Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

‘ఎండు’గాలం

Farmers Facing Troubles In Cultivation In vikarabad dist

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వర్షాకాలం వచ్చి అపుడే మూడు వారాలు గడిచాయి.  జూన్ మొదటి వారంలో మురిపించిన వరుణుడు క్రమేపీ జాడలేక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో వేసుకున్న విత్తనాలకు ఆశించిన వర్షాలు లేక పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వికారాబాద్ జిల్లాలో 70 శాతం విత్తనాలు వేసుకున్నారు. జూన్ మొదటి వారం తొలకరిలోనే భారీ వర్షాలు కురిశాయి. రైతులు కంది, పెసర, మినుము, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు వేసుకున్నారు. ఇంకా 30 శాతం మంది రైతులు విత్తుకోవాల్సి ఉన్నది. మరో భారీ వర్షం కురిస్తేగానీ వారు విత్తనాలు వేసుకోలేని పరిస్థితి. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1.73 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు లక్షా ఇరవై వేల హెక్టార్లలో పంటలు వేసుకున్నారు. మిగిలిన ప్రాంతాల్లో జూన్ మూడవ వారం నుంచి విత్తుకుంటారు. నల్ల రేగడి భూముల్లో కాస్త ఆలస్యంగా విత్తుకుంటారు.  వర్షాల జాడ కానరాక రైతులు దిగాలు పడుతున్నారు. వేసుకున్న పంటలు ఎండు ముఖం పట్టాయి. వర్షాధారితంగానే ఖరీఫ్ పండిస్తున్నందున రైతులు నేలవైపు చూస్తున్నారు. పలుచోట్ల రైతులు బోరుబావుల నుంచి పైపుల ద్వారా పంటలను తడుపుతున్నారు. మోమిన్‌పేట మండలంలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో నాలుగైదు రోజులలో వర్షాలు కురియకుంటే ఈ పంట కూడా చేతికి రావడం కష్టతరమేనని ఆందోళనకు గురవుతున్నారు. ఎండు ముఖం పట్టిన పంటలకు బోరు బావుల ద్వారా నీటిని అందించాలని భావిస్తున్నారు.

జూన్‌లో సాధారణ వర్షపాతం 88 సెంటీమీటర్లు కురియాల్సి ఉండగా ఇప్పటి వకు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 18 మండలాలు ఉండగా 16 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. మిగిలిన రెండు మండలాల్లో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. జూలై, ఆగష్టు, సెప్టెంబరు మాసాల్లో కూడా సాధారణ వర్షపాతం నమోదైతే పంటలకు ఢోకా ఉండదని అంటున్నారు. ఆరంభంలోనే సకాలంలో వర్షా లు పడితే కంది, పత్తి పంటలకు మేలు చేకూరుతుం ది. జిల్లాలో తాం డూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో అత్యధికంగా కం ది పంట వేసుకుంటారు. 60 వేల హెక్టార్లలో కంది పం డిస్తారు. రెండో అతి పెద్ద పంటలో పత్తిపై కూడా రైతులు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది కంటే ఈసారి పత్తి పంట అధికంగా వేసుకున్నారు. ఈయేడాది 50 వేల హెక్టార్లలో పత్తి వేసుకున్నట్లు సమాచారం. అక్టోబరు మాసం నుంచే పత్తి పంట చేతికి అందుతుంది. కంది పంట డిసెంబరు మొదటి వారం నుంచి దిగుబడులు మొదలవుతాయి. కొన్ని చోట్ల జనవరిలో చేతికి వస్తుంది. ఈ రెండు పంటలకూ మెరుగైన వర్షాలు కురిస్తేనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. పెసర, మినుము పంటలు కేవలం మూడు నెలల్లోనే చేతికి వస్తాయి. ఈ రెండు పంటలకు సాధారణ వర్షపాతం నమోదైతేనే అధిక దిగుబడులు వస్తాయి. అతివృష్టి, అనావృష్టి ఏర్పడితే నిరాశ మిగుల్చుతాయి. మరోవైపు జిల్లాలో చాలా గ్రామాలలో మంచినీటి ఎద్దడి నెలకొంది. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. పలు గ్రామాలలో చెలిమెల ద్వారా నీటిని తోడుకుంటున్నారు. బోరుబావులు, ఇతరత్రా వనరులలో నీటి కొరత ఏ ర్పడింది. ఈ వారమంతా భారీ వర్షాలు కురిస్తేనే సాగుకు, తాగుకు నీటి కొరత తీరుతుందని అంటున్నారు.

Comments

comments