Search
Wednesday 21 November 2018
  • :
  • :

పునాస పంటలకు ఊపిరి పోసిన వాన

Farmers Start Khariff Cultivation In siddipet District

మన తెలంగాణ/జోగిపేట/గజ్వేల్ : ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు. జూన్ మొదటి వారంలో కురిన వానతో పత్తి, మొక్కజొన్న సాగు చేశారు. మొదట్లో మురిపించిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. అడపదడపా చిరుజల్లులు కురిసినా వేసిన విత్తనాలు మొలకెత్తుతాయో లేదో.. మొలకెత్తిన మొక్కలు ఎండిపోతున్నాయన్న ఆందోళన ఆన్నదాతల్లో వ్యక్తమైంది. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో పంటలకు ఊపిరి పోసినట్లు అయిందని రైతులు మురిసిపోతున్నారు. అలాగే ఒకపక్క రైతు బంధు పథకంతో తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించడం, మరోపక్క కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటలకు మద్దతు ధరలను పెంచడంతో వ్యవసాయ పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, పెసర, వేరుశనగ, కంది, పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు.
రోహిణి, మృగశిర కార్తెల ఆరంభంలో మురిపించిన వరుణుడు ఆరుద్రకార్తెలో ముఖం చాటేసాడు. తిరిగి పునర్వాసుకార్తెలో వరుణుడు కరుణించడంతో శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇప్పటికే వాణిజ్య పంటలు వేసుకున్న రైతులకు ఈ వర్షాలు ఊరటనివ్వగా, వర్షాధారంగా సాగుచేసే పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా బావులు, బోర్లు కింద వరి నారుమళ్లు సిద్ధంగా ఉండడంతో కురుస్తున్న వర్షాలతో నాట్లు వేసుకునేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెలలో వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తుండడంతో జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. దీంతో గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతు బంధు సాయంతో పల్లెబాట పట్టిన రైతులు : వ్యవసాయ పెట్టుబడులు అధికం కావడం, పంట నష్టాలతో అప్పులపాలై రైతన్నలు కొందరు భూములను కౌలుకు పెట్టి, మరికొందరు తమ భూములను పడావుగా వదిలేసి పట్టణాలకు వలస వెళ్లారు. తెలంగాణ సర్కార్ రైతు బంధు పథకం ద్వారా పంట సాగుకు పెట్టుబడి సాయం అందించడంతో వలసలు వెళ్లిన రైతులు ఏంతో ఉత్సాహంగా వ్యవసాయం చేసుకోడానికి తిరిగి పల్లెబాట పట్టారు. గతంలో పంటలు సాగు చేసుకోవడం కోసం రైతులు వడ్డీ వ్యాపారులు, దళారులను అప్పుల కోసం ఆశ్రయించే వారు. కానీ ఈసారి ముందుగానే అందిన రైతు బంధు సర్కార్ సాయంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా రైతులందరికీ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బంధు పథకాన్ని వర్తింపజేశారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించారు.
పెరిగిన మధ్దతు ధరతో ఆనందంలో రైతులు : రైతులు పండించే పంటలకు కేంద్ర ఫ్రభుత్వం మద్దతు ధరలను పెంచడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ సాగువైపు మొగ్గుచూపుతున్నారు. 14 రకాల పంటలకు మోదీ సర్కార్ మద్దతు ధరలను ప్రకటించింది.
పెరగనున్న సాగు విస్తీర్ణం : జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తి సాగు చేస్తుండగా, తర్వాత వరి, మొక్కజొన్న సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. రైతు బంధు పెట్టుబడి సాయం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో పాటు రైతులకు అవసరమైన ఎరువులను కూడా రాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాలకు ఎరువులను పంపిణీ చేసి రైతులకు అందుబాటులో ఉంచారు. రైతులు ఏంతో ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పడావుగా ఉన్న భూములు సైతం ఈసారి సాగుకు సిద్ధమవుతుండడతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది జిల్లాలో పత్తి పంట ప్రధానం కానున్నది. గతేడాది వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 10 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసిన రైతులు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో 3 లక్షలకు పైగా ఎకరాల్లో పండించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వర్షాలు ఎట్టకేలకు గత రెండు రోజులుగా కురుస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం కూడా చల్లబడింది. దీనితో పుడమితల్లి పులకిస్తుండగా పొలాల్లో వడలిపోతున్న పంటచేన్లు వర్షానికి తడిసి రెపరెపలాడుతున్నాయి. అన్నదాతలు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పైర్లకు ప్రాణం వచ్చినట్లైంది. కొంత ఆలస్యంగానైనా కురుస్తున్న కొద్దిపాటి వర్షంతో తమ పంటలు మరి కొద్దిరోజుల వరకైనా బతుకుతాయన్న ఆశలకు బలం పోసినట్లయింది. తొలకరి వర్షాలతో రైతులు వేసిన పత్తి తదితర ఖరీష్ పంటలు మొలకెత్తిన కొద్ది రోజులకే వర్షాలు కురవక పోవటంతో ఆందోళన చెందారు. నియోజకవర్గంలోని వర్గల్, గజ్వేల్, ములుగు, జగదేవపూర్,తూప్రాన్, కొండపాక మండలాలో తొలకరిలో సాగుచేసిన పత్తి, మక్కజొన్న,అపరాలు, మిరప, వరి తదితర ఖరీఫ్ పంటలపై రైతులు ఆశలు వదులుకున్నారు. అయినా కొంత మంది రైతులు అప్పుడప్పుడే మొలకెత్తిన పత్తి మొక్కలకు నీరందించటానికి దూర ప్రాంతాలనుంచి ట్యాంకర్లతో, డ్రమ్ములతో నీటిని తెచ్చి ఒక్కో మొక్కకు నీటిని పోశారు. తమ పంటలు దక్కాలంటే వరుణ దేవుని కరుణ కావాల్సిందేనని రైతులు అర్రులు చాచారు. ఎట్టకేలకు గత రెండు రోజులగా భూమి తడిసి మొక్కలు బతకటానికి అవసరమైనంత మోతాదులో వర్షాలు కురుస్తున్నాయి. దీనితో తమ పొలాలకు ఎక్కడెక్కడినుంచో నీటిని తరలించే తిప్పలు తప్పింది. ఈ వర్షాలతో తమకు దక్కకుండా పోతాయనుకున్న తమ పంటలు ఇప్పుడు కురిసిన ఈ కొద్ది పాటి వర్షాలతో రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాలతో పత్తి, మక్కజొన్న, వరి, కూరగాయలు, మిరప తదితర పంటలకు ఎంతో మేలు చేస్తుందని అన్నదాతలు అంటున్నారు.

Comments

comments