Home జాతీయ వార్తలు మా కుటుంబం తలుచుకుంటే ఇండియా ఉండదు

మా కుటుంబం తలుచుకుంటే ఇండియా ఉండదు

Farooq Abdullahమోడీ వ్యాఖ్యపై ఫారుక్ అబ్దుల్లా తీవ్ర ప్రతిఘటన
తుపాకులతో కశ్మీరీలను గెలవలేరని స్పష్టీకరణ

శ్రీనగర్: అబ్దుల్లాలు, ముఫ్తీలు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యపట్ల నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారుక్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. భారతదేశాన్ని విడగొట్టాలని తమ కుటుంబం తలుచుకుంటే ఇండియానే ఉండదు… అని తీవ్రస్వరంతో హెచ్చరించారు. కటువా జిల్లాలో ఆదివారం ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మోడీ… అబ్దుల్లాలు, ముఫ్తీలపై విరుచుకుపడ్డారు. ఈ రెండు కుటుంబాలు జమ్మూకశ్మీర్‌లోని మూడు తరాలను నాశనం చేశాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశాన్ని చీల్చడానికి వారిని అనుమతించనని మోడీ చెప్పారు. ప్రధాని వ్యాఖ్య ఫారుక్ అబ్దుల్లాకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ‘ముస్లింలు, హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు… ఇలా ఏ మతంవారైనా సరే…ప్రజలందరి హక్కులకోసం మా పార్టీ పోరాడుతోంది. ఒకవేళ మోడీ ఎంత ప్రయత్నించినా భారతదేశాన్ని చీల్చడం ఆయనవల్ల కాదు. ఈ వేదిక నుంచి నేనొకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు (మోడీ) విడగొట్టాలనుకున్నా ఇండియా విడిపోదు. అబ్దుల్లాలు ఇండియాను విచ్ఛిన్నం చేసేందుకు చూస్తున్నారని మీరన్నారు.

నిజంగా మేము భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకుంటే ఆ రోజు అసలు ఇండియానే ఉండదు’ అని హెచ్చరించారు. మోడీ ఒకటి గుర్తుంచుకోవాలి. 1996లో ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ఎవరూ సిద్ధంగా లేరు. మనం పోటీ చేయకూడదని మా సహచరులు చెప్పినా నేను వినలేదు. ఎన్నికలు జరపాలన్నాను. ప్రజలు తమ కష్టాలనుంచి బయటపడాలి. నేను ఈ దేశ పతాకాన్ని చేతపట్టుకొని, కష్టకాలంలో వెంట ఉన్నాను. మోడీ! మీరెప్పటికీ దాన్ని మరచిపోకూడదు. అప్పుడు మీ వెంట ఎవరూ లేరు. ఇప్పుడు మీరు అరిచి కేకలు పెడుతున్నారు’ అని ఫారుక్ అబ్దుల్లా ఆనాటి సంఘటనను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనను కూడా ప్రస్తావించారు. కేంద్రం శక్తివంతమైన తిరుగుబాటు నిరోధక చట్టం తెస్తుందని రాజ్‌నాథ్ చెప్పారు. ‘మీరేం చేస్తారో చేసుకోండి. కానీ తుపాకులతోనో, జాతీయ రహదారిని మూసివేసో, ఏదైనా అన్యాయం చేసో మోడీ, బిజెపి కశ్మీరీల హృదయాలను గెలుచుకోలేరు’ అని స్పష్టం చేశారు.

Farooq Abdullah Slams PM Modi