Home రాష్ట్ర వార్తలు సాగులో చావు సవ్వడి 

సాగులో చావు సవ్వడి 

FARMERఎనిమిది మంది ఆత్మహత్య

మనతెలంగాణ న్యూస్ నెట్‌వర్క్ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ జిల్లాలలో ఆదివారం ఎనిమిది మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు, ఖమ్మం, మెదక్ జిల్లాల వాసులు ఇద్దరిద్దరు, మహబూబ్‌నగర్ రైతొకరు ఉన్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం పుల్లాయిగూడెం వాసి నేరుడు మాధవరావు (39) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి విత్తనాలు చల్లి, ఆ పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించక, అప్పులు పెరిగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈయనకు వృద్ధ తల్లిదండ్రులతో పాటు భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. ఇదే జిల్లాలోని కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన కౌలు రైతు చెరుకూరి బాబూరావు (45)పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నాలు గెకరాలు కౌలుకు తీసుకుని వరి నాట్లు వేయగా, అది పూర్తిగా ఎండిపోయి, అప్పులు తీరే దారి లేక బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఈయనకు భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. నల్లగొండ జిల్లా గుర్రంపూడ్ మండల కేంద్రానికి చెందిన ఇటికాల యాదయ్య (40)ఉరేసుకుని తనువు చాలించారు. తనకున్న మూడెకరాలతో పాటు రెండెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుండగా నష్టపోయారు. అప్పులు తీరుతాయన్న నమ్మకం లేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమారైలు ఉన్నారు. ఇదే జిల్లా వేములపల్లి మండలం బుగ్గబాయిగూడెం వాసి అనిరెడ్డి హనుమారెడ్డి (62)పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోయి, అవి తీరే దారి లేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయనకు కు మారుడు ఉన్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యల గూడెం గ్రామ రైతు పెండ్యాల లక్ష్మయ్య (50)పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పత్తి పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించక, చేసిన అప్పులు తీరుతాయన్న నమ్మకం కలుగక బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా చిన శంకర్‌పేట మండలం దర్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్ధిరాములు కరెంట్ తీగలను చేతుల్తో పట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

అప్పు చేసి పొలంలో తవ్విన బోరుబావుల్లో నీళ్లు లేకపోవడం, వ్యవసాయంలో తీవ్ర నష్టం రావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన అన్న ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో తల్లిదండ్రులు మల్లయ్య, లక్ష్మీలు కన్నీరుమున్నీరవుతున్నారు. మెదక్ మండలంలోని నాగాపురం గ్రామ రైతు నల్ల పోచయ్య (65)శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. పొలంలో బోరు బావులు తవ్వేందుకు చేసిన అప్పులు తీరే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం పుల్జల గ్రామానికి చెందిన యువ రైతు పి.ఆనంద్ (28)ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తనకు ఉన్న ఆరు ఎకరాలలో వేసిన పత్తి పంట చేతికొచ్చే, చేసిన అప్పులు తీరే దారి కనిపించక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు.