Home జయశంకర్ భూపాలపల్లి రైతు ఆత్మహత్యలు ప్రభుత్వానికి కానరావా.!

రైతు ఆత్మహత్యలు ప్రభుత్వానికి కానరావా.!

cong

*మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి

మన తెలంగాణ/మొగుళ్ళపల్లి: తెలంగాణ రాష్ట్రంలో రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యల పాలవుతున్నా… సజీవ దహ నం చేసుకున్నా… తెలంగాణ ప్రభుత్వానికి చలనం లే కుండా పోయిందని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో కలిసి కాంగ్రెస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంత రం కార్యకర్తల సమావేశంలో రమణారెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో వరంగల్ జరిగిన సభలో సినీ హీరో పవన్ కళ్యాణ్ కెసిఆర్‌ను కించపరిచే విధంగా మాట్లాడితే తిరిగి కెసిఆర్ ఆ వ్యక్తిపై ఒక చిటికేస్తే వెయ్యి తునుకలవుతావు బిడ్డా..! అంటూ నన్ను రోజుకు కుక్కలు తిడుతాయంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడిన కెసిఆర్ నాడు ఆ సినీ హీరోని ఈ రోజు ముద్దాడుతున్నాడని తెలంగాణకు వ్యతిరేకంగా నాడు మారిన వ్యక్తులను నేడు చేరదీస్తూ ముద్దు లొలుకబోయడం ఓట్ల కోసమేనని విమర్శించారు. కెసిఆర్‌కు నీతి, నిజాయితీ, నిబద్ధత లేదని నాడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని దేవత అని నేడు విమర్శించడం రాజకీయ పబ్బం గడుపుకోవడమేనని గండ్ర మండిపడ్డారు. ఆంధ్రా వాళ్ళు జాగో బాగో అంటూ మాట్లాడిన కెసిఆర్ నేడు వాళ్ళకు ముళ్ళు కుచ్చితే పండ్లతో పీకేలా తయారయ్యాడని దుయ్యబట్టారు.

తెలంగాణ ప్రజలకు సిఎం వైఖరి అర్థమవుతుందని రాష్ట్రంలో పౌర హక్కులకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఉద్యమం చేస్తున్న మంద కృష్ణ మాదిగను అక్రమంగా అరెస్టు చేసి జైళ్ళో పెట్టాడని, పండించిన పంటలకు గిట్టు బాటు ధర అడిగిన అన్నదాత చేతులకు సంకెళ్ళు వేసిన ఘనత కెసిఆర్‌కే దక్కిందని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న సిఎం కెసిఆర్‌కు తెలంగాణ ప్రజలు శాశ్వతంగా ఘోరి కడతారని స్పష్టం చేశారు. తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడానికి కెసిఆర్ కుయోక్తులు పన్నుతున్నారని ప్రజలు తిప్పికొట్టే సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. రైతులకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పంటలకు నిరంతర విద్యుత్తు 9 గంటలు అందించాలని కొన్నేళ్ళుగా అడుగుతున్నా పట్టించుకోలేదని నాడు అవసరం లేని 24 గంటల కరెంటును ఇస్తున్నానని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్ చేపడుతున్న పల్లె ప్రగతి నిద్రతో సమస్యలు పరిష్కారం కావని సమస్యలున్న గ్రామాలను గుర్తించి పరిష్కారానికి మార్గాలు చూపేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ ప్రజలు నాడు ఎన్‌టిఆర్‌నే తుక్కు తుక్కుగా ఓడించారని అదే కోవకు చెందిన కెసిఆర్‌కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా శ్రేణులు సైనికుల్లా పని చేయాలని రమణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోలినేని రాజేశ్వర్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యార మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శులు సంపెల్లి నర్సింహరావు, జోరుకు సదయ్య, మాజీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు మలహల్‌రావు, మహేందర్, శ్యాంసుందర్‌రెడ్డి, తిరుపతి, రాజిరెడ్డి, విప్లవరెడ్డి, ముడుపు రవీందర్, మోటె ధర్మారావు, మొట్లపల్లి సర్పంచ్ బాలరాజు పాల్గొన్నారు.