Home ఖమ్మం ఆగని ఆత్మార్పణాలు

ఆగని ఆత్మార్పణాలు

Untitled-1రోజురోజుకూ పెరుగుతున్న రైతన్నల ఆత్మహత్యలు
పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు
కలసిరాని ప్రకృతి, పట్టించుకోని పాలకులతో దయనీయ స్థితి

ప్రతి ఏటా కలిసివస్తుందనే ఆశతో సాగు చేసిన రైతన్నకు కష్టాలు, నష్టాలు పరిపాటిగా మారాయి! గత ఏడాది చేసిన అప్పులు తీరకపోగా, కొత్త అప్పులు తోడవుతున్నాయి! ఈ నేపథ్యంలో సహకరించని ప్రకృతి, సహాయం అందించని పాలకుల నడుమ అన్నదాతలు ఆత్మహత్యలే శరణ్యమని భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు! వ్యవసాయం తప్ప మరొకటి తెలియని అన్నదాతలు సాగుకు సిద్ధమవుతూ పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు తీసుకొని అప్పులు ఊబిలో కూరుకపోతున్నారు! ఈ తరుణంలోనే అవి తీర్చే మార్గం కానరాక అర్థాంతరంగా తనువుచాలిస్తున్నారు! దేశానికి వెన్నెముకగా చెప్పుకునే పాలకులు ఇప్పుడు రైతు ఆత్మహత్యలకు వ్యవసాయం కారణం కాదంటూ తప్పించుకునే దారులు వెతుకుతుండడం గమనార్హం.

ఖమ్మం: రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అంకెలు, సంఖ్యలు పక్కన పెడితే రైతాంగం ఆత్మధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది వాస్తవం. దీనికి పరనింద మాని కారణాలు అన్వేషించాలి. పరిష్కార మార్గాలను కొనుగోని ఆత్మహత్యలు నివారించాలి. ఆత్మహత్యలకు ప్రధాన కారణం అప్పులు. అప్పుతీర్చలేక కొందరు, అప్పు దొరకక సాగు చేయలేక మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
కలిసి రాని సాగు: గత ఐదు సంవత్సరాల సాగును పరిశీలిస్తే ఏ సంవత్సరం లాభాలు పండించిన పంట లేదు. ఒకవేళ ఒకరకం పంట ఫర్వాలేదనిపిస్తే మిగిలిన పంటలు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. అతివృష్టి, లేదంటే అనావృష్టి అకాల వర్షాలు వ్యవసాయంలో నష్టాలకు ప్రధాన కారణాలు. వీటిని నియంత్రించలేకపోయినా తదనంతరం రైతాంగాన్ని ఆదుకో వడంలో పాలకులు విఫలమయ్యారు. ప్రకృతి విపత్తులకు నష్టాల అంచనాలే వాస్తవ దూరం. కరువుతో పంట సాగు చేయక నారుమడులు ఎండిపోతే రూ.30 నుండి 120 రూపాయలు పరిహారం ప్రకటించి అది బ్యాంకు అకౌంట్ల ద్వారా ఇస్తామని ప్రకటించారంటే ఆదుకునే తీరు ఏవిధంగా ఉందో ఆలోచించు కోవచ్చు. పండిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. గిట్టుబాటు ధర ఉన్న పంట పండదు. పంటల సాగుకు డిమాండ్‌కు అనుగుణంగా ఆధునిక పద్ధతుల్లో సాగుపై అవగాహన కల్పించకపోవడం నష్టాలకు మరో కారణం.
పెరిగిన పెట్టుబడులు: ఐదు సంవత్సరాల కాలంలో పెట్టుబడులు రెండు నుండి మూడు రెట్లు పెరిగాయి. దుక్కులు మొదలు రసాయనిక ఎరువుల దాకా అన్నీ విపరీతంగా పెరిగాయి. పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా గిట్టుబాటు ధర లభించడం లేదు. పెట్టుబడి ఆధారంగా మద్దతు ధర నిర్ణయించకపోవడం వల్ల పంట పండినా నష్టాలే మిగులుతున్నాయి. వ్యవసాయ రంగంలో పెరిగిన యాంత్రీకరణ, పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం కల్పిస్తుంది. ప్రపంచీకరణ ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రైతు, వినియోగదారుని మధ్య దళారీ వ్యవస్థ లాభాలను పొందుతుండగా గిట్టుబాటు కాక రైతు, కొనలేక వినియోగదారుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెట్టుబడి కోసం: మధ్య తరగతి రైతాంగం పెట్టుబడిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ రుణమాఫీ, బ్యాంకు రుణాలు చెప్పుకోవడానికి తప్ప రైతాంగానికి ఉపయోగపడ్డ దాఖలాల్లేవు. విడతల వారీ రుణమాఫీ రైతుకు నష్టాలే మిగిల్చింది. ప్రభుత్వం ఏం చెప్పినా రైతాంగానికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖంగా లేవనేది వాస్తవం. గతంలో గ్రామాల్లో ప్రయివేటు అప్పులు దొరికేవి. మారిన పరిస్థితుల్లో ప్రయివేటు అప్పులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఇచ్చినా రుణం తిరిగి తీర్చే మార్గం కనిపించడం లేదు. చివరకు రైతాంగం పరిస్థితి నానా తీసికట్టు నానం బొట్టు సామెతగా తయారైంది.
ప్రభుత్వమే పూనుకోవాలి: ఆత్మహత్యలు చేసుకుంటున్న వారంతా కౌలు, మధ్య తరగతి రైతులే. ఆత్మహత్య చేసుకునే వారిలో ఎక్కువ మంది గిరిజన రైతులే. బ్యాంకులతో నిమిత్తం లేకుండా తక్షణం పెట్టుబడి అందించేందుకు ప్రణాళిక రూపొందించాలి. ప్రకృతి విపత్తుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి పెట్టుబడి ఆధారంగా పరిహారం ఇవ్వాలి. పెట్టుబడి, దిగుబడిని పరిశీలించి మద్దతు ధర నిర్ణయించాలి. అన్నింటికి మించి రైతుల్లో ఆత్మసైర్యం కల్పించాలి. లేకపోతే రైతాంగం సాగుకు దూరం అవుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కోటి కుటుంబాలకు పైగా వ్యవసాయ రంగం నుండి వైదొలిగాయని ప్రభుత్వ లెక్కలే చెపుతున్నాయి. అందుకు నూటికి 70 మంది ఆధారపడిన వ్యవసాయ రంగం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. లేదంటే దేశం సంక్లిష్ట ఎదుర్కొవాల్సి వస్తుందని పాలకులు గ్రహించాలి.