Home ఖమ్మం కామేపల్లి తహసీల్దార్‌పై తిరుగబడ్డ రైతులు

కామేపల్లి తహసీల్దార్‌పై తిరుగబడ్డ రైతులు

Farmers Attack On Khammam MRO Office

మన తెలంగాణ/ఖమ్మం : ఖమ్మం జిల్లాలో రెవెన్యూ శాఖ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజన రైతులు తహసీల్దార్ల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. సోమవారం ఖమ్మం జిల్లాలో కూసుమంచి, కామేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గిరిజన రైతులు రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగడంతో పాటు  కామేపల్లి మండలం పింజరమడుగు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, గిరిజన రైతు కేలోతు భాస్కర్‌నాయక్ కామేపల్లి తహసీల్దార్ టీ వేణుగోపాల్‌తో వాగ్వాదానికి దిగి అసభ్యకరమైన పదజాలంతో దాడికి దిగారు. ఈ దాడిలో తహసీల్దార్ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.  ఈ సంఘటనలో సుమారుగా రూ. 80 వేల విలువ చేసే ఆస్తికి నష్టం కలిగింది. బాధితునిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ వేణుగోపాల్, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఆంజనేయులు రైతుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా వుండగా కూసుమంచి మండలం లింగారం తండాకు చెందిన గిరిజన రైతు బాణోత్ రమేష్‌కు సంబంధించి పాస్‌బుక్‌లను స్థానిక తహసీల్దార్ ఇవ్వడం లేదనే మనస్థాపానికి గురై తండాకు చెందిన గిరిజన రైతు బాణోత్ రమేష్ వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. క్షతగాత్రుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి కాపాడారు.  పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో ఒకే రోజు ఇరువురు గిరిజన రైతులు తహసీల్దార్ల తీరును నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం చర్చనీయాంశమైంది. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎండగట్టాల్సిన జిల్లా ఉన్నతాధికారుల ఉదాసీనత కారణంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైన రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాల్సిన ఎంతైన ఉందిమరి.