Home కామారెడ్డి ముసురేసిన… కురియని జడివానలు

ముసురేసిన… కురియని జడివానలు

Farmers' eyes for rains

వర్షాల కోసం రైతుల చూపులు
పూర్తయిన నాట్లు 

మన తెలంగాణ / బాన్సువాడ : ఖరీప్ సాగుపై రైతుల్లో అపనమ్మకం ఏర్పడుతోంది. వర్షాకాలం ఆరంభంలో మురిపించిన వానలు రాను రాను తగ్గుముఖం పట్టడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వరి నాట్లను వేసుకున్న రైతులు జడివానల కోసం ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిరుజల్లులు, ముసురు తప్ప భారీ వర్షాలు కురియక పోవడంతో ముందు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయన్న దిగులు రైతులను పట్టుకుంది. రెండు రోజులుగా కామారెడ్డి జిల్లాలో ముసురేయడంతో జడి వానలు కురుస్తాయన్న ధీమా రైతుల్లో తొణికిసలాడుతోంది. వర్షాకాలం ఆరంభమై నెల రోజులు గడిచిపోయినప్పటికీ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాపాతం నమోదు కాలేక పోయింది. కొన్ని ప్రాంతాల్లో మినహా చాలా మండలాల్లో వానల జాడ కనిపించక పోవడంతో వరినాట్లు వేసుకున్న రైతులు గాబరా పడుతున్నారు. వర్షాభావంపై ఆధారపడి నాట్లు వేసుకున్న రైతులు మాత్రం ఖరీప్ సాగుపై- అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో 1.80 మి. మీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా డతెరిపి లేకుండా కురుస్తున్న చిరు జల్లులు రైతుల్లో మరోమారు ఆశలు రేకెత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో జడివానలు కురుస్తాయన్న భరోసా వారిలో కనిపిస్తోంది. ఇప్పటి వరకు దాదాపుగా అన్ని మండలాల్లో నాట్ల ప్రక్రియను రైతులు పూర్తి చేసుకున్నారు. కొన్ని చోట్లలో మాత్రమే వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో నాట్లు వేసేందుకు వెనుకాముందు అయ్యారు. బాన్సువాడ , జుక్కల్ నియోజక వర్గాల్లో చిరుజల్లు లు పడుతుండగా, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాల్లో వానలు అంతంత మాత్రంగానే పడుతున్నాయి. ఆకాశం మాత్రం మేఘావృతంతో కనిపిస్తున్నప్పటికీ జడివానలు లేక పోవడంతో ఆ ప్రాంత రైతులు దిగులు చెందుతున్నారు.

ఎడారులను తలపిస్తున్న ప్రాజెక్టులు
దండీగా వానలు కురియక పోవడంతో ప్రాజెక్టులు ఎడారులను తలపిస్తున్నాయి. నిండుకుండలా దర్శణమిచ్చే నిజాంసాగర్ డెడ్ స్టోరేజ్‌లో ఉండగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళ లేక వెలవెలపోతుంది. ఎగువ ప్రాంతాలలో కూడా భారీ, అతిభారీ వర్షాలు కురియక పోవడంతో దిగువన ఉన్న ప్రాజెక్టుల్లోకి అనుకున్న స్థాయిలో నీటి ప్రవాహం లేకుండా పోయింది. ఇటీవల బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఎస్సారెస్పీ లోకి స్వల్ప వరద నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంత రైతులకు కాసింత ఊరట కలిగింది.

జలకళలేని ఊరచెరువులు, కుంటలు
జిల్లాలో చెరువులు, కుంటలు జలసిరులు లేక ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో దండీగా వర్షాలు కురియక పోవడంతో చెరువుల్లో, కాలువల్లో నీటి జాడలు కనిపించకుండా పోయాయి. ఊర చెరువుల్లో నీరు లేక రైతులు ఆందోళనకు లోనవుతున్నారు. పంటలను చెరువులు, కాలువలైన కాపాడుతాయనుకుంటే అట్టి ఆశలు కూడా నీరుగారిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ సారి ఖరీప్ సాగు రైతాంగాన్ని ఆర్థికంగా పెంచతుందా…నిండా ముంచుతుందా అన్నదే సంశయంగా మారింది.