వరి సహా ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లుగా కేంద్ర మంత్రివర్గం త్వరలో ఆమోదిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం చెరకు రైతుల బృందానికి హామీయిచ్చారు. ఎంఎస్పి రేట్లు ప్రకటించకపోవటంపట్ల రైతు సంఘాలు ఆందోళన చేస్తున్న పూర్వరంగంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు. సాధారణంగా ఖరీఫ్ పంటలకు ఎంఎస్పిని వర్షాకాల ఆరంభంలో జూన్‌లో ప్రకటిస్తారు. పంటలను ఎంచుకునేందుకు రైతులకు అవి సూచనగా పని చేస్తాయి. ఎంఎస్పి పెంపుదలను వచ్చే వారంలో ప్రకటిస్తామని పిఎంఒ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎంఎస్పి ప్రకటించటం ఒక ఎత్తు అయితే దాన్ని అమలుజరపటం అంటే రైతుకు ప్రకటిత ధర అందేటట్లు చేయటం అసలు సమస్య. వ్యాపారులు సిండికేట్ అయి ఏదోక వంకతో రేటు దిగగొట్టటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో మార్కెట్లో జోక్యం చేసుకోకపోవటం వల్ల రైతులు నష్టపోవటం నడుస్తున్న చరిత్ర. పెట్టుబడి వ్యయం పెరుగుదల, రుణ భారం, ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ శక్తుల మాయాజాలంతో ఉత్పత్తులకు సరైన ధర లభించకపోవటం వగైరా కారణాలతో వ్యవసాయం తీవ్రమైన దుస్థితి ఎదుర్కొంటున్నది. దశాబ్దాలుగా ఈ బాధామయ పరిస్థితులు కొనసాగుతున్నందున లక్షల కొలది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఎంఎస్పి పెంపుదల, అమలు సమస్య ప్రధానంగా ముందుకు వచ్చింది. యుపిఎ ప్రభుత్వ కాలంలో డాక్టర్ స్వామినాథన్ ఛైర్మన్‌గా నియమించిన ‘జాతీయ రైతు కమిషన్’ నివేదిక సిఫారసు చేసినట్లు వ్యవసాయ ఉత్పత్తి వ్యయంపై 150 శాతం ఎంఎస్పి అమలు చేస్తామని బిజెపి 2014 ఎన్నికల ప్రణాళికలో హామీయిచ్చింది. నాలుగేళ్ల తర్వాత దానిపై ఎక్సర్సైజ్ చేస్తోంది.
ఉత్పత్తి వ్యయం లెక్కగట్టటం అన్నదే ప్రధాన సమస్య. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్లు ఇతర ఖర్చులతోపాటు భూమి కౌలు విలువ, కుటుంబ సభ్యుల శ్రమ విలువ, రవాణా ఖర్చులు, రుణాలపై వడ్డీ వగైరాలను పరిగణనలోకి తీసుకుంటారా? తీసుకుంటే ఎంఎస్పి ఎంత పెరుగుతుంది? సహజంగా ప్రభుత్వం ఏ పరిశీలన చేసినా మార్కెట్లో వినియోగ ధరలపై ఎంఎస్పి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. అలాగే ఎంఎస్పిని నిర్ణయించే వ్యవసాయ ధరల కమిషన్ చాలా మేరకు ఉత్పత్తి వ్యయాన్ని లెక్కలోకి తీసుకుని పరక, పాతిక పెంపు సిఫార్సు చేస్తుంటుంది. అందువల్ల 150 శాతం పెంపుదల అనేది రైతులకు నిజంగా మేలు చేస్తుందా లేక మాయాజాలంగా మిగులుతుందా వేచి చూదాం.
పెట్రోలు, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటా సగానికిపైగా ఉన్నందున వాటిని జిఎస్టి పరిధిలోకి తేవాలన్న డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం అపహాస్య వైఖరి చూస్తుంటే, వ్యవసాయోత్పత్తులకు ఎంఎస్పి పెంపుదలను కూడా ఒక ప్రహసనంగా అనుమానించాల్సి వస్తుంది. పెట్రోలు, డీజిల్‌ను జిఎస్‌టిలోకి తెస్తే అవి జిఎస్టి రేటు 28 శాతం శ్లాబులో ఉంటాయని, దానిపై రాష్ట్రాల పన్ను కొంత ఉంటుందని, ఏతావాతా రిటైల్ ధరలో పన్నుల వాటా ప్రస్తుత స్థాయిలోనే ఉంటుందని జిఎస్టి కౌన్సిల్ కన్వీనర్, బీహార్ ఉప ముఖ్యమంత్రి, సుశీల్ కుమార్ మోడీ తాజాగా చెప్పారు. రిటైల్ రేటు తగ్గుతుందనే భావనతోనే వినియోగదారులు ఆ ఇంధనాలను జిఎస్‌టిలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. రేటు తగ్గనప్పుడు ఏ రాయి అయితేనేం పళ్లూడగొట్టటానికి! అలాగే వ్యవసాయోత్పత్తుల ఎంఎప్పిని కూడా ఇప్పటి ఎంఎస్పిలోనే ఉత్పత్తి వ్యయం ఉందంటూ ఎప్పటిలాగే ద్రవ్యోల్బణం స్థాయికి కాస్త అటుఇటుగా, కొరత ఉన్న ఉత్పత్తులకు ప్రోత్సాహకరంగా మరికొంత అదనంగా నిర్ణయించే అవకాశం లేకపోలేదు.ఎంఎస్పి కచ్చితంగా రైతులకు అందేటట్లు చేయటానికి నీతి ఆయోగ్ మూడు ప్రత్యామ్నాయాలను రాష్ట్రాల ముందుంచినట్లు, వాటిపై అనేక రాష్ట్రాలు మినహాయింపులు వ్యక్తం చేసినట్లు చెప్పబడుతున్నది. ఆ ప్రత్యామ్నాయాలు : ఒకటి, పంటల సేకరణ, నిల్వ, విక్రయ బాధ్యతను రాష్ట్రాలు తీసుకోవటం, దీనికి కేంద్రం నుంచి పాక్షికంగా ఆర్థిక సహాయం లభిస్తుంది. రెండు, ఉత్పత్తుల సేకరణ బాధ్యతలేకుండా మార్కెట్ రేట్లకు ఎంఎస్‌పికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రైతులకు చెల్లించటం. మూడు, ఎంఎస్పి రేట్లకు ప్రైవేటు ఏజెన్సీలు, వ్యాపారులచే ధాన్య సేకరణ చేయించటం. రైతులకు ప్రకటిత ఎంఎస్పి అందించటమే లక్షమైనప్పుడు అందుకయ్యే ఆర్థిక భారాన్ని కేంద్రం పూర్తిగా భరిస్తే, బహుశా రాష్ట్రాలు ముందుకు రావచ్చు.