Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

సాగుకు సమాయత్తం

Farmers Ready Do Khariff Cultivation

మన తెలంగాణ/జోగిపేట : చిరుజల్లులు పలకరించాయి.. పుడిమితల్లి పులకరించింది.. అన్నదాతను సాగుకు సమాయత్తం చేసింది.. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండడం, ఉచిత నిరంతర విద్యుత్ సరఫరా కావడం, మొదటిసారిగా టిఆర్‌ఎస్ సర్కార్ నుంచి పెట్టుబడి సాయం అందడంతో పల్లెల్లో సాగు సంబురం మొదలైంది. ఇప్పటికే సేద్యపు పనుల్లో నిమగ్నమైన కర్షకలోకం బిజీ అయింది. ఎన్నడూ లేని విధంగా రైతుల్లో ఉత్సాహం కనిపిస్తుండగా, పల్లెల్లో వ్యవసాయ దుక్కులతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈసారి రైతుబంధు పథకం ద్వారా పడావు భూములకు సాగుకళ వస్తుందని చెప్పవచ్చు. దీంతో వానా కాలం సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు సైతం అంచనా వేస్తున్నారు.
నైరుతి రుతుపనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇప్పటికే రైతుబంధు పథకం ద్వారా అందించిన పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచిన రైతన్నలు తాజాగా కురుస్తున్న వర్షాలతో విత్తనాలు నాటేందుకు పొలంబాట పట్టారు. గత ఏడాది కంటే ఈసారి తొలకరి వర్షాలు ముందుగానే పలకరించడంతో జనాలు పులకరించి పోయారు. దంచికొట్టిన ఎండలు మృగశిరకార్తె ప్రవేశంతో వాతావరణం చల్లబడింది. వాతావరణ శాఖ ప్రకటించిన విధంగానే పలు ప్రాంతాల్లో వానలు కురువడంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. వానా కాలం సీజన్ ప్రారంభంలోనే ఆశాజనకంగా వర్షాలు పడుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క దుక్కులు జోరందుకుంటే మరోపక్క ఇప్పటికే దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచుకున్న రైతులు విత్తనాలు నాటేందుకు సన్నద్ధ్ధమయ్యారు. ఇదిలా ఉండగా మృగశిర ప్రవేశంలోనే కొందరు విత్తనాలు వేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక బోర్లు, బావుల ఆధారంగా వ్యవసాయం చేసుకునే రైతులు ఇప్పటికే నారుమడులు పోసుకున్నారు. అంథోలు నియోజకవర్గంలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తి సాగు చేస్తుండగా, తర్వాత వరి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర సాగు కు రైతులు మొగ్గుచూపుతున్నారు. ప్రభు త్వం ఈ విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు సిద్ధంగా ఉండగా ఈ నెలతో పాటు జూలై నెలలో కురిసే వర్షాలపై ఆధారపడి రైతులు విత్తనాలు వేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

Comments

comments