Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

నడ్డి విరిచిన ‘నాగు’వడ్డీ…

Fudelismనైజాం రాజ్యంలో మాట వినని వారికి చిత్రహింసల దండన విధించే క్రమం ఒకటైతే, రైతులను కూలీలుగా మార్చి, వారి భూములపై వారికే హక్కు లేకుండా చేసిన దుర్మార్గ విధానం ఇంకొకటికాగా, వారిని నిట్ట నిలువునా దోపిడీ చేసే మరో పన్నాగానికి కూడా అప్పట్లో దొరలు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు తదితరులు ఒడిగట్టారు. రైతుల అవసరాలను, బలహీనతలను సాకుగాచేసుకొని అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి, చివరికి వారు వాటిని తీర్చలేనప్పుడు బలవంతం చేసి, వారి ఆస్తులు, భూములు జప్తు చేసుకునే దుర్మార్గపు సంస్కృతి ఆనాడు తెలంగాణ లోని ప్రతి గ్రామంలో స్పష్టంగా కనిపించింది. ఈ వడ్డీ వ్యాపారం రైతులు ఆర్థికంగా కుంగిపోవటానికి, భూస్వామ్య వ్యవస్థ పునాదులు గట్టి పడటానికీ దోహదం చేసింది. వడ్డీలకు షావుకార్లు, కోమటి వారే కాదు… దేశ్‌ముఖులు, గ్రామాధికారు లుగా ఉన్న వారు కూడా ఈ వ్యాపారం సాగించేవారు. చాలా సంవత్సరాల దాకా ఈ వడ్డీ రూపాయి మాత్రమే ఉండేది. యుద్ధానంతరకాలం నుంచి ఇది రెండు రూపాయలకు పెరిగింది. రైతులు అసలు ఇవ్వలేక కొంత వడ్డీ చెల్లించి, అసలు, మళ్ళీ కొత్త వడ్డీతో కలిపి కొత్త కాగితాలు రాయించుకునేవారు. ఇలా పాత వడ్డీ అసలుగా మారి, మళ్ళీదానిపై వడ్డీ చెల్లించుకోవలసిన దుస్థితి.  కొన్ని సందర్భాలలో  రైతులు అప్పులు తీర్చలేక భార్యల తాళిబొట్లు, చివరకు పొలాలు కూడా అమ్ముకొని, ఆ భూస్వాముల వద్దనే కౌలు రైతు లుగానో, పాలేరుగానో పని చేయాల్సి వచ్చేది. ఈ అప్పుల విధానం కేవలం డబ్బు రూపంలోనే కాదు… ధాన్యం రూపంలో కూడా ఉండేది. అదే నాగు వడ్డీ విధానం. ఉదాహరణకు ఒక మణుగు ధాన్యాన్ని నాగు కింద తీసుకుపోతే, ఆరు మాసాల నాటికి అర మణు గు ఎక్కువగా వేసి ఒకటిన్నర మణుగు తిరిగి ఇవ్వాల్సి వచ్చేది. అలా ఇవ్వకపోతే ఈ మణుగు న్నర ధాన్యానికి మళ్ళీ అర మణుగు వడ్డీ కలిసేది. సగం ఇస్తే సగం నాగు అనేవారు. అసలుతో కలిపి అంతా ఇస్తే సరినా గు అనేవారు. ఈ విధానం కింద భూస్వా ములు, ధనిక రైతులు విపరీతంగా సంపాదించేవారు. హరిజనులు, నిరుపేదలు పంటల తరుణం రాక ముందే తిండి అవసరాల కోసం విధి లేక ఇలా నాగుపై ధాన్యాన్ని తీసుకెళ్ళేవారు. పెరిగిన అప్పులు తీర్చలేక ఉన్నవన్నీ అమ్ముకుని బికారులుగా మారిన వారు అప్పట్లో లక్షల సంఖ్యలోనే ఉన్నారు.

Comments

comments