Home కామారెడ్డి రైతులను నిలువునా ముంచుతున్న కల్తీ విత్తనాలు

రైతులను నిలువునా ముంచుతున్న కల్తీ విత్తనాలు

Farmers Facing Soya Fake Seeds In Kamareddy Distమన తెలంగాణ/కామారెడ్డి: కల్తీ విత్తనాలు జిల్లాలో రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నాయి. ఈ  ఖరీఫ్‌లో  వేసిన సోయా విత్తనాలు మొలకెత్తలేదని రైతులు ఆగ్రహించారు. కామారెడ్డి, గాంధారి, బాన్సువాడ, పిట్లం, బిచ్కుందల్లో కల్తీ విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. కల్తీ పత్తి విత్తనాలు మార్కెటులో విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి కల్తీ విత్తనాలు అమాయక రైతులకు అంటగడుతున్నారని చెబుతున్నారు. నకిలీ, కల్తీ విత్తనాలతో రైతు నిలువునా మునిగిపోతున్నాడు. జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయల విత్తన విక్రయా లు సాగుతున్నాయి. జిల్లాతో పాటు బాన్సువాడ, బిచ్కుంద, గాంధారి, ఎల్లారెడ్డిలో విత్తన అమ్మకాలు భారీగా సాగుతాయి.  గాంధారిలో వంద ల ఎకరాల్లో వేసిన సోయా మొలకెత్తలేదని రైతులు ఫిర్యాదు చేశారు. కామారెడ్డిలో కల్తీ విత్తనాల వ్యాపారులపై నిఘా కరువైందని, కొందరు అధికారులు దళారులతో మిలాఖత్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.

కల్తీ విత్తనాలు అమ్మినా ఎలాంటి చర్యలు లేకపోవడం, నామమాత్రపు తనిఖీలు చేయడంతో కల్తీ విత్తనాల అమ్మకాలకు అడ్డులేకుండా పోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అధికంగా వరి, మక్క, పత్తి, మిర్చి, సోయా,పొద్దు తిరుగుడు, ఇతర పప్పు ధాన్యాలు విత్తనాలు అమ్ముతారు. వేల క్వింటాళ్ళ విత్తనాలు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. సొంత బ్రాండ్లు, నకిలీ బ్రాండ్లతో కొందరు చేస్తున్న వ్యాపారంతో రైతు లు నష్టాల పాలవుతున్నారు. అమాయక, చదువురాని రైతులు కల్తీ వ్యా పారుల ఉచ్చులో పడి మోసాలకు  గురవుతున్నారు. నకిలీ, కల్తీ విత్తనాలను నిరోధించాల్సిన అధికారులు ప్రకటనలకే పరిమితం అవుతున్నారని విమర్శలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో రైతుల ఫిర్యాదులు ఉన్నా చర్య లు శూన్యంగా ఉంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గత 3 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో సరైన వర్షాలు లేక అన్నదాతలు ఆందోళన  చెందుతుండగా, ఈసారి పెరిగిన కల్తీ విత్తనాలతో మరింత నష్టం జరుగుతుందని బాధపడుతున్నారు. సర్కారు కల్తీ విత్తనాలపై కఠిన వైఖరితో ఉన్న క్షేత్ర స్థాయిలో నిరోధక చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. జూన్ చివరిలో ఖరీఫ్ పనులు షురూ అయిన అధిక శాతం విత్తనాల అమ్మకాలు జరిగిపోయాయని, యంత్రాంగం ఇప్పుడు హడావిడి చేస్తుందని రైతులు చెప్పారు. ముందస్తు కల్తీ విత్తనాల నివారణ చర్యలు లేవని రైతులు వాపోతున్నారు.

అక్రమ  వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాలని కర్షకలోకం కోరుతుంది. కొందరు వ్యాపారులు కల్తీ విత్తనాలు అమ్మి టాక్స్ పెయిడ్ రశీదులు ఇవ్వడం లేదని, ఇదంతా పర్యవేక్షించాల్సిన యంత్రాంగం నిర్లక్షంతో వ్యవహరిస్తుందని వినవిస్తున్నాయి. కల్తీ విత్తనాల ప్యాకింగ్, రవాణా, సొంత బ్రాండ్ల అమ్మకం గుట్టుగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కల్తీ విత్తనాల దందా, ముందస్తు రవాణాపై నిఘా అధికారులు దృష్టి సాధించడం లేదని, కల్తీపై వారి పాత్ర అనుమానాలు దారితీస్తున్నాయని రైతులు అంటున్నారు. కల్తీ నిరోధక విభాగం నిద్రపోతుందని విమర్షలు బాహాటంగా వస్తున్నాయి. సొంత బ్రాండ్లతో ఆకర్షనీయ ప్యాకె ట్లు మార్కెట్‌లో అధికంగా కనిపిస్తున్నాయి. ఎల్లారెడ్డి, దోమకొండలో కల్తీ విత్తనాల నష్టపరిహారం డబ్బుల పంపిణీలో గతంలో అనేక  ఫిర్యాదులు వచ్చాయి. పిట్లంలో నకిలీ మార్కె ట్ బాగా విస్తరించిందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల గాంధారిలో, తాడ్వాయిలో బయట పడ్డ చర్యలే ఇందుకు నిదర్శనం.