Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం

అంతా నకిలీ వైద్యం 

అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం
రోగాల పేరిట కాసుల వర్షం
జోరుగా సాగుతున్న మెడికల్ దందా

doctorఆదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కొంత మంది పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ వైద్యం జిల్లా అంతటా విశృంఖలంగా సాగుతూ ప్రస్తుతం ప్రధాన ఆదాయ వనరుగా మారింది. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలోలా అచ్చంగా అమలు చేస్తూ కొంత మంది వైద్యాన్ని కాసుల వ్యాపారంగా మారుస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేనివారు పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లో సైతం క్ల్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు దర్జాగా ఏర్పాటు చేస్తున్నారు.

ఇదే కాకుండా వీరు తమ దవాఖానాలోనే మందుల దుకాణాలు, మెడికల్ ల్యాబరేటరీలు కూడా ఏర్పాటు చేస్తు రోగులను దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బినామీ వైద్య సర్టిఫికేట్లతో తమ దందాను నిర్భయంగా చెలాయిస్తున్నారు. అసలు సర్టిఫికెట్ దారులు ఎక్కడో నివసిస్తుండగా ఈ బినామీ వ్యక్తులు వారి పేరిట ఈ వైద్య వ్యాపారాన్ని కొనసాగిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరి కొంతమంది ఆసుపత్రుల నిర్వాహకులు ఒక అడుగు ముందుకు వేసి ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి రప్పించి వారి చేత ప్రాక్టీస్ కొనసాగింపు చేస్తున్నారు. నిర్వాహకులతో ఒప్పందం గుడువు ముగియగానే సదరు డాక్టర్లు తిరిగి వెళ్లిపోతున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం వారి పేరిటే ఆర్‌ఎంపి వైద్యుల చేత బినామీ ప్రాక్టిస్‌ను కొనసాగింపచేస్తున్నారు.

మరి కొంతమంది ఎలాంటి అర్హతలు లేకున్నా తప్పుడు సర్టిఫికెట్‌లతో సైతం వైద్యం ప్రాక్టీస్‌ను నిర్వహిస్తున్నారు. బిఎంపి, ఆర్‌ఎంపి, పిఎంపి, ఎఎంబిఎస్ లాంటి నకిలీ సర్టిఫికేట్‌లతో పల్లెల్లో దర్జాగా ప్రాక్టీసులు నిర్వహిస్తూ వేలాది రూపాయల ఆర్జిస్తున్నారు. కాగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఆయుర్వేద వైద్యం పేరిట కొంత మంది సంతాన సాఫల్య కేంద్రాలను సైతం నిర్వహిస్తుండడం గమనార్హం. నకిలీ వైద్యులు క్వాలిఫైడ్ వైద్యులకు పోటీని ఇచ్చే స్థాయికి ఎదగడం పతనమవుతున్న వైద్య విలువలకు నిదర్శనంగా చెప్పవచ్చు. అలాగే కొంత మంది గ్రామీణ ప్రాంతంలో ప్రాక్టీసు చేసే ఆర్‌ఎంపిలు భారీగా కమీషన్లకు కక్కుర్తిపడుతూ పట్టణ ప్రాంతాల ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. అయితే కొన్ని ఆసుపత్రుల్లో రోగుల అనారోగ్య తీవ్రతను బట్టి అక్కడి వైద్యులు, సిబ్బంది శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాను తలపించే విధంగా హైడ్రామాను సృష్టిస్తూ భారీగా ఫీజులు గుంజుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా వైద్యరంగం క్రమంగా పతనమవుతూ క్వాలిఫైడ్ వైద్యుల అస్థిత్వానికి ముప్పు ఎదురయ్యే పరిస్థితులు నెలకొంటుండగా ఈ వ్యవహారంపై స్పందించాల్సిన ఐఎంఎ గానీ, స్థానిక వైద్యుల సంఘాలు గానీ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలాగే సంబంధిత వైద్య శాఖ అధికారులు కూడా సరైన తనిఖీలు నిర్వహించకపోవడం, పర్యవేక్షణలు చేపట్టకపోవడంతో ఈ నకిలీ వైద్యం దందా ఎల్లలు దాటుతోంది. ఇప్పటికైనా క్వాలిఫైడ్ వైద్యుల సంఘాలు, ప్రజా సంఘాలు ఈ వ్యవహారంపై స్పందించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

Comments

comments