Home ఆఫ్ బీట్ ఎవసాయదారునికి ఎద్దుకు ఆత్మీయ సంబంధం

ఎవసాయదారునికి ఎద్దుకు ఆత్మీయ సంబంధం

Farmer

ఎద్దుకు ఎవుసం చేసేటోల్లకు మాంచి కుటుంబసంబంధం ఉంటది. ఎద్దుల పట్ల రైతులు మస్తు ప్రేమగ ఉంటరు. ఎద్దుకు యాల్లకు మ్యాత ఏసుడు నీళ్ళపెట్టుడు పచ్చిగడ్డి మేపుడు పెయ్యి కడుగుడు ఇవన్నీ ఉంటయి. ఒక్క ఎద్దు ఏంది అన్ని పసురాలకు ఇంటి బిడ్డల్లెక్కనే ఎవుసాయదారుడు సూస్తడు. అట్లనే సాదుకుంటడు. దానికేమైన నొప్పి అయినా ఈయన తల్లడిస్తడు. ఆఖరుకు కర్మగాలి అమ్మవలసి వస్తే అంగట్ల దుక్కపడుతడు. ఎడ్లకు రైతుకు మధ్య ఒక భాష సుత ఉంటది. ఈయన మాట్లాడుతే అవి ఇంటయి. అట్లనే మెదలుతయి. ఎన్కటిరోజుల్ల మోట కొట్టినప్పుడు ఎడ్లు బండికట్టినప్పుడు ‘హడె’ అంటే ఎడ్లు ముందుకు పోతయి ‘శెరి’ అంటే ఎనుకకు వస్తయి ‘ఝ’ అంటే మూలమలుగుతయి. హడె హడె అని తోక మీద చెయ్యి వేసి జర మెలివస్తే ఉరుకతయి. ‘చ్చొ’ ‘చ్చొ’ అంటే ఆగుతయి. నీళ్ళ కాడికి తీసికపోయేందుకు ఒక ధ్వని చేయాలె అది అక్షరాల్లో చెప్పరాదు.
ఎడ్లను నాగలికట్టేటప్పుడు వలుపట దాపట వైపుల కడుతరు.

వలుపట అంటే ఎడమవైపు దాపట అంటె కుడివైపు కట్టేది దాపటెద్దు అంటే జర బలమైన దాన్ని నాగలికైనా బండికైనా కట్టుతరు. దాపటిది జర తెలివికల్లది ఉంటది, బలంగ ఉంటది. వలుపట ఎద్దు జర నాశి ఉంటది. వలుపట దాపట జోడి ఎడ్లు ఉంటయి. జంట ఎడ్లు ఎప్పటికి కల్సే కట్టుదరు వలుపటి అలవాటైనదాన్ని దాపట కట్టుతె గుంజది మల్కేస్తది.
ఎడ్లకు శాతకానప్పుడు మల్కేస్తయి పంటయి అయితె ఎవసయాదారుడు ఎప్పటికప్పుడు ఎడ్ల విషయంలో గమనింపుతోనే ఉంటడు. ఎద్దు తన యజమానిని గుర్తిస్తది. మ్యాత ఏసే యల్లకు పన్న ఎద్దు లేచి నిలబడుతది. నీళ్ళకు తొట్టికాడికి తీసికపోయేటప్పుడు లేచి నిలబడి వస్తది.
ఎద్దు సంకేతాలు రైతుకు తెలుసు రైతు అవసరాలు తెల్సు అన్నట్టు ఇద్దరు మెదులుతారు. ఎడ్లను పనికి మెదపడంలోనే రైతు పనితనం ఉంటది. బండి కాని లావట్టంగనే ఎద్దే సట్కున వచ్చి మెడ ఆనిస్తది. నాగలి దున్నుతది. నిలబెడుతె నిలబడుతది. వడ్లు ఇంట్లకు కొట్టకపోయేటప్పుటు బండికట్టి రైతు బండి మీద నిద్రపోయినా అదే ఇంటికి తీసికపోతది.

ఎన్కట జాతరలకు పోయిగా పెండ్లిల్లకు పోయినా పక్కన సుట్టాల ఊరికిపోయినా ఎడ్లబండినే వాడేవారు బండ్లల్ల రెండురకాలు కచ్రం అంటరు. సవారు కచ్రం అని కొన్నిటిని అంటరు కచ్రం మీద మేదరివాల్లు చేసిన తడుక కప్పు ఉంటది. అది మంచి చెక్కనంతోని చేసి ఉంటది ఆ కచ్రాలు ఊల్లల్ల ఉన్నొల్లకే ఉండేటియి. బర్రె, ఎద్దు, ఆవు, ల్యాగ దున్నపోతు కోడె ఇవన్న ఎవసాయదారుని చేతిల చెప్పినట్టు ఇంటయి. వీటి తోనే రైతుకు మనుగడ. వీటన్నిటిని రైతు మంచిగా అరుసుకుంటడు. ఎడ్లు దున్నుతయి కాబట్టి బలంగల్ల తిండి కావాలె అట్లనే ఆవులకు బర్లకు కూడా మస్తు పచ్చి గర్క పోసలు పెడుతారు. రాత్రిపూట తేడా శెల్కపిండి పెడుతరు. పొద్దుందాక పచ్చిగడ్డి మేపడానికి కంచెలల్లకు తీసికపోతరు. ఒక ఎవుసం చేసేటాయనకే గాకుండా ఆ ఇంటి సభ్యులందరితో ఆ పసురాలకు సంబంధం ఉంటది. ఒక్క వాటితోనే కాదు ఊర్ల ఇండ్లడ్ల మనుషులకు పిల్లలు, కుక్కలు, కోళ్ళతో కూడా అవినాభావ సంబంధం ఉంటది అన్నా కల్సి కుటుంబం లెక్కనే కలెగల్సి జీవిస్తారు.

Annavaram-Devendarఅన్నవరం దేవేందర్,
సెల్ :9440763479