Home తాజా వార్తలు బ్రెజిల్ సాకర్ జట్టుపై దాడి

బ్రెజిల్ సాకర్ జట్టుపై దాడి

sp
రియో డి జనెరియా: రష్యా వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్ దశలోనే ఇంటిదారి పట్టిన బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుకు స్వదేశంలో ఘోర అవమానం జరిగింది. భారీ ఆశలతో బరిలోకి దిగిన ఐదు సార్ల విజేత బ్రెజిల్ కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టడాన్ని బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్రేమీకులు జీర్చించుకోలేక పోతున్నారు. బెల్జియంతో జరిగిన పోరులో గెలిచే స్థితిలో ఉండి కూడా మ్యాచ్‌ను చేజార్చుకోవడాన్ని అభిమానులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కాగా, రష్యా నుంచి బ్రెజిల్ జట్టు స్వదేశం చేరుకుంది. రి యో డిజనెరియో విమానాశ్రయం నుంచి బస్సులో ఆటగాళ్లు తమతమ ఇళ్లకు బయలే దేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న బస్సుపై అభిమానులు రాళ్లు రువ్వారు. అంతేగాక ఆటగాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే క్రమంలో బస్సు లోపలికి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించారు. గుడ్లు, టమాటాలు, రాళ్లతో ఆటగాళ్లకు స్వాగతం పలికారు. కాగా, ఆగ్రహంతో ఊగిపోయిన అభిమానులు బస్సును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. కాగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే అభిమానుల ఆగ్రహం హద్దులు దాటడంతో పోలీసులు గాలిలో కాల్పులు జరపాల్సి వచ్చింది. అర్జెంటీనా, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్ వంటి అగ్రశ్రేణి జట్లు ప్రారంభంలోనే ఇంటిదారి పట్టడంతో బ్రెజిల్ కచ్చితంగా టైటిల్ సాధిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. అయితే బ్రెజిల్ మాత్రం పేలవమైన ఆటతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. దీన్ని తట్టుకోలేక అభిమానులు ఫుట్‌బాల్ ఆటగాళ్లపై తిరగబడ్డారు.