Home నాగర్ కర్నూల్ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్షం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్షం

Farmers' welfare is a government target

రూ.50 లక్షలతో వివిధ కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన
రూ. 50 లక్షలతో నిర్మించిన పిఎసిఎస్ భవనం ప్రారంభోత్సవం
70 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేశాం
ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

మన తెలంగాణ/బిజినేపల్లి : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందని రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మాల, రజక, శాలివాహన, నాయీబ్రాహ్మణ కమ్యూనీటి భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనతోపాటు రూ.50 లక్షలతో నిర్మించిన పిఎసిఎస్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు కావడంతో సాగు ఏవిధంగా మారిస్తే రైతు బతుకు మారుతుందోనని ఆలోచించి రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. అందులో భాగంగానే సిఎంగా పదవీ చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుంటే కేవలం మూడు నెలల్లోనే రైతులకు సబ్సిడీ అందించాలని గుర్తు చేశారు. గతంలో ఎరువులు,విత్తనాల కోసం పోలీస్‌స్టేషన్లలో భారీగా నిలబడి చెప్పులను లైన్లో పెట్టినా సమయానికి తీసుకోలేక రోడ్లు ఎక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన కావల్సిన విత్తనాలు, ఎరువులు సకాలంలో తీసుకొచ్చి రైతులకు అందేలా ఏర్పాటు చేయడంతోపాటు గోదాముల నిర్మాణం చేపట్టారన్నారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో గత నెలలో రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.8 వేలు రెండు విడతల వారిగా పంట పెట్టుబడి అందించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. రైతులు సాగుకోసం అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రైతు మృతి చెందితే ఆ కుటుంబం రోడ్డు పాలుకాకుండా వారికి బరోసా కల్పించేందుకు ఉచిత రైతుభీమా పథకం ద్వారా కుటుంబానికి రూ.5 లక్షల భీమా అందేలా ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంజెఆర్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌విందు కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కిరణ్, ఎంపిపి ఎద్దుల రాములు, మైనార్టీ నాయకులు మహమూద్‌ఖాన్, ఖరీముల్లా, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.