Home ఎడిటోరియల్ రైతాంగాన్ని గట్టెక్కించేది సాంప్రదాయ సాగే..

రైతాంగాన్ని గట్టెక్కించేది సాంప్రదాయ సాగే..

ఒకే జిల్లాలో వ్యవసాయంలో రెండు ముఖాలు : ఒకటి ఖేదం, ఒకటి మోదం

Farmerఒక గ్రామంలో ముప్పైమూడుమంది చనిపోయారు. చనిపోయిన వారంతా రైతు కుటుం బాలకు చెందినవారే. అగ్ని ప్రమాదంలోనో, రోడ్డు ప్రమాదంలోనో చనిపోయారనుకుంటే పొర బడ్డటే.్ల చనిపోయిన వారంతా వ్యవసాయం చేసి నష్టపోయి, ఆదుకునేవారు కానరాక ఆత్మహత్యలు చేసుకున్న వారే. గ్రామంలోకి వెళ్ళి పరిశీలిస్తే ఒక్కో కుటుంబాని ది ఒక్కో విషాద గాథ. ఈ విషాదమంతా మెదక్ జిల్లాలోని ‘ఎల్‌కల్’ గ్రామానిది. ఇప్పుడు ఆ గ్రామంలో మృత్యుఘోష వినపడుతోంది.
బయటనుండి చూసేవారికి వారి సమస్య చిన్నదిగానే కన్పిస్తుంది. కానీ వారికది జీవితంపై ఆశను చంపేసే కష్టమే. భూమిని నమ్ముకుని బతికే వారికి ఇప్పుడు పుట్టెడు కష్టాలు వెంటాడుతున్నా యి. వ్యవసాయ రంగాన్ని దశాబ్దాలుగా నిర్లక్షం చేస్తూ పాలకులు చేసిన పాపం ఇప్పుడు రైతులకు శాపమైంది.
వ్యవసాయరంగం ఇంతగా సంక్షోభంలో పడటానికి కారణాలను కనుగొని, చెప్పే మేధావుల సూచనల్ని పాలకులు పట్టించుకునే పరిస్థితి కన్పిం చడం లేదు. “ఎల్‌కల్‌” గ్రామ రైతాంగ విషాదం నుండి ఒక మంచి ఆలోచన చేసే పరిస్థితి, తెలంగాణా రైతాంగానికి సరైన మార్గాన్ని చూపే యోచన ప్రభుత్వం నుంచి రావడం లేదు.
రాష్ట్రంలో 80శాతంపైగా సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టులు లేవన్న విషయం తెలిసిందే. బోర్లపైన, వర్షాధార పంటల పైనే ఆధారపడి సేద్యం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏమి సాగు చేయాలి ఎలా సాగుచేయాలి అన్న విషయం మొదలు అన్ని విషయాల్ని రైతులే చూసు కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం,అధికార యంత్రాంగం ఏదో చేస్తున్నట్లు ప్రచార ఆర్భాటం మాత్రం కన్పిస్తోంది.
‘ఎల్‌కల్’ గ్రామంలో ముప్పైమూడు కుటుంబా లను కలసి వారితో ముచ్చటించినప్పుడు ఆ బాధిత కుటుంబాలు కన్నీళ్ళ పర్యంతమవుతూ చెప్పిన విషయాలు నేడు తెలంగాణలో రైతాంగ కుటుంబా లకు నిలువటద్దంలా నిలుస్తాయి.
సాక్షాత్తు రాష్ట్రముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నియోజకవర్గం గజ్వేల్‌ను ఆనుకుని “ఎల్‌కల్‌” గ్రామం ఉంది. గ్రామంలో ఒక్కొక్కరు పిట్టల్లా రాలిపోతున్నా, సమస్య తీవ్రరూపం దాల్చినా సమస్య మూలాల్లోకి వెళ్లి పరిశీలించాల్సిన ధ్యాస ఏ ఒక్కరిలో కన్పించడం లేదు.
వ్యవసాయం చేసి బతికి బట్టకట్టలేమన్న భయం ఇప్పుడు ఆ గ్రామాన్ని ఆవరించింది. “ఎల్‌కల్‌” గ్రామాన్ని సందర్శించిన పది రోజులకు మెదక్‌జిల్లా లోనే మరికొన్ని గ్రామాల్ని, ఆ గ్రామంలో రైతులు చేస్తున్న వ్యవసాయ రీతుల్ని చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని రాయి కోడ్, నాగ్వార్, పస్థాపూర్; హోసెల్లి లాంటి 70 గ్రామాల్లో సాంప్రదాయ పంటలసాగు విస్తారంగా కొనసాగుతోంది. నిలువెల్లా ఆత్మవిశ్వాసం నింపు కున్న రైతు బిడ్డలు ఇక్కడ కన్పించారు. తీవ్ర నైరాశ్యం తో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగా నికి స్ఫూర్తిని నింపే సాంప్రదాయ వ్యవసాయం ఇక్కడి గ్రామాల్లో కొనసాగుతోంది. ఈ రైతులకు వ్యవ సాయం అంటే పండుగ, ఒక వేడుక. సేద్యంచేసి అప్పుల పాలయ్యామనే వేదనలు ఇక్కడ కన్పించవు. ఒకే జిల్లాలో వ్యవసాయంలో ఉన్న వైవిధ్యాన్ని గమనించినప్పుడు, ఒక ప్రాంతంలో జీవనస్ఫూర్తి కన్పిస్తుంటే, మరో ప్రాంతంలో మృత్యుఘోష విన్పించింది. తెలంగాణలో సాగునీటి వనరులు అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో రైతాంగాన్ని ఎలాంటి పంటల సాగువైపు ప్రోత్సహించాలన్న విధానాలు నేటికీ లేవు. పైగా సాగునీటిపై ఆధార పడిన పంటలను ప్రోత్సహిస్తూ రైతును మృత్యుబడి లోకి నెట్టే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
వరి, గోధుమ, పత్తి, సోయా, మొక్కజొన్న సాగుకు మాత్రమే ప్రోత్సాహకాలను ఇస్తున్నారు. గోధుమలు, వరి ఆహార భద్రతను మాత్రమే కల్పించ గలుగుతాయి. కానీ జొన్నలు ఇతర చిరుధాన్యాల ఆహారం వల్ల ఆరోగ్యం, పోషక విలువలు, ఉపాధి, పర్యావరణ ప్రయోజనాలు పుష్కలంగా లభిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యవసాయ భద్రత లభిస్తుంది.
1996-2006 మధ్య అమలు చేసిన హరిత విప్లవం (గ్రీన్ రివల్యూషన్) కారణంగా అంతవరకు చిరుధాన్యాల సాగు చేస్తున్న విస్తీర్ణంలో దాదాపుగా సగం పొలాల్లో ఇతర పంటల వైపుకు రైతాంగం వెళ్లిపోయింది.
చిరుధాన్యాలను కేవలం ప్రత్యామ్నాయ పంటలు గానే చూడటం జరుగుతోంది. కానీ చిరు ధాన్యాల వ్యవసాయం కేవలం ఒక పంట మాత్రమే కాదు. జీవన వైవిధ్యానికి, వాతావరణ సమతుల్య తకు రైతాంగం యొక్క సార్వభౌమత్వానికి ఎంత గానో దోహదపడుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దక్షిణభారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రజలు వేల సంవత్సరాలుగా సాగుచేసిన అనేక పంటలు నేడు కనుమరుగైపోయాయి. ఇప్పుడు అంతా పత్తి, సోయా లాంటి వాణిజ్య పంటల మోజులోపడి కొట్టుమిట్టాడుతున్నారు. 2002మార్చిలో భారతదేశంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ కు చెందిన బయోటెక్నాలజీ విభాగం కిందున్న జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ (జి.ఇ.ఎ.సి.) నుండి మహికో-మోనాశాంటో అనే సంయుక్త కంపెనీకి అనుమతి నివ్వడంతో రైతాంగం బహుళజాతి విత్తన సంస్థల ఉచ్చులో ఇరుక్కున్నట్లయ్యింది.
కానీ జహీరాబాద్ ప్రాంత రైతాంగం బహుళ జాతి విత్తన సంస్థల మాయాజాలంలో ఇరుక్కోక పోవడాన్ని గమనించడం జరిగింది. సమాజమంతా మరచిపోయిన చిరుధాన్యాలను ఇక్కడ చూడొచ్చు. 70రకాల చిరుధాన్యాలను ఇక్కడి రైతాంగం సంరక్షిస్తోంది. ఎకరం పొలంలో ఇరవై రకాల పంటల్ని వేసి ఏడాది పొడవునా పంటల్ని తీస్తూ ఆదాయాన్ని గడిస్తోంది.
చిరుధాన్యాల సాగుకు చాలా తక్కువ నీటి వనరు సరిపోతుంది. చెరకు, పత్తి, అరటి, సోయా, వరితో పోలిస్తే జొన్న, కొర్ర, సామలు, సజ్జలకు కేవలం 25శాతం వర్షాధార నీటి సదుపాయం చాలు. ఇక్రిశాట్ లాంటి ప్రతిష్టాత్మక మెట్టపంటల సాగు పరిశోధనా కేంద్రం తెలంగాణా ప్రాంతంలో ఉండి ప్రపంచం మొత్తానికి సూచనల్ని ఇస్తోంది. కానీ తెలంగాణా రైతాంగానికి దీని సేవల్ని ఉపయో గించుకునేలా చేయడంలో ఇప్పటివరకూ ప్రభుత్వా లు విఫలమవుతూ వచ్చాయి. కేవలం వాణిజ్య పంటల సాగువైపే రైతాంగం మొగ్గుచూపేలా ప్రభుత్వ విధానాలు ఉండటం, విత్తన కంపెనీల మాయాజాలంలో రైతాంగం పడిపోవడంతో మొత్తం వ్యవసాయ రంగమే తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది.
వాతావరణ ప్రభావాన్ని తట్టుకునే శక్తి చిరుధాన్యాలకు ఉంటుంది. ఏడాది పొడవునా ఎలాంటి కాల పరిమితి లేకుండా సాగు చేసుకోవ చ్చు. ఒకే జిల్లాలో రెండు పార్శాలను గమనించడం జరిగింది. వాణిజ్యపంటల్ని సాగుచేస్తూ, బహుళ జాతి విత్తన సంస్థల వలలో పడిన రైతాంగం లో ఆత్మహత్యల పర్వం కొనసాగుతోంది.
మరోవైపు సాంప్రదాయ చిరుధాన్యాల సాగును నమ్ముకున్న రైతాంగం ఆనందంతో గడుపుతోంది. వ్యవసాయరంగ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి సింగపూర్, మలేషియా, జపాన్‌లు పోయి కొత్తగా విషయాన్ని కనుగొని రావాల్సిన అవసరం లేదు. కరువు తాండవిస్తున్న తెలంగాణ జిల్లాల్లో చిరు ధాన్యాల సాగు మాత్రమే అనువైనదని పస్థాపూర్ నిరూపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం చిరుధాన్యాల సాగువైపుకు రైతాంగాన్ని మరల్చేలా విధానాల రూపకల్పన చెయ్యాలి. ఇవి ప్రత్యామ్నాయ పంటలు కావు, ఇవే అసలైన పంటలుగా గుర్తించాలి. చిరుధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగం చెయ్యాలి. అందుకోసం సేకరణలోనూ, నిల్వ చేయడం లోనూ ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందాలి.
పేద పిల్లలకు ఆహారాన్ని అందించే ఐసిడిఎస్ మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ హాస్టళ్ళకు సమృద్ధిగా చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా అందించాలి. దీంతో తిరిగి సాంప్రదాయ పంటల సాగు విస్తీర్ణం పెరిగి రైతాంగంలో మునుపటి వెలుగులు కన్పించే అవకాశం ఉంది. నేటి ఆధునిక జీవనశైలికి అనువైన ఆహారధాన్యాలు వాస్తవంగా ఇవేకదా!
రచయితః సీనియర్ జర్నలిస్టు,
8096193960