Home కామారెడ్డి నీ రాక కోసం……

నీ రాక కోసం……

ఖరీఫ్‌పై ఆశలు సన్నగిల్లుతున్న వేళ…….

 

మన తెలంగాణ/బాన్సువాడ రూరల్:  వరుణ దేవుని కరుణ కోసం కామారెడ్డి రైతన్నలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మృగశిర కార్తె ముందు ఊరించిన వరుణుడు అంతా సిద్దం చేసుకున్న తర్వాత ముఖం చాటేయడంతో నీ రాక కోసం అంటూ ఆకాశం వైపు ఎదురు చూడటం, దేవునిపై భారం వేయడం తప్ప మరో దారి లేకుండా పోతుంది. గత యాసంగి సీజన్‌లో అటు భూగర్బ జలాలు తగ్గి, వర్షాభావ పరిస్థితులు ఉండటంతో నష్టపోయిన రైతన్నకు ఖరీఫ్‌పై ఎన్నో ఆశలు ఉండేవి. కాగా, ఖరీఫ్‌లో వరుణుడు కరుణించకపోవడంతో ఆశలన్ని సన్నగిల్లుతున్నాయి. ఒక్క చుక్క నీరు లేక అటు చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు ఎండు ముఖం పట్టగా, రాబోయే మరికొన్ని రోజుల్లో వర్షాలు కురియకుంటే తాగడానికి కూడా నీళ్లు దొరుకని పరిస్థితి నెలకొంటుందని కామారెడ్డి ప్రజలు  అభిప్రాయ పడుతున్నారు.

దేవునిపైనే భారం…..

ప్రజలకు ఆపద వస్తే ముందుగా తలుచుకునేది దేవున్నే. కాగా, ఈ సారి వరుణ దేవుడు రైతులకు కనుకరించకపోవడంతో దేవునిపై భారం వేయడం తప్ప మరో దారి లేకుండా పోతుంది. పంటలు వేసేందుకు పూర్తిగా సిద్దమవుతున్న తరుణంలో మృగశిర కార్తె కంటే ముందే చిరు జల్లులు కురియడంతో కొందరు ఈ సారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని అభిప్రాయ పడ్డారు. కాగా, మృగశిర కార్తె ముగిసి సుమారు 15 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కూడా లేకపోవడంతో దీంతో రైతులకు ఎటు పాలు పోకుండా ఉంది. వర్షం కురిస్తేనే తప్ప ఏం చేయని పరిస్థితి ఉండటంతో ఈ సారి కాలం ఎలా ఉంటుందోననే దిగాలు రైతన్నల్లో మెదులవుతుంది.

అంతా సిద్దం…..

ఖరీఫ్ సీజన్‌కు అన్ని సిద్దం చేసుకున్న రైతన్నకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఎరువులు, విత్తనాలు, దుక్కులు దున్నడం, వరి పంటలు వేసుకునే రైతన్నలు తూకం (కూతం) కూడా వేసి సిద్దం చేశారు. బోర్ల కింద కూడా నాట్లు వేద్దామంటే భూ గర్బ జలాలు అంతంత మాత్రమే ఉండటంతో ఏం చేయాలోననే బెంగ రైతన్నలో లేకపోలేదు. ఇక ఏం లాభం లేదని దేవుడు కరుణిస్తేనే ఖరీఫ్ సీజన్ లో గట్టెక్కుతామని రైతన్నలు దేవున్ని మనస్సారా వర్షాలు కురిపించాలని వేడుకుంటున్నారు.

 

Farmers wait for Rain in Telangana