Home సినిమా అందరి మదిని దోచి అందనంత దూరానికి…

అందరి మదిని దోచి అందనంత దూరానికి…

ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త, చలన చిత్ర గేయ రచయిత సి.నారాయణరెడ్డికి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సంగీత ప్రియులను అలరించిన మధురమైన పాటలెన్నింటినో అందించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కళామతల్లి ఒడిలో నుండి ఆమె కీర్తి కిరీటంలో మరో కలికితురాయిలా శాశ్వత విశ్రాంతి కోసం ఆయన వెళ్లిపోయారు. సాహితీ లోకంలో, సినిమా రంగంలో తనదైన ముద్రలు వేసి నిష్క్రమించారు.  గొప్ప నటుడు ఎన్‌టిఆర్  స్వీయ నిర్మాణంలో నటించి, దర్శకత్వం వహించిన ‘గులేబకావళి కథ’ (1962) చిత్రంతో  సి.నారాయణరెడ్డి సినీ జీవితం ప్రారంభమైంది. అందులోని మధురమైన పాట ‘నన్ను దోచుకుందువంటే వన్నెల దొరసానీ…’ అనే పాటతో పాటల రచయితగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. దాదాపు మూడు తరాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో 3500కి పైగా పాటలు రాశారు సినారె. తన సమకాలికులలో ఆఖరి గేయ రచయితగా భువి నుండి దివికి పయనమై వారి సరసన చేరుకున్నారు. 

CNR-Death

ఎన్‌టిఆర్‌తో తొలి సినిమా…
1960 దశకం ప్రారంభంలో గ్లామర్ పరిశ్రమగా సినీ రంగం ఎంతో పేరొందింది. అక్కడ అవకాశం దక్కితే చాలు అని అనేకమంది తపించిపోతూ ఉన్నారప్పటికే. ఆ సమయంలో ప్రముఖ కథానాయకుడిగా పేరుతెచ్చుకున్న ఎన్టీఆర్ సినిమాకు పనిచేసే అవకాశం అంటే అదంత సులభం కూడా కాదు. అలాంటి అవకాశం వచ్చి సింగిరెడ్డి నారాయణరెడ్డి ఇంటి తలుపును తట్టింది. అప్పుడు ఆయన స్పందించిన తీరు ఆయనంటే ఏమిటో చెబుతుంది. భాషా ప్రవీణుడైన సినారేతో ఒక పాట రాయించుకుందామని అనుకున్నారు ‘గులేబకావళి కథ’ దర్శకుడైన ఎన్టీఆర్. స్వీయ నిర్మాణంలో ఎన్టీఆర్ నటించిన చిత్రమిది. అలాAంటి సినిమాకు నారాయణరెడ్డి చేత పాటలు రాయించాలనే తలంపు వచ్చి ఎన్టీఆర్… సినారేను సంప్రదించారు. అప్పటికి ఆయనకు సినీ అవకాశాలేమీ లేవు. ఎన్టీఆర్ సినిమాకు రాసే అవకాశం వచ్చింది కాబట్టి ఎగిరి గంతేయాలి. అయితే సినారె ‘రాస్తాను కానీ…’ అని అన్నారట. ఎన్టీఆర్ ఆశ్చర్యంగా చూసి ‘ఏంటి సమస్య…’ అని అంటే, ‘సింగిల్ కార్డు… అయితే ఓకే’ అని సినారె చెప్పారట. తొలి సినిమా… ఎన్టీఆర్ చిత్రంలో అవకాశం… ఒక పాట రాసే అవకాశం వచ్చినా బోలెడంత గుర్తింపు, మరిన్ని అవకాశాలు వస్తాయి. కానీ నారాయణరెడ్డి మాత్రం అలాంటి గుర్తింపును ఆశించలేదు. ఆ రోజుల్లో ‘సింగిల్ కార్డు పాటల రచయిత’ అంటే గొప్ప గౌరవం ఉండేది. ఒక సినిమాకు అన్ని పాటలు రాసే అవకాశం ఒకరికే దక్కడాన్ని ‘సింగిల్ కార్డు’గా పరిగణిస్తారు. మరి సినిమాలకు కొత్త అయిన వ్యక్తికి ‘సింగిల్ కార్డు’ ఇవ్వడమంటే అంటే అది జరిగే పని కాదు కదా. అలాంటి డిమాండ్‌నే ఎన్టీఆర్ ముందు పెట్టారు సి.నారాయణరెడ్డి. అన్ని పాటలూ తనే రాసే అవకాశమిస్తే రాస్తా, లేకపోతే లేదు… అని సూటిగానే చెప్పారట. సినారేకి పాండిత్యం, భాషా నైపుణ్యం ఇచ్చిన ఆత్మ విశ్వాసమది. ఆ ఆత్మ విశ్వాసానికి ఎన్టీఆర్ కూడా విలువనిచ్చారు. ‘గులేబకావళి కథ’ సినిమాలో మొత్తం 12 పాటలు ఉంటాయి. అన్నింటినీ సి.నారాయణరెడ్డే రాశారు. తన తొలి సినిమాతోనే సింగిల్ కార్డు రచయితగా నిలవాలన్న తన ధ్యేయాన్ని నెరవేర్చుకోగలిగారు. ఆతర్వాత ఆయన ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగింది.

మైమరపించిన మధురమైన పాటలెన్నో…
సి.నారాయణరెడ్డి కలం నుంచి జాలువారిన మధురమైన పాటలెన్నో ఉన్నాయి. తొలి సినిమా ‘గులేబకావళి’తో గేయ రచయితగా ఆయన ఎంతో పేరు,ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అనంతరం 1962లోనే వచ్చిన ‘ఆత్మ బంధువు’ సినిమాలోని ‘అనగనగా ఒక రాజు… అనగనగా ఒక రాణి’ పాటతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అదేవిధంగా ‘కుల గోత్రాలు’ సినిమాలో ‘చెలికాడు నిన్నే రమ్మని పిలువ…’, ‘చిలిపి కనుల తీయని చెలికాడా…’ పాటలు మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. ఆవిధంగా సినారె సినీ ప్రస్థానం విజయవంతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో రాముడు భీముడు, గుడి గంటలు, లక్షాధికారి, కర్ణ, పునర్జన్మ, తిరుపతమ్మ కథ, అమరశిల్పి జక్కన్న, పరమానందయ్య శిష్యుల కథ, ఏకవీర, కోడలు దిద్దిన కాపురం, మానవుడు దానవుడు, తాత మనవడు, అల్లూరి సీతారామరాజు, కృష్ణవేణి, నిప్పులాంటి మనిషి, ముత్యాల ముగ్గు, తూర్పు పడమర చిత్రాల్లో సి.నారాయణరెడ్డి మధుర గీతాలెన్నింటినో రాశారు. ‘తాత మనవడు’లోని ‘అనుబంధం ఆత్మీయ అంతా ఒక బూటకం…’, కృష్ణ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘అల్లూరి సీతారామరాజు’లోని ‘వస్తాడు నా రాజు ఈ రోజు…’, ‘ముత్యాల ముగ్గు’లోని ‘గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మడి…’, ‘అమర శిల్పి జక్కన్న’లోని ‘ఈ నల్లని రాళ్లలో…’, ‘రాముడు భీముడు’లోని ‘తెలిసిందిలే తెలిసిందిలే… నెలరాజ నీ రూపు తెలిసిందిలే’, ‘కృష్ణవేణి’ చిత్రంలోని ‘కృష్ణవేణి తెలుగింటి విరిబోని…’ వంటి పాటలు సినారె కలం నుంచి జాలువారాయి. అదేవిధంగా ‘మంగమ్మగారి మనవడు’లోని ‘చందురుడు నిన్ను చూసి..’, ‘శ్రీ సూర్యనారాయణా మేలుకో…’, ‘స్వాతిముత్యం’లోని ‘లాలి లాలీ లాలి… వటపత్రశాయీ వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి’… వంటి గీతాలు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సి.నారాయణరెడ్డి చివరిసారిగా అనుష్క నటించిన బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘అరుంధతి’లో ‘జేజమ్మా జేజమ్మా…’ పాట రాశారు.

సినారేకు ఘన నివాళి…
హైదరాబాద్ పుప్పాలగూడలోని స్వగృహంలో ఏర్పాటుచేసిన సి.నారాయణరెడ్డి భౌతిక కాయాన్ని సినీ ప్రముఖులు చిరంజీవి, టి.సుబ్బరామిరెడ్డి, వెంకటేష్, జమున, మోహన్‌బాబు, బ్రహ్మానందం, డి.సురేష్‌బాబు, కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, సుద్దాల అశోక్‌తేజ, పరుచూరి గోపాలకృష్ణ, ఉత్తేజ్ తదితరులు సందర్శించి పూలతో నివాళులర్పించారు.

ప్రముఖుల సంతాపం…
సి.నారాయణరెడ్డి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖుల తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. చిరంజీవి మాట్లాడుతూ “సి.నారాయణరెడ్డి మృతి వ్యక్తిగతంగా నాకు, తెలుగు సాహితీ, సినీ లోకానికి తీరని లోటు. జీవితకాలమంతా సినారె దర్పంగా ఉంటూ… మంచి జీవితాన్ని గడిపారు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతిచెందారనే వార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా”అని అన్నారు. సినారె మృతి పట్ల నందమూరి బాలకృష్ణ దిగ్భాంతి వ్యక్తంచేశారు. పోర్చుగల్‌లో ఉన్న ఆయన సి.నారాయణరెడ్డి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ “సినారె మృతి సాహితీ లోకానికే కాదు… యావత్ తెలుగు జాతికి తీరని లోటు. నారాయణరెడ్డితో మా కుటుంబానికి ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేను. ఆయన తెలుగుజాతి గర్వించదగిన ధృవతార”అని చెప్పారు. పవన్‌కళ్యాన్ మాట్లాడుతూ “తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి మరణం తెలుగుజాతికే కాకుండా యావత్ సాహితీ లోకానికి తీరని లోటు. తెలుగు సినిమా పాటను కావ్య స్థాయికి తీసుకెళ్లిన ఆ మహానుభావుని స్థానం భర్తీచేయలేనిది. ఆయన జీవితం గురించి సినీ పెద్దల ద్వారా, కొన్ని రచనల ద్వారా తెలుసుకున్నప్పుడు సి.నారాయణరెడ్డి సదా ఆదర్శప్రాయుడు అని భావించాను. విశ్వంభర రచన ద్వారా జ్ఞానపీఠ్ అవార్డు అందుకొని తెలుగు భాష కీర్తిని విశ్వవ్యాపితం చేశారు. పద్మశ్రీ, పద్మభూషణ్, కళా ప్రపూర్ణ వంటి అనేక పురస్కారాలు, రాజ్యాంగ పదవులు ఆయనలోని వినమ్రతను మరింత పెంచాయి. తండ్రి వ్యవసాయం చేస్తే… సినారె సాహితీ వ్యవసా యం చేసి తెలుగువారికి సాహిత్య ఫలాలను అందించారు. ఇంతటి సాహిత్య స్రష్ఠ మరణించారని తెలిసి తీవ్ర ఆవేదన చెందాను. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను”అని అన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ “సి.నారాయణరెడ్డి మా కుటుంబానికి ఎంతో సన్ని హితులుగా ఉండేవారు. సాహితీ లోకానికి ఆరాధ్యుడైన ఆయన మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు న్నా”అని తెలిపారు. టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ “సుప్రసిద్ధ కవి డా.సి.నారాయణరెడ్డి పరమపదించారన్న వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గుర య్యాను. తెలుగు సాహితీ వనంలో ఆయనో వట వృక్షం. నాకు గురుతు ల్యులు, స్ఫూర్తి ప్రదాత ఆయన. సినారెగా ప్రసిద్ధులైన ఆయన మరణం సినీ, రాజకీయ, సాహితీ రంగాలకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”అని చెప్పారు. ప్రముఖ సాహితీ వేత్త, సుప్రసిద్ధ సినీ పాటల రచయిత సి.నారాయణరెడ్డి మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని ఎపి హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి జలకం సంపత్‌కుమార్, ఎపి ఎస్సీ, ఎస్టీ, బిసి అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యదర్శి జలకం సత్యారామ్‌లు తీవ్ర సంతాపాన్ని వ్యక్తంచేశారు. తన ఉత్తమ రచనలతో సాహితీ ప్రియులను, మధురమైన పాటలతో సంగీత ప్రియులను మైమరపించిన గొప్ప సాహితీవేత్త సినారే అని వారు పేర్కొన్నారు.