో పేర్లు నమోదు

మనతెలంగాణ/ హైదరాబాద్ సిటీబ్యూరో : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 విద్యాసంస్థలకు చెందిన నకిలీ విద్యా సర్టిఫికెట్లను తయారు చేస్తూ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 17 మంది ఒక ముఠాగా ఏర్పడి ఈ నకిలీ విద్యా సర్టిఫికెట్ల వ్యవహారాన్ని దేశం నలుమూలలకు విస్తరిస్తున్నారు. ఇది తెలిసిన రాచకొండ ఎస్‌ఓటి పోలీసులు నిందితులకు చెందిన పలు సంస్థలపై దాడులు నిర్వహిం చి 9 మందిని అదుపులోకి తీసుకుని 160 నకిలీ విద్యా సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆవుల శ్రీనివాస్, సంధ్య, మహ్మద్ యూనస్, మహ్మద్ సమీర్ పాషా, ఈర్ల మహేందర్, రామ్‌మోహన్‌గౌడ్‌లు ఉన్నారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అంతరాష్ట్ర ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

సర్టిఫికెట్ల చలామణి ఇలా : కరీంనగర్ జిల్లాకు చెందిన ఆవుల శ్రీనివాస్ యువ ఎడ్యుకేషనల్ సొసైటీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ విద్యా సంస్థలకు చెందిన నకిలీ విద్యా సర్టిఫికెట్లను విద్యార్థులకు సరఫరా చేస్తూ భారీ మొత్తం లో నగదును సంపాదిస్తున్నాడు. ఆవుల శ్రీనివాస్ ఇతర రాష్ట్రాల్లోని తమకు పరిచయమున్నవారితో ఈ నకిలీ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. అనంతపురానికి చెందిన సంధ్య అలియాస్ గీతాంజలి, ఢిల్లీలోని డైరెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సంస్థకు చెందిన జయ, అరుణ్‌కుమార్ సైనీ, మదన్‌కుమార్‌లు ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారు.

నిందితులు వారి విధులు :

ఆవుల శ్రీనివాస్: నకిలీ సర్టిఫికెట్లను విద్యార్థులకు విక్రయించడం.

నేహ : న్యూడిల్లీలో రైట్ ఎడ్యుకేషన్ అకాడమీ నిర్వహిస్తూ సింఘానియా యూనివర్సిటీ సర్టిఫికేట్లను సిద్దంచేస్తారు.

సంజయ్ : చండీఘర్‌కు చెందినవాడు. ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన సర్టిఫికెట్లను ఆవుల శ్రీనివాస్‌కు అందిస్తున్నాడు.

అరుణ్‌కుమార్, మదన్‌కుమార్,జయ: వీరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సంస్థలో ఆవుల శ్రీనివాస్ చెప్పినవారి పేర్లను ఎలాంటి పరీక్షలను నిర్వహించకుండానే ఆ సంస్థ వెబ్‌సైట్‌లో నమోదు చేయడం, లక్ష రూపాయలకు ఒక సర్టిఫికెట్‌ను అందించడం. వీరి నుండి మొత్తం 32 సర్టిఫికెట్లను జారీచేశారు. సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నై, ప్రభుత్వ పాలిటెక్నిక్ బరేలీ, సింఘానియా యూనివర్సిటీ రాజస్థాన్‌లకు చెందిన సర్టిఫికెట్లను వీరు శ్రీనివాస్‌కు మెయిల్ ద్వారా అందజేశారు.

సంధ్య: అనంతపురంకు చెందిన రాఘవేంద్ర నిర్వహిస్తున్న కంప్యూటర్ కేంద్రంలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుంది. ఈమె యజమాని రాఘవేంద్ర అతని సహాయకులు హరినాథ్, సాయిలతో కలిసి నకిలీ సర్టిఫికెట్లను హైదరాబాద్, అనంతపూర్,బెంగళూరులోని విద్యార్థులకు అధిక మొత్తానికి విక్రయించడం చేస్తున్నారు. వీరు ఢిల్లీలోని సోనిక, అరుణ్‌కుమార్ సైనీలతో సంబంధాలను నెర్పుతూ భారతీయ మహా విద్యాలయచెన్నై, మహాత్మాగాంధీ యూనివర్సిటీవారణాసి, మేవర్ యూనివర్సిటీలకు చెంది 100 సర్టిఫికెట్లను విక్రయించినట్టు వెల్లడించారు.

పరారీలో: నిందితుల్లో రాఘవేంద్ర, హరినాథ్‌లు కడపజైలులో ఉన్నారు. సాయి పరారీలో ఉన్నారు. అరుణ్‌కుమా ర్, మదన్‌కుమార్, జయ, సోనిక, నేహ, సంజయ్, ఆనం ద్,వంశీ మొత్తం 9 మంది నిందితులు పరారీలో ఉన్నారు.
వ్యవహారాలు: దేశంలోని 32 ప్రైవేట్ విద్యాసంస్థల డైరెక్టర్లతో సంబంధాలు నెరుపుతూ ఆయా సంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే వారి పేర్లను నమోదు చేస్తున్నారు.

ఆయా సంస్థలకు చెందిన వెబ్‌సైట్లలో నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసే విద్యార్థుల పేర్లు పొందుపరుస్తున్నారు. ఎవరైనా ఆన్‌లైన్‌లో వారి పేర్లను తనిఖీలు జరిపితే వారి సర్టిఫికెట్లు నిజమైనవేనని వెల్లడిచేందుకు వీలుగా వారి పేర్లు, సర్టిఫికెట్లు నెంబర్లు నమోదుచేస్తున్నారు. అందుకు అధిక మొత్తంలో నగదును తీసుకుంటున్నారు. ప్రధాన నిందితుడైన ఆవుల శ్రీనివాస్ వాట్సాప్‌ను పరిశీలిస్తే 32 విద్యాసంస్థలకు చెందిన సర్టిఫికెట్లను పలువురు విద్యార్థులకు అందజేసినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.