Home తాజా వార్తలు సఫల రాష్ట్రం

సఫల రాష్ట్రం

Farmer relationship are the first time in the country

ఇదో చారిత్రక విజయయాత్ర
సంకల్పం గట్టిదయితే సాధించలేనిది లేదని కెసిఆర్ ప్రభుత్వం నిరూపిస్తోంది
ప్రధాని నిండు పార్లమెంట్‌లో మెచ్చుకోవడమే సిఎం పాలన దక్షతకు నిదర్శనం
రైతుబంధు దేశంలోనే తొలిసారి
అన్నదాతను రాజుగా చేయాలన్నదే లక్షం
నేతన్నలకు బాసటగా నిలవాలి
ప్రజలందరూ చేనేత దుస్తులు ధరించాలి
సిరిసిల్లలో జెండా ఆవిష్కరణ వేదిక నుంచి మంత్రి కెటి రామారావు 

మన తెలంగాణ / సిరిసిల్ల : యావత్ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతమైన నమూనాగా నిలిచిందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎగుర వేసి అనంతరం మాట్లాడారు. శాంతియుత పంథాలో సుదీర్ఘకాలం పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సఫల రాష్ట్రంగా స్థిరపడిందన్నారు. ప్రగతిదారుల వెంట తెలంగాణ వేగంగా ప్రయాణిస్తోందని, ఇదో చారిత్రిక విజయయాత్ర అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అత్యంత పరిణతితో వ్యవహరిస్తున్నారని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిండు పార్లమెంట్ వేదికగా ప్రస్తావించడం మన ముఖ్యమంత్రి పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. అయితే రాష్ట్ర పురోగమనాన్ని అడ్డుకోవాలనే ప్రతిఘాతక శక్తుల ప్రయత్నాలు ఆనాడు పోరాటంలో ఎదురయ్యాయని, ఈనాడు పరిపాలనలోనూ ఎదురవుతున్నాయన్నారు.

సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలనైనా అధిగమించవచ్చని కెసిఆర్ ప్రభుత్వం రుజువు చేసిందన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ద్విగిణీకృతోత్సాహంతో ముందుకు సాగుతామని, బంగారు తెలంగాణ లక్షాన్ని ముద్దాడుతామని అన్నారు. యావద్భారతానికి తెలంగాణను, రాజన్న సిరిసిల్ల జిల్లాను దిక్సూచిగా నిలుపుతామని మంత్రి ప్రకటించారు. అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచి వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతును రాజుగా చేయాలని దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి వర్షాకాలం, యాసంగి పంటలకు ఏటా రూ. 8 వేలు పెట్టుబడిగా ఇచ్చేందుకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారన్నారు. రైతులందరికీ రూ.లు 5 లక్షల ఉచిత బీమా సదుపాయం కల్పించామన్నారు. రూ.లు వెయ్యి కోట్లు వెచ్చించి కొత్తగా మరిన్ని గోదాములు నిర్మిస్తామన్నారు. బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగ వంతం చేశామన్నారు. జిల్లాల పునర్విభజన వల్ల పరిపాలన ప్రజలకు చేరువైందన్నారు. మిషన్ భగీరథ ద్వారా దీపావళి నాటికి ఇంటింటికి నీరంది స్తామన్నారు.

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిఎస్ ఐ పాస్ పాలసీతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పెద్దసంఖ్యలో తెలంగాణకు వస్తున్నారన్నారు. హరితహరం, పిడిఎస్ బియ్యం, స్వయం ఉపాధి పథకాలు, విద్యా, వైద్య రంగంలో చేస్తున్న కృషిని మంత్రి వివరించారు. కంటి వెలుగు పథకంలో భాగంగా ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు. రోడ్లు, మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు.కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నామన్నారు. స్వచ్ఛత, మరగుదొడ్ల నిర్మాణంలో సిరిసిల్ల జిల్లాకు దేశవ్యాప్త ఖ్యాతి రావడం మనందరికి దక్కిన గౌరవమన్నారు.

నేతన్నలకు బాసటగా నిలిచేందుకు ప్రతి సోమవారం ప్రభుత్వ అధికారులు చేనేత దుస్తులు ధరిస్తున్నారని, ప్రజలందరు కూడా చేనేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, విద్యార్థులు నృత్యాలు ప్రదర్శించారు. వృత్తి పరంగా ప్రతిభ చూపిన పలువురికి మంత్రి కెటిఆర్ ప్రశంసా పత్రాలు అందించారు. లబ్దిదారులకు దాదాపు రూ. 5.20 కోట్ల ఆస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ శాసన సభ్యులు చెన్నమనేని రమేశ్‌రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్‌పి రాహుల్‌హెగ్డె, జేసి యాస్మిన్ భాష, డిఆర్‌ఓ శ్యాంప్రసాద్‌లాల్ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.