Home తాజా వార్తలు కలెక్టరేట్ ముందు రైతుల ఆందోళన

కలెక్టరేట్ ముందు రైతుల ఆందోళన

Farmers worry before collectorate

భూ రికార్డులు సరిచేయాలని కోరుతూ  పత్తి మందు, కిరోసిన్ డబ్బాలతో ఆందోళన చేసిన రైతులు 

చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలానికి చెందిన పలువురు రైతులు భూ ప్రక్షాళనలో తమకు అన్యాయం జరిగిందని డబ్బులిస్తేనే పాసుబుక్ లు తయారు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ పత్తి మందు, కిరోసిన్ డబ్బాలతో సోమవారం కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చందుర్తి మండలం రామన్నపేటకు చెందిన భీమరాజు, కనకరాజు, రైతులు మాట్లాడుతూ భూ ప్రక్షాళనలో తమ రికార్డులను తప్పుల తడకగా రూపొందించారని వాటిని సరిచేయాలని తహసీల్దార్‌ను సంప్రదిస్తే ఆయన సరిగా స్పందించడం లేదని అందువల్లే కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. రామన్నపేట గ్రామ రైతులతో పాటు వివిధ గ్రామాల రైతులు రెవెన్యూ అధికారుల తప్పులకు రైతులుగా తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను శాంతింపజేయడానికి పోలీసులు, ఆర్డీవో విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా రైతుల వద్దకు వచ్చిన కలెక్టర్ కృష్ణభాస్కర్ రైతులతో మాట్లాడుతూ రైతుల రికార్డులను సరి చేయిస్తానని ఆయా గ్రామాలకు ఆర్డీవోను స్వయంగా పంపించి విచారణ జరిపించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. దాంతో రైతులు తమ ఆందోళనను విరమించి స్వగ్రామాలకు తిరిగి వెళ్లారు. ఈ కార్యక్రమంలో దేవసాని రాజేందర్, తిప్పని తిరుపతి, పోతరాజు భూమక్క, నక్క పోచయ్య, కోరుట్ల లక్ష్మిరాజం, పన్యాల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.