Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఎప్పుడు చూసినా ఖాళీ కుర్చీలే…!

Agriculture-Extension-Offic

27 గ్రామాలకు ఇద్దరే ఎఇఒలు
ఎఒ పోస్టు ఖాళీ… సెలవులో మరో ఇద్దరు ఎఇఒలు
రైతులకు అందని వ్యవసాయ సలహాలు

రాయికల్: గ్రామీణ రైతులకు అధునిక వ్యవసాయ పద్దతుల పట్ల ఆవగహన కల్పించాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారు. పంటలకు చీడ పీడలు సోకి కళ్ల ముందే పంట దెబ్బతింటుంటే సాయం చేసేవారు లేక అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. సాయం చేసే చేతల కోసం ఆందోళన చెందుతుంటే సలహాలు అందించాల్సిన సిబ్బంది అందుబాటులో లేక కర్శకులు కన్నీళ్లను దిగమింగుకుంటున్నారు. పూర్తి స్థాయిలో వ్యవసాయ సిబ్బంది భర్తీకి నోచుకోక రైతులు చాల ఇబ్బందులు పడుతున్నారు. మండల వ్యవసాయాధికారి పోస్టు భర్తీ కాకుండా నెలల తరబడి ఖాళీగానే ఉంది. రికార్డుల ప్రకారం నలుగురు ఎఇఓలు పని చేస్తున్నట్లు ఉన్నప్పటికి ఇందులో ఇరువురు సెలవుల్లో ఉండగా మరో ఇరువురు కొత్త వారే కావడంతో వ్యవసాయ సలహాలు రైతులకు అందడం లేదు.

అధికారుల కోసం రైతులు కార్యాలయానికి వెళ్లితే అక్కడ ఖాళీ కుర్చీలే దర్శనమిస్తుండటం ఇక్కడ సాధారణమైపోయింది. రాయికల్ మండల పరిధిలో 27 గ్రామాలుండగా ఇక్కడి ప్రజలు వ్యవసాయమే జీవన ఆధారంగా చేసుకొని జీవిస్తున్నారు. మేజార్టీ గ్రామాలు అటవీ గ్రామాలే కావడంతో గిరిజన రైతులకు సాంకేతిక పరిజ్ఞానం తక్కువ. వ్యవసాయధికారుల పని వీరికి ఎక్కువగా అవసరం. కాగ ఇక్కడి వ్యవసాయాధికారి కార్యాలయంలో ఎఓ పోస్టు ఖాళీగా ఉంది. నలుగురు ఎఇఓలు పని చేస్తున్నట్లు రికార్డుల్లో ఉన్నప్పటికి ఒకరు ప్రసూతి సెలవులో ఉన్నారు. మరొకరిని అధికారులు డిప్యూటేషన్‌పై జగిత్యాలకు పంపగా సదరు ఎఇఓ సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. మరో ఇద్దరిని ప్రభుత్వం ఇటీవల రాయికల్‌లో కొత్తగా నియమించగా వారు విధులకు కొత్త పూర్తి స్థాయిలో ఆవగహన లేక ఇబ్బందులు తలేత్తుతున్నాయి.

జగిత్యాల జిల్లా పరిధిలోనే రాయికల్ పెద్ద మండలం కావడం వల్ల రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు తప్పనిసరి. కాగ గత కొన్ని నెలల క్రితం ఎఓగా పని చేసిన సునిల్‌కుమార్‌రెడ్డి బదిలీపై వెళ్లడంతో ఇక్కడ పోస్టు ఖాళీగా ఉంది. అధికారులు సారంగాపూర్ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించిన పని భారంతో ఆ అధికారి ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. జగిత్యాల జిల్లాలోనే రాయికల్ మండలంలో ఎక్కువ మామిడితోటలు అధికం వీటితో పాటు మొక్కజొన్న, వరి, పసుపు, మిర్చి, ఇతర పంటలు సాగుచేస్తుంటారు. రైతులు సాగు చేసే పంటలకు తెగుళ్లు సోకినప్పుడు నివారణకు తీసుకోవల్సిన చర్యలను వివరించాల్సిన సిబ్బంది అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం సబ్సీడిపై అందించే వ్యవసాయ పరికరాలు, పనిముట్లు, విత్తనాలపై సమాచారం అందించే పరిస్థితి లేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి.

ఏదైనా సమాచారం కోసం రైతులు, ప్రజాప్రతినిధులు మండల వ్యవసాయ కార్యాలయానికి వెళ్లితే అక్కడ సమాచారం ఇచ్చే వారు ఎవరు ఉండరు. ఎప్పుడూ ఖాళీ కుర్చీలే దర్శనమిస్తుంటాయి. ఇరువురు ఎఇఓలలో సుమలత ప్రసూతి సెలవులో ఉండగా మరో ఎఇఓ శ్రీనివాస్‌ను అధికారులు డిప్యూటేషన్‌పై వేరే చోటికి పంపినట్లు తెలిసింది. డిప్యూటేషన్ ఇష్టంలేని సదరు ఎఇఓ సెలవు పెట్టినట్లు సమాచారం. ఎఇఓ శ్రీనివాస్‌పై కొందరు ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ పరిస్థితి దాపురించినట్లు తెలిసింది. సీనియర్లు లేకపోవడంతో కొత్తగా వచ్చిన ఎఇఓలు విధుల్లో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎఓ, ఇతర సిబ్బందిని భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు.

Comments

comments