Search
Sunday 23 September 2018
  • :
  • :

అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి : ఫరూక్ అబ్దుల్లా

Farooq-Abdullahశ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో బిజెపితో ఎన్‌సిపి పొత్తు కుదుర్చుకోబోతుందన్న ఊహాగానాలకు ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా తెరదించారు.  తామెప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని ఆదివారంనాడు స్పష్టం చేశారు. ఇప్పటివరకైతే తమకు ప్రజల మద్దతు లేదు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటు గురించి తాము నిర్ణయం తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. బిజెపి, పిడిపి ప్రభుత్వ ఏర్పాటులో పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ఈ ప్రతిష్టంభనకు ఇప్పటికైనా ముగింపు పలకాలని ఆ పార్టీలకు హితవుపలికారు. అదీ చేతకాకపోతే అసెంబ్లీని రద్దు చేసి,  తాజాగా ప్రజల తీర్పు కోరుతూ మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతానికైతే ప్రజల తీర్పు వాళ్లవైపే ఉంది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ఆయన పేర్కొన్నారు. శనివారం జరిగిన ఓ సమావేశంలో అబ్దుల్లా మాట్లాడుతూ బిజెపి నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తే తమ పార్టీ నేతలంతా సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటామని,అందుకు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు.మరోవైపు బిజెపితో కూటమి కొనసాగించడానికి పిడిపి అంత సుముఖంగా లేదన్న వార్తల నేపథ్యంలో ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి. ఫరూక్ వ్యాఖ్యలను ఒమర్ కూడా సమర్ధించినట్టు సమాచారం.

Comments

comments