Home మహబూబ్‌నగర్ రబీలో రైతుల కన్నీళ్లు

రబీలో రైతుల కన్నీళ్లు

FARMERS12జిల్లాలో అలముకున్న కరువు ఛాయలు..
సాధారణ కంటే తక్కువ వర్షపాతం
రబీపై ఆశలు వదులుకుంటోన్న రైతులు..
తక్కువ విస్తీర్ణంలో రబీ సాగుకు సన్నద్ధం..
కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్

పాలమూరు: వెనకబడిన పాలమూరు జిల్లాలో కరువు ఛాయలు అలముకున్నాయి. గతేడాది కంటే జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదుకావడంతో రైతుల్లో రబీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఖరీఫ్‌లో ఆశించిన మేర వర్షాలు కురియక పోవడంతో జిల్లాలోని జలాశయాల్లో నీటి మట్టం బాగా తగ్గి రైతులకు నీరందించని స్థితికి చేరుకున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం సాధారణ వర్షపాతం 446.8మీమీ కాగా వాస్తవంగా మూడొందల మీమీ మాత్రమే వర్షం కురిసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే సాధారణ వర్షపాతం కంటే 36మిమి తక్కువ కురిసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని జలాశయాల్లో నిల్వ ఉండాల్సిన పరిమాణంలో లేకపోవడంతో జూరాల, కోయిల్‌సాగర్, సరళాసాగర్, రామన్‌పాడ్ తదితర వాటిలో నీటి మట్టం బాగా తగ్గి రబీలో రైతులకు ఆశించిన మేర నీటిని అందించలేకపోతున్నాయనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమౌతోంది. వర్షాకాలం ఆరంభం మొదలు జూన్ నెల సాధారణ వర్షపాతం 81.2మీమీ కాగా 70మిమి మాత్రమే నమోదైంది. అదేవిధంగా జూలై నెల సాధారణ వర్షపాతం 146.6మీమీ కాగా కేవలం 39.2మీమీ మాత్రమే వర్షం పడి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది.

ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 141మీమీ కాగా కేవలం 114మీమీ వర్షం కురిసింది. ఇక సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో రబీపై కొండంత ఆశలు పెట్టుకున్న రైతుకు కడగండ్లే మిగిలాయి. జిల్లాలో రబీసాగు 1.91లక్షల హెక్టారులు కాగా వర్షాభావ పరిస్థితుల కారణంగా కేవలం 1.25లక్షల హెక్టారులు మాత్రమే సాగుచేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. రబీ వేరుశనగ సాగు 1.25లక్షల హెక్టారులు కాగా కేవలం 60వేల హెక్టారులలో రైతులు సాగుచేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వరిసాగు ఆశించిన మేర రైతులు చేయడంలేదని పలువురు చెబుతున్నారు. వరి 35వేల హెక్టారుల సాగు కాగా కేవలం 25వేల హెక్టారులలో మాత్రమే వరిసాగు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో రబీసాగుకు జిల్లా వ్యవసాయశాఖ విత్తనాల పంపిణీకి అన్ని చర్యలు చేపట్టినప్పటికి నీటి వసతుల్లేక సాగుకు రైతులు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి తమను ఆదుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.