Home మహబూబాబాద్ పైసలిస్తేనే పని..

పైసలిస్తేనే పని..

Farmers Facing Problems With  Revenue  Officers

మన తెలంగాణ/పెద్దవంగర : మండల వ్యాప్తంగా రెవెన్యూ ఆధికారులు పెడుతున్న కిరికిరితో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ రికార్డుల నమీకరణలో జిల్లాలో ప్రథమ స్థ్ధానమని ఆధికార యాంత్రంగం పదేపదే చెబుతున్న క్షేత్రస్థాయిలో రైతులు ఇక్కట్లపై మాత్రం మాట్లాడటం లేదు. మండల సర్వసభ్య సమావేశం సాక్షిగా భూరికార్డుల నవీకరణలో 50 శాతం తప్పుల తడకలని తేటతెల్లమైంది. కొందరు విఆర్‌ఒలకు అవగాహన లేక తప్పులు చేయగా, మరికొందరు కావాలనే చేశారన్న ఆరోపణలున్నాయి. తప్పులను ఎలా సరిదిద్దుతారనేది ఇప్పటి వరకు ఆధికారుల స్పష్టంగా చేప్పలేకపోతున్నారు. నూతన పాస్‌పుస్తకాలను ఆనందంగా అందుకున్న రైతులు భూముల సర్వే నెంబర్లు, తదితర వివరాలు సక్రమంగా లేకపోవడంతో లబోదిబోమంటున్నారు . వాటిని ఎలా సరిదిద్దాలనే దానిపై కూడా ఆధికారులకు అవగాహన కరువైంది. ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించి 20 రోజులైనా తప్పుల సవరణలో వేగం పెరగలేదు. గతంలో ఎప్పుడో ప్రభుత్వం హామీ ఇచ్చిన సాదబైనామాల పట్టాల విషయం నేటికి తేలలేదు. ఉచితంగా పట్టా మార్పిడి చేస్తామని సాదాబైనామాలకు చట్టబద్దత కల్పిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. దీంతో క్రమబద్దీకరణకు భారీగా దరఖాస్తులు వచ్చాయి . ఈ నేపథ్యంలో కొందరు పాత కాగితాలపై కొత్త రాతలు రాసి కూడా దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించి రైతులకు పట్టాలివ్వాల్సి ఉంది. కానీ సాదాబైనామాల సంగతినే ఆధికారులు మరిచిపోయారు. వాటికి పట్టాలిచ్చే సమయంలోప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళనను తెరపైకి తెచ్చింది. దీంతో సాదాబైనామాలు మరుగునపడ్డాయి. భూములు కొనుగోలుదారులు దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారు.
రైతులకు ముచ్చెమటలు
చాలా గ్రామాల్లో విఆర్‌లు మొదలు వారిపైస్థాయి ఆధికారుల వరకు డబ్బులు పుచ్చుకొని సైతం పట్టా చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న విఆర్‌ఒలు సస్పెండ్ అయితే డబ్బులు ఇచ్చుకున్న రైతులకు ఎటూ పాలు పోవడం లేదు. మళ్లీ కొత్త విఆర్‌ఒలు వస్తే మళ్లీ లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ఎర్పడుతుందని రైతులు ముక్కునవేలేసుకుంటున్నారు. కొందరు గ్రామస్థాయిలో ఆనుచరులతోపాటు కొందరు విఆర్‌ఒల ద్వారా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి . మొత్తానికి నూతన పాస్‌పుస్తకాల తప్పుల తడకా ఇచ్చిన రెవెన్యూ యంత్రంగం రైతాంగానికి ముచ్చెటమలు పట్టిస్తోంది . ఏడాది కాలంగా రైతులు రెవెన్యూ ఆదికారుల, తహసీల్ధార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదు.
పార్ట్-బీపై సర్వే ఏది ?
పార్ట్–బీలో ఉన్న వాటిని క్షేత్రస్థాయిలో సర్వేయర్ ద్వారా సర్వే చేయించాల్సి ఉంటుంది. కానీ రెవెన్యూ యంత్రాంగం ఆఫిస్ నాలుగు గోడలకే పరిమితమైంది తప్ప క్షేత్రస్థాయికి వెళ్ళడం లేదు . ప్రభుత్వం సైతం రెవెన్యూ ఆధికారుల నుంచి రోజుకో నివేదిక కోసం అదేశాలు ఇస్తుండటంతో సిబ్బంది మొత్తం కార్యలయాలకే పరిమితమవుతున్నారు. వివాదాస్పద భూములను సరిచేసి ఆనంతరం పాసుపుస్తకాలు అందజేస్తేనే పెట్టుబడి సాయంతో పాటు రైతు భీమా అమలవుతుంది. అయితే ఆధికారుల నిర్లక్షం కారణంగా పార్ట్-బీకి సమస్యలు అలానే ఉన్నాయి. పాస్‌పుస్తకాలలో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకే ఓ గడువంటూ లేకుండా పోయింది. దీంతో రైతులు నిత్యం విఆర్‌ఒల , తహసీల్ధార్‌ల చుట్టూ ప్రదిక్షిణలు చేయక తప్పడం లేదు. చేయి తడిపితే పనులు జరిగేలా ఉండటంతో తప్పని పరిస్థితిలో రైతులు అప్పులు చేసి మరీ రెవెన్యూ యాంత్రాంగానికి ముడుపులు ఇచ్చుకోవాల్పి వస్తోంది . ఓ వైపు లంచాలు తీసుకొంటున్న తప్పుల సవరణ, సాదాబైనామాల సమస్య పరిష్కారంలో జాప్యంతో రైతులకు ఎటూ పాలుపోవడం లేదు. గతంలో ఉన్నా 1బీ సమాచారాన్నైనా సరిగా ఆన్‌లైన్‌లో చేసి ఉంటే పాత పాస్‌పుస్తకాల మాదిరిగానే కొత్త వాటిలో సర్వే నంబర్లన్నీ నమోదై వచ్చి ఉండేవని, అయితే ఆధికారుల తప్పిదంతో కొత్త పాస్‌పుస్తకాల తప్పుల తడకలుగా మారాయని రైతులు పేర్కొంటున్నారు. తప్పుల కారణంగా రైతుబంధు, రైతుభీమా పథకాలకు దూరం కావాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.