Home ఖమ్మం రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ఆందోళన

రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ఆందోళన

రైతు సమస్యల పరిష్కారంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం
ఆత్మహత్యలను వేరే సాకుగా చూపడం సిగ్గుచేటు
కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమంలో ఎఐసిసి కార్యదర్శి విహెచ్
విహెచ్, భట్టి, అజయ్, రాంరెడ్డి అరెస్టు

congress-khammamఖమ్మం రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలు దేరిన నాయకులు బస్టాండ్ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎఐసిసి కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క, ఎంఎల్‌ఎలు రామిరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఈ ధర్నాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వి.హనుమంతరావు మాట్లాడుతూ పంటలు లేక రైతులకు కొత్త రుణాలు రాక పుట్టెడు బాధలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెలంగాణ సర్కారు రైతులు వేరే కారణాలతో మరణిస్తున్నారని ప్రకటించడం సిగ్గు చేటన్నారు. రైతులు మనోధైర్యం కోల్పోవద్దని, 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రైతులు కష్టాలు తీరుస్తామని భరోసా ఇచ్చారు.

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను కాంగ్రెస్ తరుపున ఆదుకుంటామని హమీ ఇచ్చారు. ధర్నా నిర్వహిస్తున్న వీరిని పోలీసులు అరెస్టు చేసి టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. టూటౌన్ పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. అరెస్టు అయిన వారిలో మాజీ ఎంఎల్‌ఎలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, డిసిసి అధ్యక్షులు ఐతం సత్యం, కాంగ్రెస్ నాయకులు కొత్త సీతారాములు, పొన్నం వెంకటేశ్వర్లు, నున్నా మాధవరావు, కొల్లు పద్మ, గాదె ఝాన్సీ, బాలాజీ రావు నాయక్, కూల్‌హోం ప్రసాద్, కిశోర్, బ్రహ్మరెడ్డి, జాఫర్, తదితరులు ఉన్నారు. అనంతరం వారిని విడుదల చేశారు.